- హౌ ఇండియా గివ్స్ రిపోర్ట్ షాక్
- ఆస్తులు లేకున్నా మనసున్న దాతలు
- దేశంలో పదింట ఏడుగురి ఘనత
- ఏటా 54 వేల కోట్ల రూపాయల భారీ వితరణ
- మతం వెనుక పరిమళిస్తున్న మానవత్వం
- తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు టాప్
సహనం వందే, హైదరాబాద్:
భారత్ అపర కుబేరుల దేశం మాత్రమే కాదు. అపారమైన దానగుణం ఉన్న సామాన్యుల దేశమని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఆస్తులు ఉన్నవారి కంటే ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మధ్యతరగతి వర్గమే దేశానికి అసలైన వెన్నెముకగా మారుతోంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు. ఒక దేశం తన తోటి మనిషి పట్ల చూపే అత్యున్నత మానవీయ కోణం.

పెట్టుబడిదారుల కంటే మిన్న
దేశంలో దాతృత్వం అంటే కేవలం కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా బిలియనీర్ల విరాళాలు మాత్రమే కాదు. అశోకా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రోపీ నివేదిక అంచనాల ప్రకారం సామాన్యులే ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తున్నారు. హౌ ఇండియా గివ్స్ 2025 నివేదిక సంప్రదాయ వాదనలను సవాలు చేస్తోంది. సంస్థాగత పెట్టుబడిదారుల కంటే గృహస్థులే ఏటా 54 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని దానంగా ఇస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగుతోంది.
దానంలో విలక్షణ శైలి
భారతీయులు ఇచ్చే సాయం కేవలం నగదుకే పరిమితం కావడం లేదు. 68 శాతం మంది ఏదో ఒక రూపంలో దానం చేస్తున్నారు. ఇందులో 48 శాతం మంది ఆహారం లేదా బట్టల రూపంలో సాయం చేస్తున్నారు. 44 శాతం మంది నగదు ఇస్తుంటే… మరో 30 శాతం మంది స్వచ్ఛంద సేవకు వెచ్చిస్తున్నారు. కోల్‌కతా వంటి నగరాల్లో ఉచిత భోజన కేంద్రాలు దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
మతవిశ్వాసం… మానవత్వం
భారతీయులను దానం వైపు నడిపించే ప్రధాన శక్తి మతం. విరాళాలు ఇచ్చే వారిలో 90 శాతానికి పైగా ప్రజలకు మతపరమైన విశ్వాసాలే ప్రేరణగా ఉంటున్నాయి. మొత్తం విరాళాల్లో 45.9 శాతం మత సంస్థలకే వెళ్తున్నాయి. అలాగే 40 శాతం మంది యాచకులకు నేరుగా సాయం అందిస్తున్నారు. మతేతర సేవా సంస్థలకు కేవలం 14.9 శాతం మాత్రమే అందుతున్నాయని సర్వేలో తేలింది.

చదువు… ఆదాయం
దానగుణానికి చదువుకు మధ్య అవినాభావ సంబంధం ఉందని ఈ నివేదిక చెబుతోంది. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా దానధర్మాలు చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా నెలకు నాలుగైదు వేల రూపాయల ఆదాయం ఉన్న వారిలో కూడా సగం మంది దానం చేస్తున్నారు. ఆదాయం పెరిగే కొద్దీ దానం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందులో లింగపరమైన అంశాలు కూడా ఉన్నాయి. మగవారి ప్రాబల్యం ఉన్న ఇళ్లలో మతపరమైన విరాళాలు ఎక్కువగా ఉంటే… మహిళల నిర్ణయం ఉన్న చోట నిరుపేదలకు సాయం అందుతోంది.
నేరుగా అడిగితే తక్షణమే స్పందన…
ప్రజలకు నేరుగా కంటికి కనిపించే సాయం చేయడమే ఇష్టం. 25 శాతం మంది ఎదురుపడి అడిగినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు. డిజిటల్ ప్రచారాల కంటే ఇళ్ల వద్దకు వచ్చి సేకరించేవారు లేదా ప్రార్థనా స్థలాల్లో ఇచ్చే విరాళాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. 20 రాష్ట్రాల్లోని 7 వేల మంది అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇది సామాజిక జీవితంలో ఇమిడిపోయిన ఒక క్రమబద్ధమైన అలవాటుగా నివేదిక అభివర్ణించింది.
దక్షిణాది రాష్ట్రాలు టాప్…
ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు దానధర్మాల్లో ముందున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణాలో విరాళాల సంస్కృతి బలంగా ఉంది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో సగటున 2 నుంచి 3 శాతాన్ని ఏదో ఒక సామాజిక కార్యక్రమానికి కేటాయిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో మతపరమైన ఉత్సవాల సమయంలో విరాళాల వెల్లువ ఎక్కువగా కనిపిస్తోంది.
పట్టణ వర్సెస్ గ్రామీణ
పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం వల్ల నగదు రూపంలో ఇచ్చే విరాళాలు 55 శాతంగా ఉన్నాయి. దీనికి భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తు రూపంలో ఇచ్చే సాయం 60 శాతానికి పైగా ఉంది. పల్లెల్లో ప్రజలు ధాన్యం, పాత బట్టలు లేదా పశుగ్రాసాన్ని దానంగా ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ప్రాంతాన్ని బట్టి దాన స్వరూపం మారుతోంది తప్ప దానగుణం మాత్రం తగ్గడం లేదు. దాతృత్వ అల అనేది కింద నుంచి ఎగసి పడుతున్న గొప్ప మానవీయ కెరటం.