కవిత కన్నీటి పోరాటం – సొంత పార్టీ పెట్టేందుకు సన్నాహం

Kavitha New Party
  • తండ్రి కేసీఆర్ తిరస్కారంతో అవమానభారం
  • ఆధునిక సమాజంలో వారసుడికే పట్టాభిషేకం
  • ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న దారుణం
  • దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
  • అవకాశం ఇస్తే అందరూ ఇందిరలే

సహనం వందే, హైదరాబాద్:

అధికార దాహం ముందు రక్తసంబంధం వెలవెలబోతోంది. వారసుడిని గద్దెనెక్కించే క్రమంలో కన్నకూతుళ్లనే బలిపీఠం ఎక్కిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ గురించి గొప్పలు చెప్పే నేతలు సొంత కూతురి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం అని డబ్బాలు కొట్టుకునే నేతలు వాస్తవానికి వచ్చేసరికి సొంత కూతుళ్లనే తొక్కుతున్నారు. రాజకీయ చదరంగంలో ఆడబిడ్డలు బలిపశువులవుతున్నారు. వారసుల కోసం కన్నబిడ్డలను కాదనుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

కవితను పక్కన పెట్టిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కవితకు నేడు సొంత పార్టీలోనే ప్రాధాన్యం తగ్గింది. తండ్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ మీద ఉన్న ప్రేమతో కవితను పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అందుకే కవిత తన తండ్రి, సోదరునితో పోరాడి బయటకు వచ్చారు. త్వరలో ఆమె పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు రాజకీయాల్లో నిప్పులా మండుతున్నాయి. కూతురిపై కక్ష పెంచుకుని వారసుడికి రక్షగా నిలవడం కేసీఆర్ లాంటి అగ్రనేతకు తగదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జైలు కష్టాలు… కరగని కేసీఆర్
కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం చూడటానికి కూడా వెళ్లకపోవడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనం. అదే ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్తే కేసీఆర్ చూడకుండా ఉండేవారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి కన్నకూతురి విషయంలో ఇంత వివక్ష చూపడం విచారకరం. రాజకీయ చదరంగంలో ఆడబిడ్డ ఆక్రందన ఎవరికీ వినిపించడం లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలనే కవిత ధైర్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక కుటుంబం సమస్య కాదు. వ్యవస్థలోని పురుషాధిక్యతకు నిదర్శనం.

కవిత కొత్త బాట… సవాళ్లు
రాజకీయ వారసత్వం కేవలం కొడుకులకే సొంతం అనే భావనను కవిత సవాల్ చేస్తున్నారు. సొంతవారే వెన్నుపోట్లు పొడుస్తున్న ఈ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కవిత కన్నీటి సంతకం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీయబోతోంది. పితృస్వామ్య కోటలను బద్ధలు కొట్టి ఆమె ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది.

Sharmila , Kavitha and Rohini

తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డల అగచాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీలో సొంత కూతురు పురంధేశ్వరికి స్థానం దక్కలేదు. ఆమె ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు తలచుకుంటే ఆమెకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదే కానీ అది జరగలేదు. ఇక జగన్ సోదరి షర్మిల పరిస్థితి కూడా అంతే. అన్నతో విభేదించి ఆమె రోడ్డున పడ్డారు. సొంత చెల్లెలు విషయంలో జగన్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

జాతీయ స్థాయిలో మహిళా పరాభవం
తమిళనాడులో జయలలితకు అసెంబ్లీ సాక్షిగా జరిగిన పరాభవం ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా రాజకీయ వారసత్వ పోరాటంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణిని పార్టీ ఓటమి నెపంతో ఇంటి నుంచి గెంటేయడం సంచలనం సృష్టించింది. యూపీలో ములాయం సింగ్ కోడలు అపర్ణ కూడా వివక్ష తట్టుకోలేక బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో ఇన్నాళ్లకు ప్రియాంక గాంధీ అవసరం గుర్తుకు రావడం గమనార్హం. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఉక్కు మహిళలుగా నిరూపించుకున్నా నేటికీ మహిళలకు రాజకీయాల్లో సమానత్వం దక్కడం లేదు.

అవకాశం ఇస్తే అందరూ ఇందిరలే
మహిళలకు సరైన అవకాశాలు ఇస్తే అందరూ ఇందిరాగాంధీల్లా దేశాన్ని నడిపించగలరు. కేవలం సోషల్ మీడియాలో స్లోగన్లు ఇస్తే సరిపోదు. రాజకీయ పార్టీలు తమ ఇంట్లోని ఆడబిడ్డలకు, కోడళ్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. బయట ప్రజలకు ఒక మాట.. ఇంట్లో ఒక మాట చెప్పే ద్వంద్వ నీతిని వీడాలి. కాలం మారింది కానీ నాయకుల ఆలోచనలు మారడం లేదు. లింగ వివక్షను వీడి మహిళలకు రాజకీయ పీఠాల్లో సమాన వాటా ఇచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇప్పుడు కవిత వేయబోయే అడుగు ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పు తెస్తుందో చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *