చితి మంటల్లో తండ్రి ప్రేమ – అమెరికా కొడుకు ఆధునిక వికృత పోకడ

Father - Son Realization
  • అంత్యక్రియలకు ఈవెంట్ మేనేజ్‌మెంట్
  • తండ్రి ముందస్తు జాగ్రత్తతో కన్నీరు మున్నీరు
  • మట్టిలో కలిసిన గర్వం..బూడిదైన అహంకారం

సహనం వందే, రాజమండ్రి:

మనం ఎదిగే క్రమంలో మనల్ని మోసిన భుజాలను మర్చిపోతాం. కానీ ఆ భుజాలు మాత్రం తాము మట్టిలో కలిసే వేళ కూడా మనకు ముల్లు గుచ్చుకోకూడదని పరితపిస్తాయి. పూణేలోని ఒక శ్మశానవాటిక సాక్షిగా డాలర్ల వేగంతో పరుగెడుతున్న ఒక కొడుకు అహంకారం… తన చావును కూడా ఒక సౌకర్యంగా మార్చిన తండ్రి ప్రేమ ముందు కుప్పకూలింది. ఇది కేవలం ఒక మరణం కాదు… మృతప్రాయమైన మానవ సంబంధాల పునర్జన్మ.

నాన్న శవం… శ్మశానంలో అసహనం
పూణేలోని ఆ పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం మూడైంది. గాలిలో కాలిపోతున్న కట్టెల వాసన… నిశ్శబ్దాన్ని చీల్చుతున్న గొంతులు. అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల రోహన్… ఫ్లైట్‌ దిగిన వెంటనే నేరుగా అక్కడికి వచ్చాడు. అతని తండ్రి సదాశివరావు అంతకుముందు రాత్రి మరణించారు. రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు ఉన్నాయి. చెమటలు కారుస్తూ నిమిషానికోసారి గడియారం చూస్తున్న రోహన్ కళ్లలో తండ్రి పోయిన వేదన కంటే.‌‌.. మళ్లీ సాయంత్రం ఆరు గంటల ఫ్లైట్ మిస్ అవుతుందనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

రెండు బొట్ల కన్నీళ్లు…
అక్కడ ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకుడు సుమిత్ అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చారు. పూజారి వచ్చాడు. రోహన్ తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు… రెండు బొట్ల కన్నీళ్లు రాలాయి. కానీ వెంటనే కార్పొరేట్ వేగం అతనిపై దాడి చేసింది. ‘సుమిత్… అన్నీ రెడీనా? నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దయచేసి త్వరగా ముగించండి’ అని కోరాడు. ఆ కొడుకు మాటలకు సుమిత్ నిశ్చేష్టుడయ్యాడు. తండ్రికి కనీసం మూడు గంటల సమయం కూడా దక్కదా అన్నట్లు మౌనంగా చూశాడు.

అస్థికలు… చెక్కుబుక్కు
అంత్యక్రియలు జరిగాయి. రోహన్ చితికి నిప్పు పెట్టాడు. పొగ ఆకాశంలోకి ఎగిసింది. ఆ పొగలో తన తండ్రి ఆత్మ కలిసిపోతుండగా… రోహన్ మాత్రం చెక్కుబుక్కు తీసి సుమిత్ వైపు నడిచాడు. ‘సుమిత్… థ్యాంక్స్. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎంత బిల్ అయ్యింది? లక్షా రెండు లక్షలా చెప్పండి ఇప్పుడే చెక్ రాస్తాను. పైగా మళ్లీ రావడం నాకు కుదరదు… అస్థికల నిమజ్జనం కూడా మీరే చూసుకోండి’ అని అన్నాడు. ఆ మాటల్లో తండ్రి రుణం తీర్చుకోవాలనే తపన లేదు..‌. ఈ బాధ్యత నుంచి త్వరగా విముక్తి పొందాలనే ఆరాటం ఉంది.

A Father's Love

కన్నతండ్రి ముందు జాగ్రత్త
సుమిత్ విచిత్రంగా నవ్వి… ‘సర్… మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించడం జరిగింది’ అని అన్నాడు. రోహన్ ఆశ్చర్యపోయి ‘ఎవరు చెల్లించారు?’ అని ప్రశ్నించాడు. సుమిత్ గొంతులో భారంతో చెప్పాడు. ‘ఐదేళ్ల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు. అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు. నడవడమే కష్టంగా ఉంది’ అని చెప్పాడు. ‘నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా?’ అని అడిగారు. అదే రోజు ఆయన ముందస్తుగా 50 వేల రూపాయలు చెల్లించి ఈ లేఖ నాకిచ్చారు’ అని చెప్పాడు.

అక్షర రూపంలో తండ్రి స్పర్శ…
వణుకుతున్న చేతులతో రోహన్ ఆ లేఖ విప్పాడు. ఆ కాగితంపై ఉన్న అక్షరాలు తండ్రి చేతి స్పర్శలా రోహన్‌ను తాకాయి. అందులో ఇలా ఉంది:
ప్రియమైన చిన్ను (రోహన్)
నువ్వు అమెరికాలో చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. నీ ప్రపంచం వేరు… నీ గమ్యం వేరు. నా మరణం నీ కెరీర్‌కు ఆటంకం కాకూడదు. అందుకే నా అంత్యక్రియల బాధ్యతను నేనే ముందస్తుగా ‘ఔట్‌సోర్స్’ చేశాను. డబ్బులు చెల్లించాను… ఏర్పాట్లు చేయించాను. నువ్వు రావాలని నేను ఆశపడటం లేదు.‌‌.. రాకపోయినా బాధపడను. నిన్ను ప్రపంచాన్ని జయించడానికే పెంచాను… కానీ ఒక ముసలివాడి చితి ముందు ఏడవడానికి కాదు. చిన్ను… చిన్నప్పుడు నిన్ను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు నీ చేయి నేను ఎప్పుడూ వదల్లేదు. ఈ రోజు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చేయి వణకకూడదు. నీ భార్య ఎదురుచూస్తుంటుంది, త్వరగా వెళ్ళు. నీ నాన్న’ అంటూ ముగించాడు
.

బూడిదైన అహంకారం…
ఆ లేఖ చదువుతుంటే రోహన్ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. గాలిలోని పొగ అతని గొంతును నులిమేస్తోంది. రోహన్‌కు తాను చేసిన తప్పు అర్థమైంది. కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కాలం అతనికి ఇవ్వలేదు. రోహన్ చేతిలోని చెక్‌బుక్ మట్టిలో పడిపోయింది. అతను మోకాళ్లపై కూలబడి… ఆ బూడిద కుప్ప ముందు వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నాన్నా.. నన్ను క్షమించు’ అన్న అతని అరుపు శ్మశానపు గోడల మధ్య ప్రతిధ్వనించింది.
ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు. ఆ రాత్రంతా చితి మంటల వెలుగులో అక్కడే కూర్చున్నాడు.

తండ్రి ప్రేమ అనంతం…
తండ్రి ప్రేమ అనంతం… దాన్ని ఏ కరెన్సీతోనూ చెల్లించలేం. ఈవెంట్ ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు… కానీ కన్నీళ్లు… అవి ఔట్‌సోర్స్ చేయలేము. అవి రక్తం నుంచే రావాలి. మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు అసౌకర్యంగా భావించి దూరం కాకండి.

గురజాల కిరణ్ కుమార్, రిటైర్డ్ ఆర్మీ, రాజమండ్రి
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *