- డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు నష్టం
- తమిళనాడు ప్రభుత్వానికి ఖతర్నాక్ రిపోర్ట్
- సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని మండిపాటు
సహనం వందే, తమిళనాడు:
భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధిని సాధించినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించడం ద్వారా శిక్షించడం ఏమాత్రం సమర్థనీయం కాదని కమిటీ తన నివేదికలో నొక్కి చెప్పింది.

జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు…
డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం తలల గణన మాత్రమే ప్రామాణికం కాకూడదని జస్టిస్ కురియన్ జోసెఫ్ సూచించారు. ఈ కమిటీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియమించారు. అనంతరం ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచికలు, అక్షరాస్యత శాతం, తలసరి ఆదాయం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేలా కొత్త శాస్త్రీయ ఫార్ములాను రూపొందించాలని కమిటీ ప్రతిపాదించింది. జనాభా విస్ఫోటనం జరుగుతున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల బాధ్యతాయుతమైన రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోయి ప్రజాస్వామ్య అసమానతలు పెరుగుతాయని కమిటీ విశ్లేషించింది.
రాజకీయ ఏకాభిప్రాయం అత్యవసరం
రాజ్యాంగబద్ధమైన ఈ ప్రక్రియలో రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే అఖిలపక్ష ఏకాభిప్రాయం అత్యవసరమని కమిటీ పేర్కొంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెరుగుతున్న రాజకీయ వ్యత్యాసాలను పరిష్కరించేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలని సూచించింది. సమాఖ్య వ్యవస్థను కాపాడటం అనేది సంఖ్యాబలం కంటే ప్రధానమైన అంశమని… ఏ ఒక్క ప్రాంతం కూడా పార్లమెంటులో వివక్షకు గురవుతున్నామనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని జస్టిస్ కురియన్ జోసెఫ్ బృందం స్పష్టం చేసింది.
ఆకాశాన్నంటుతున్న ఎన్నికల ఖర్చు…
మరోవైపు దేశంలో ఎన్నికల నిర్వహణ వ్యయం ఆకాశాన్ని తాకడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఆస్తుల విలువ, రాజకీయ పార్టీలు వెచ్చిస్తున్న నిధులు అంతర్జాతీయ ప్రమాణాలను మించిపోతున్నాయి. కేవలం సంపన్నులకే రాజకీయాలు పరిమితమయ్యే ప్రమాదం ఉందని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెరిగే సీట్ల సంఖ్యతో ఈ ధన ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.