కుటుంబంలో కుట్ర… కవిత కుతకుత – కన్నీటి గీత దాటి కవితమ్మ విప్లవం!

Kavitha family
  • బంధాల వెనుక మోసం
  • అణచివేతపై ధిక్కార స్వరం
  • ఒంటరిగా రాజకీయ రణక్షేత్రం
  • కవిత కొత్త పార్టీ… బీసీ నినాదమే అస్త్రం

సహనం వందే, హైదరాబాద్:

కొన్నిసార్లు మనం ఎవరి కోసం యుద్ధం చేస్తామో వారే మనకు తెలియకుండా మన వెనుక గోతులు తవ్వుతుంటారు. బంధుత్వం అనేది ఒక సురక్షితమైన నీడ అనుకుంటాం కానీ ఒక్కోసారి అదే నీడ మన అస్తిత్వాన్ని కప్పేసే చీకటిగా మారుతుంది. కల్వకుంట్ల కవిత ప్రయాణం ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. తండ్రి బాటలో నడిచిన ఒక బిడ్డ… ఇప్పుడు ఆ తండ్రి నీడ నుంచి, అన్న అహంకారం నుంచి బయటకు వచ్చి.. తనకంటూ ఒక కొత్త ఆకాశాన్ని వెతుక్కుంటోంది.

రక్తసంబంధం.. రాజకీయ కుతకుత
తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించిన తండ్రిని చూస్తూ పెరిగిన బిడ్డ ఆమె. కేసీఆర్ గట్స్‌ చూసి ఇన్ స్పైర్ అయ్యి తండ్రి వెంటే నడిచింది. కానీ కాలం ఎంత క్రూరమైందంటే ఈరోజు ఆమె పక్కన ఎవరూ లేరు. తండ్రి మాట్లాడడు, అన్న పట్టించుకోడు. మహిళ అనే ఒకే ఒక్క కారణంతో ఆమెను రాజకీయంగా అణగదొక్కారు. సొంత ఇంట్లోనే కుట్రలు మొదలైనప్పుడు ఆ రక్తం కన్నా ప్రజలే మిన్న అని ఆమె గ్రహించింది. అందుకే ఆ గీత దాటి బయటకు వచ్చింది.

జైలు గోడలు నేర్పిన పాఠం
నిశ్శబ్దానికి ఒక భాష ఉంటుంది. అది జైలు గదిలో కవితకు అర్థమైంది. లిక్కర్ కేసులో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించినా ఆ నాలుగు గోడల మధ్య గడిపిన కాలం ఆమెకు జీవిత సత్యాన్ని బోధించింది. అధికారం ఉన్నప్పుడు చుట్టూ ఉండేవారు బంధువులు కాదు. కష్టంలో తోడుండేవారే నిజమైన మనుషులని ఆమె తెలుసుకున్నారు. బయటకు వచ్చాక మాయమాటలు చెప్పే బంధువుల ముసుగులను ఆమె నిలదీశారు. తన అంతరాత్మ చెప్పిన ధైర్యంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు.

నిజామాబాద్ ఓటమి నేర్పిన పాఠం
మనం ఓడిపోయినప్పుడు మన వాళ్లు ఓదారుస్తారని అనుకుంటాం. కానీ నిజామాబాద్‌లో రెండోసారి ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆ ఓటమికి కారణం తనవారేనని కవితకు అర్థమైంది. పార్టీ గెలిచినా తను ఎందుకు ఓడిపోయింది? ఈ ప్రశ్న వెనుక తన కుటుంబ సభ్యుల రాజకీయ చదరంగం కనిపించింది. నిజానికి ఆ పరాజయం ఒక వరంలా మారింది. ఎవరెవరు తనవారో… ఎవరెవరు వెన్నుపోటు పొడిచారో ఆమెకు స్పష్టంగా తెలిసింది. గెలుపోటముల మధ్య ఉన్న సన్నని గీతను ఆమె అతి త్వరగా గ్రహించగలిగారు.

బీసీ నినాదం.. కొత్త అస్త్రం
పదేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదన్న సత్యం ఆమెను కలచివేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా వారి కన్నీళ్లు తుడవలేదని ఆమె నమ్ముతున్నారు. అందుకే రాజకీయ ప్రయాణంలో గమ్యం మార్చుకున్నారు. తన ఆవేదనను, ఆత్మగౌరవాన్ని బీసీ నినాదంగా మలిచారు. స్వరాష్ట్రం వచ్చినా ప్రజల బతుకులు మారలేదని, వారి కోసం తన స్వరం వినిపించాల్సిన సమయం వచ్చిందని భావించి సొంత పార్టీ వైపు అడుగులు వేశారు. అది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, ఒక బాధితురాలి తిరుగుబాటు.

మహిళా శక్తికి నిదర్శనం
నాలుగు గోడల మధ్య మగ్గిపోవడానికి ఆమె సిద్ధంగా లేదు. భ్రమల ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంత పార్టీలో లేని గౌరవం, అనుబంధం ప్రజల దగ్గర దొరుకుతాయని ఆమె నమ్మకం. ఒక మహిళ తలచుకుంటే ఏమైనా సాధించగలదని నిరూపించడానికి కవిత ఇప్పుడు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం ఒక్కటే.. ప్రజాక్షేత్రంలో గెలవాలి, తనను తొక్కేయాలని చూసిన వారికి తన సత్తా ఏంటో చూపించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *