డాక్టర్ల చేతిలో గరిటె – వైద్యుడి చేతి వంట… కిచెనే కొత్త క్లినిక్

Kitchen Clinic
  • రోగానికి మందుల బదులు మంచి భోజనం
  • వైద్య విద్యార్థులకు సరికొత్త ఆరోగ్య పాఠం
  • అమెరికాలో స్టెతస్కోప్ వదిలిన డాక్టర్లు
  • ‘ఫుడ్ ఈజ్ మెడిసిన్’ అనే నినాదం
  • ప్రిస్క్రిప్షన్లలో వంటల రెసిపీలు

సహనం వందే, హైదరాబాద్:

వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు మెడిసిన్ పుస్తకాలను పక్కన పెట్టి వంట గిన్నె పట్టుకుంటున్నారు. రోగానికి మందు బిళ్లలు ఇవ్వడం కంటే రోగం రాకుండా వంట చేయడం నేర్పడమే గొప్ప వైద్యమని వారు నమ్ముతున్నారు.

ఆపరేషన్ థియేటర్ నుంచి కిచెన్‌కు…
లారెన్ ఎస్టెస్ అనే యువతి చేతులు గర్భిణీలకు కాన్పులు చేయాలి. కానీ ఇప్పుడు ఆ చేతులు టఫ్ట్స్ యూనివర్సిటీ వంటగదిలో శనగలను ఉడికిస్తున్నాయి. డాక్టర్ అవ్వాలంటే సర్జరీ చేయడమే కాదు… ఆరోగ్యకరమైన భోజనం వండడం కూడా తెలియాలని ఆమె తెలుసుకుంది. మందులతో జబ్బును ఆపడం కంటే మంచి ఆహారంతో దాన్ని రాకుండా చేయడం మిన్న అని ఆమె భావిస్తోంది. ఇది కేవలం వంట కాదు… ఒక ప్రాణాన్ని కాపాడే ప్రక్రియ.

కాలం మారుతోంది… పాఠం మారుతోంది
ఎలిజా లియోన్ అనే డైటీషియన్ దగ్గర 15 మంది వైద్య విద్యార్థులు ఇప్పుడు కిచెన్‌నే క్లాస్ రూమ్‌గా మార్చుకున్నారు. 2012లో తులనే మెడికల్ స్కూల్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ఇప్పుడు 60 స్కూళ్లకు పాకింది. ఇందులో కేవలం డాక్టర్లే కాదు డెంటిస్టులు కూడా ఉన్నారు. వేలకు వేలు ఖర్చు చేసే మందుల కంటే తక్కువ ధరకు దొరికే కూరగాయలే మేలని వీరు గణాంకాలతో నేర్చుకుంటున్నారు. 2 నెలల పాటు సాగే ఈ క్యూలినరీ మెడిసిన్ కోర్సు ఇప్పుడు వైద్యరంగంలో సరికొత్త ఆశ.

విరోధుల మధ్య వింత స్నేహం
ఆహారం విషయంలో అమెరికాలో ఇప్పుడు రెండు భిన్న వర్గాలు ఒక్కటయ్యాయి. పర్యావరణం కోసం పోరాడే వారు ఒకవైపు ఉంటే.. దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలనే మరో వర్గం వారు ఇంకోవైపు ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు ఒకే చోట కలిశారు. కిమ్ సెవెర్సన్ రిపోర్ట్ ప్రకారం… బోస్టన్ నగరంలో ఇప్పుడు ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే నినాదం ఊపందుకుంది. ఇది కేవలం మాట కాదు… ఒక సామాజిక విప్లవం. రాజకీయాలు ఏవైనా ప్రజల ఆరోగ్యం ముఖ్యం అనే సూత్రం ఇక్కడ అమలవుతోంది.

యాపిల్ కథ వెనుక అసలు నిజం
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లక్కర్లేదనే పాత సామెత ఇప్పుడు ఆధునిక సైన్స్ అయింది. దీన్నే అమెరికన్ కాలేజీ ఆఫ్ క్యూలినరీ మెడిసిన్ తన సిలబస్‌లో చేర్చింది. టోనీ లువాంగ్ తీసిన ఫోటోలలో వైద్య విద్యార్థులు శ్రద్ధగా కూరగాయలు కోస్తూ వంటలు చేస్తున్నారు. జబ్బుకు తగ్గట్టుగా వంట చేయడం నేర్చుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చులు భారీగా తగ్గుతాయని వీరు నిరూపిస్తున్నారు. లక్షల రూపాయల ఆసుపత్రి బిల్లుల కంటే వంటింటి వస్తువులే శక్తివంతమైనవని వీరు చాటుతున్నారు.

ప్రిస్క్రిప్షన్లలో వంటల రెసిపీలు…
ఆహారానికి మెడిసిన్‌కు సంబంధం లేదనేది ఒక పెద్ద భ్రమ అని లారెన్ ఎస్టెస్ కుండబద్దలు కొట్టింది. ఆమెలాంటి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిస్క్రిప్షన్లలో వంటల రెసిపీలు రాసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మందులు శరీరాన్ని బతికిస్తే మంచి ఆహారం మనిషిని నిలబెడుతుంది. ఆసుపత్రి వాసన కంటే వంటింటి పోపు గుమగుమలే రేపటి డాక్టర్ల అసలైన ఆయుధాలు.

ఆయుష్షును పెంచే వంటకాలు…
టఫ్ట్స్ యూనివర్సిటీలోని ఆ టీచింగ్ కిచెన్ ఇప్పుడు ఒక కొత్త దేవాలయం. అక్కడ మరుగుతున్న వంటకాలు కేవలం ఆకలి తీర్చవు… ఆయుష్షును పెంచుతాయి. డాక్టర్లు స్టెతస్కోప్ పక్కన పెట్టి గరిటె పట్టడం అంటే లోకం ఆరోగ్యంగా మారబోతోందని అర్థం. ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించుకోవడం కంటే ఇంట్లో ప్రేమతో వండుకున్న కూరలే అసలైన స్వస్థతని ఈ వైద్య విద్యార్థులు మనకు గుర్తు చేస్తున్నారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *