హీరోస్ ఆఫ్ రోడ్… ఫుల్లీ అన్-లోడ్! – ఆగిపోతున్న లారీ చక్రం.. ఆకలి చిత్రం

Life of Lorry Drivers
  • పాలకుల నిర్లక్ష్యం.. డ్రైవర్ల కొరత తీవ్రం
  • కునారిల్లుతున్న రవాణా రంగం
  • సంక్షేమ బోర్డు లేక రోడ్డునపడ్డ కుటుంబాలు
  • విదేశాల్లో డ్రైవర్లకు అత్యాధునిక సౌకర్యాలు

స్టీరింగ్ పడితేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.. ఆ లారీ చక్రం తిరిగితేనే దేశం కడుపు నిండుతుంది. కానీ గమ్యం తెలియని ప్రయాణంలో వాళ్ల బతుకులే రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక నాడికి రక్తాన్ని అందించే రవాణా సైనికులు నేడు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు.

నడిరోడ్డుపై నలిగిపోతున్న బతుకులు
అది మండుటెండైనా… వణికించే చలైనా.. ఆరుగాలం లారీ స్టీరింగ్‌తో కుస్తీ పట్టడమే వారి జీవితం. జాతీయ ఆదాయంలో 11 శాతం వాటా అందిస్తున్న రవాణా రంగం వెనుక ఉన్నది రక్తాన్ని చెమటగా మార్చే డ్రైవర్లు. కానీ నేడు 60 లక్షల డ్రైవర్ల కొరతతో చక్రం ఆగిపోతోంది. ఆకలి కేకలు పెరుగిపోతున్నాయి. యువత ఈ వృత్తి వైపు రావాలంటేనే భయపడుతోంది. ఎందుకంటే… ఇక్కడ డ్రైవర్ అంటే గౌరవం లేని బతుకు.. భద్రత లేని చావు!

అక్కడ హీరోలు.. ఇక్కడ శాపగ్రస్తులు
అమెరికా, యూరప్ దేశాల్లో ట్రక్ డ్రైవర్లను ‘హీరోస్ ఆఫ్ ది రోడ్’ అని పిలుస్తారు. అక్కడ డ్రైవింగ్ అంటే ఒక గౌరవం. రోజుకు 8 గంటల పని గంటలు, ఖచ్చితమైన విశ్రాంతి, లక్షలాది రూపాయల జీతం, పూర్తిస్థాయి సామాజిక భద్రత అక్కడ డ్రైవర్ల సొంతం. అందుకే అక్కడి యువత ఈ వృత్తి వైపు క్యూ కడుతున్నారు. మన దగ్గర మాత్రం డ్రైవర్ అంటే చిన్నచూపు, భద్రత లేని బతుకుగా మిగిలిపోయింది.

శిక్షణలో శాస్త్రీయత సున్నా
విదేశాల్లో లారీ డ్రైవర్ కావాలంటే కేవలం స్టీరింగ్ తిప్పడం వస్తే సరిపోదు. అత్యాధునిక సిమ్యులేటర్లపై కఠిన శిక్షణ పొందాలి. వాహన తయారీ సంస్థలే అకాడమీలు పెట్టి ట్రైనింగ్ ఇస్తాయి. కానీ మన దేశంలో ప్రామాణికమైన పాఠశాలలే లేవు. తమిళనాడులోని నమక్కల్ తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణాలయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సిరిసిల్ల స్కూల్ వంటి వాటిని ఆధునికీకరించి ఉచిత శిక్షణ ఇవ్వాలి.

సౌకర్యాలు ఏవీ?
జాతీయ రహదారులపై టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ డ్రైవర్ల సౌకర్యాలపై లేదు. విదేశాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ట్రక్ స్టాప్స్ (జిమ్, స్నానపు గదులు, సురక్షిత పార్కింగ్) ఉంటాయి. మన దగ్గర కనీస వసతులు లేక డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. 50 ఏళ్లు దాటితే కంటిచూపు, శారీరక సమస్యలతో డ్రైవర్ల జీవితం అగమ్యగోచరంగా మారుతోంది.

సంక్షేమ బోర్డే పరిష్కారం
తెలంగాణలో రవాణా రంగం పట్టాలెక్కాలంటే వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, సామాజిక భద్రత కల్పిస్తేనే ఈ వృత్తికి గౌరవం వస్తుంది. అప్పుడే నిరుద్యోగ యువత ఇటువైపు మొగ్గు చూపుతారు. ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తేనే రవాణా చక్రం మళ్ళీ వేగంగా తిరుగుతుంది.

Rajender Reddy Lorry Drivers Association President
రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *