- ప్రకృతిలో దొరికే మూలికలతోనే గమ్మత్తు
- అమెరికాలో మెటా ఐటీ సుందరి ఆవిష్కరణ
- కొలువు వదిలి మూలికా పానీయం తయారీ
- ఒత్తిడిలో ఉండే బడా బాబులే ఈమె కస్టమర్లు
- లక్షల పెట్టుబడితో కోట్లు కొల్లగొట్టే వ్యాపారం
సహనం వందే, అమెరికా:
గ్లాసులో పోస్తే ఆల్కహాల్ లాగే కనిపిస్తుంది. సిప్ చేస్తే కిక్కు ఇస్తుంది. కానీ ఇది మద్యం కాదు. కాలేయాన్ని పాడు చేయదు. హ్యాంగోవర్ అస్సలే ఉండదు. మెటా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలో పనిచేసిన ఓ యువతి, సాఫ్ట్‌వేర్ కోడింగ్ వదిలేసి మూలికలతో ముడిపడిన వినూత్న వ్యాపారంలోకి దూకింది. మత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన మొక్కలతో అద్భుతాలు సృష్టిస్తోంది.

సాఫ్ట్‌వేర్ వదిలి… వంటిల్లే ప్రయోగశాల
యాస్మిన్ శాంతోస్ ఒకప్పుడు మెటా కంపెనీలో యాడ్ స్పెషలిస్ట్‌గా పనిచేసేవారు. రోజుకు వేల ప్రకటనలను విశ్లేషించే ఆమె జీవితం 2018లో ఒక్కసారిగా మారిపోయింది. అనారోగ్యం వల్ల మద్యం మానేయాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ మందు ముట్టుకోవాలని ఆమె కోరుకోలేదు. కానీ ఆ సామాజిక అనుబంధం, ఆ రిలాక్సేషన్ ఆమెకు కావాలనిపించింది. అప్పుడే ఆమె దృష్టి మూలికా శాస్త్రంపై పడింది. వృత్తిరీత్యా టెకీ అయినప్పటికీ, ప్రవృత్తిరీత్యా ఆమె తన వంటగదిని ఒక ప్రయోగశాలగా మార్చేశారు. ప్రాచీన కాలం నుంచి మనుషులు ఒత్తిడి తగ్గించుకోవడానికి వాడిన మొక్కలపై పరిశోధనలు మొదలుపెట్టారు.
కిచెన్ ప్రయోగాలు.. అల్టార్నేటివ్ పుట్టుక
యాస్మిన్ తన వంటగదిలో చేసే ప్రయోగాలను సరదాగా కిచెన్ విచ్చింగ్ అని పిలుచుకునేవారు. కవా, సీబీడీ, డమియానా వంటి మొక్కల సారం తీసి రకరకాల మిశ్రమాలను తయారుచేశారు. పార్టీలకు వెళ్లినప్పుడు తన స్నేహితులకు ఈ డ్రాప్స్ ఇచ్చి రుచి చూపించేవారు. తాగిన వారు ఫిదా అయిపోయారు. మద్యం ఇవ్వని ఒక కొత్త రకమైన హుషారు, ప్రశాంతత తమకు కలుగుతోందని వారు చెప్పారు. ఆ ప్రోత్సాహంతోనే 2021లో అల్టార్నేటివ్ అనే బ్రాండ్‌కు పునాది పడింది. 2022 అంతా బ్రాండింగ్ మీద కసరత్తు చేసి, 2024 జనవరిలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టారు.
అమ్మ ఇచ్చిన 9 లక్షల పెట్టుబడి
ఈ వ్యాపారం వెనుక ఒక భావోద్వేగమైన కథ ఉంది. యాస్మిన్ తల్లి డిమెన్షియాతో బాధపడేవారు. మందుల వల్ల ఆమె పడే ఇబ్బందులు చూసి యాస్మిన్ తల్లడిల్లిపోయారు. ప్రకృతిలోనే పరిష్కారం ఉందని నమ్మారు. తల్లి చనిపోయాక ఆమెకు వారసత్వంగా వచ్చిన 11,000 డాలర్లు అంటే సుమారు 9.20 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. మెటాలో సంపాదించిన సొమ్ముతో పాటు ఫ్రీలాన్సింగ్ చేస్తూ వ్యాపారాన్ని ముందుకు నడిపారు. నేరుగా అమ్మకాలు జరపడమే కాకుండా పెద్ద పెద్ద ఈవెంట్లలో మొబైల్ బార్ ఏర్పాటు చేసి తన ఉత్పత్తులను జనాల్లోకి తీసుకెళ్లారు.
బడా బాబులే మెయిన్ కస్టమర్లు
సాధారణంగా ఇలాంటి హెర్బల్ డ్రింక్స్ అంటే యోగా చేసేవారు లేదా ఫిట్‌నెస్ ప్రేమికులు కొంటారని యాస్మిన్ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండే హై ప్రొఫైల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు ఈమె ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నారు. కార్పొరేట్ ఒత్తిడిలో నలిగిపోయే వారు రిలాక్స్ అవ్వడానికి ఆల్కహాల్‌కు బదులుగా అడాప్ట్ అనే వీరి బ్లెండ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించి శక్తిని ఇస్తుంది. సాహస యాత్రికులు, సర్ఫర్లు కూడా స్పష్టమైన ఆలోచనల కోసం ఈ మూలికా పానీయాలను ఇష్టపడుతున్నారు.
అద్భుతమైన గ్రోత్… కోట్ల ఆదాయంపై కన్ను
ప్రస్తుతం ఈ వ్యాపారం 115 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఏడాది తిరగకముందే లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో నెలకు 1,00,000 డాలర్లు అంటే సుమారు 83 లక్షల రూపాయల విక్రయాలు జరుగుతాయని యాస్మిన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెన్సిల్వేనియాలోని ఒక కంపెనీతో కలిసి ఈ పానీయాలను బాటిల్స్ లో నింపి సరఫరా చేస్తున్నారు. తన వ్యాపారాన్ని త్వరలోనే రెడీ టు డ్రింక్ విభాగంలోకి విస్తరించాలని చూస్తున్నారు. ఎవరి దగ్గరా పైసా పెట్టుబడి తీసుకోకుండానే ఈ స్థాయికి చేరడం విశేషం.
మూలికా మ్యాజిక్.. షార్క్ ట్యాంక్ కల
యాస్మిన్ తయారుచేసే టింక్చర్లను నేరుగా నాలుకపై వేసుకోవచ్చు లేదా టీ, వాటర్ లో కలుపుకోవచ్చు. ఉదయం పూట ఏకాగ్రత కోసం ఎక్స్‌స్టాటిక్, రాత్రి పూట ప్రశాంతత కోసం లూసిడ్ అనే రకాలను ఆమె విక్రయిస్తున్నారు. కాలేజీ రోజుల్లోనే ఆమెకు మోస్ట్ లైక్లీ టు సెల్ ఏ మిలియన్ డాలర్ బిజినెస్ టు షార్క్ ట్యాంక్ అనే అవార్డు వచ్చింది. అంటే భవిష్యత్తులో కోట్లాది రూపాయల విలువైన కంపెనీని షార్క్ ట్యాంక్ వంటి వేదికపై అమ్ముతారని ఆమె స్నేహితులు జోస్యం చెప్పారు. అది ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ప్రకృతి సంపదను ఆధునిక జీవనశైలికి జోడించి యాస్మిన్ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.