- జాతీయస్థాయిలో అసమ్మతి సెగలు
- మోడీని నెత్తినెత్తుకున్న దిగ్విజయ్ సింగ్
- బీజేపీ సంస్థాగత బలానికి మాజీ సీఎం కితాబు
- దీనిపై మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- సోనియా నాయకత్వాన్ని ఆకాశానికెత్తిన సీఎం
- ఆమె వల్లే పీవీ, మన్మోహన్ ప్రధానులయ్యారు
సహనం వందే, హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు.

దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్
రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్ వేదికగా ఒక పాత ఫోటోను షేర్ చేశారు. అందులో అప్పుడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ నేల మీద కూర్చుని ఉండగా… అగ్రనేత ఎల్ కే అద్వానీ కుర్చీలో ఉన్నారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మోదీ ప్రధాని అయ్యారంటే అది ఆరెస్సెస్, బీజేపీ సంస్థాగత బలమేనని దిగ్విజయ్ కితాబు ఇచ్చారు. సంస్థకు ఉన్న శక్తి అటువంటిదని ఆయన ప్రశంసించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
రేవంత్ రెడ్డి ఘాటు స్పందన…
దిగ్విజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించారు. సోనియా గాంధీ నాయకత్వంలోనే సాధారణ వ్యక్తులు దేశ ప్రధానులుగా ఎదిగారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన పీవీ నరసింహారావును సోనియానే ప్రధానిని చేశారని పేర్కొన్నారు. అలాగే ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను కూడా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ఘనత ఆమెదేనని రేవంత్ స్పష్టం చేశారు.

నాయకత్వవాదం వర్సెస్ సంస్థాగత బలం
ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఉన్న వైరుద్యాన్ని బయటపెట్టింది. ఒక వర్గం నెహ్రూ గాంధీ కుటుంబ నాయకత్వాన్ని సమర్థిస్తుంటే, మరో వర్గం పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలని కోరుకుంటోంది. రేవంత్ రెడ్డి సోనియా గాంధీ నాయకత్వానికే జై కొట్టగా, దిగ్విజయ్ సింగ్ మాత్రం సంస్థాగత నిర్మాణ ప్రాధాన్యతను ఎత్తిచూపారు. ఈ రెండు భిన్న ధోరణులు పార్టీలో అంతర్గత కలహాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
మండిపడ్డ మాణిక్యం ఠాగూర్…
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఆ సంస్థ ద్వేషాన్ని చిమ్ముతుందని… దానిని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి కానీ, ఇటువంటి సంస్థల నుంచి కాదని ఆయన దిగ్విజయ్ కు పరోక్షంగా చురకలు అంటించారు.
థరూర్ మద్దతు ఎవరికి?
మరోవైపు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మాత్రం దిగ్విజయ్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. థరూర్ గతంలో జీ 23 గ్రూపులో సభ్యుడిగా ఉండి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాడిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీయడం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.
సమయం చూసి దెబ్బ కొట్టారా?
కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే ఈ వివాదం రావడం గమనార్హం. ఒకవైపు పార్టీ పండుగ చేసుకుంటుంటే మరోవైపు నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కేడర్ ను అయోమయానికి గురి చేస్తోంది. రేవంత్ రెడ్డి సోమవారం చేసిన పోస్ట్ కేవలం సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపడమే కాకుండా దిగ్విజయ్ సింగ్ కి ఇచ్చిన బలమైన రాజకీయ సమాధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు.