మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

Future AI Technology
  • నువ్వే ఆలోచిస్తున్నావో ఇట్లే చెప్పేస్తాయి
  • మరో కొత్త ప్రమాద ప్రపంచంలోకి మనం
  • కొత్త సంవత్సరంలో సాంకేతికత కొత్త పుంతలు
  • బట్టలు మడతపెట్టే, గిన్నెలు కడిగే రోబోలు
  • 10 లక్షలకు రోబోలను సిద్ధం చేసిన అమెజాన్
  • అందుబాటులోకి సరికొత్త మడత పెట్టే ఐఫోన్

సహనం వందే, హైదరాబాద్:

సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది.

మడత ఫోన్ల రాక
స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్ చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఈ బుక్ స్టైల్ మోడల్‌ను యాపిల్ విడుదల చేయనుంది. దీని ధర మార్కెట్లో దాదాపు 1,68,000 రూపాయల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఈ కొత్త ఫోన్ రాకతో 2026 నాటికి మడత ఫోన్ల మార్కెట్ 30 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇంటి పనుల్లో రోబోలు
ఇకపై మీ ఇంట్లో మనుషులతోపాటు రోబోలు కూడా తిరుగుతాయి. ఇంటి పనులను చక్కబెట్టే నియో, మెమో వంటి రోబోలు అందుబాటులోకి వస్తున్నాయి. బట్టలు మడతపెట్టడం నుంచి గిన్నెలు కడగడం వరకు ఇవి సాయం చేస్తాయి. అమెజాన్ ఇప్పటికే తన గిడ్డంగుల్లో 10 లక్షల రోబోలను మోహరించింది. వీటి వల్ల పని సామర్థ్యం 10 శాతం పెరిగింది. రాబోయే కాలంలో ప్రతి ఇంట్లోనూ రోబో ఒక సభ్యుడిగా మారిపోనుంది.

మనసు చదివే పరిజ్ఞానం
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే మైండ్ రీడింగ్ టెక్నాలజీ నిజం కాబోతోంది. మనిషి మెదడులోని ఆలోచనలను పసిగట్టే బ్రెయిన్ ఇంప్లాంట్స్ తయారు చేస్తున్నారు. ఇవి మాటలు రాని వారికి వరంగా మారుతాయి. ఆలోచనల ద్వారానే కంప్యూటర్లను లేదా ఫోన్లను ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. పక్షవాతం ఉన్న రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తులో కీబోర్డ్ అవసరం లేకుండానే టైప్ చేసే రోజులు రానున్నాయి.

ఎలక్ట్రిక్ సూపర్ కార్లు
ప్రయాణ సాధనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరగనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సూపర్ కార్లు రోడ్లపైకి వస్తున్నాయి. ఇవి గాలి వేగంతో దూసుకెళ్తాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు తమ ఫ్యాక్టరీల్లో డ్రైవర్ లేకుండానే నడిచే కార్లను పరీక్షిస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే వీలు కల్పిస్తాయి. వీటి ధరలు కోట్లలోనే ఉన్నా టెక్నాలజీ మాత్రం అద్భుతంగా ఉంటుంది.

సైబర్ భద్రతా సవాళ్లు
సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో ప్రమాదాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఏఐని వాడుకుని దాడులు చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ మోసాలు, డేటా చోరీలు పెరిగే ప్రమాదం ఉంది. ఏఐ రంగంలో పెట్టుబడులు 134 లక్షల కోట్ల రూపాయలకు చేరుతున్నా భద్రత మాత్రం సవాలుగానే ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలు, వ్యక్తిగత ఖాతాలకు భద్రత కల్పించడం కష్టంగా మారుతోంది. వీటిని అడ్డుకోవడానికి కఠినమైన చర్యలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *