- భూ కబ్జాలపై పవన్ వ్యాఖ్యలతో అప్రమత్తం
- తప్పుడు మార్గంలో వెళ్తే చర్యలు తప్పవు
- రాజకీయాలంటే ‘ప్రజా సేవ – దైవ సేవ’
- ఆడంబరాలు దూరం… నిజాయితీ ఆయుధం
- మూడో ఆడపిల్ల పుడితే 50 వేల రూపాయలు
- భోగాపురం విమానాశ్రయంతో అభివృద్ధి బాట
- ‘సహనం వందే’కు అప్పలనాయుడు ప్రత్యేక ఇంటర్వ్యూ
సహనం వందే, విజయనగరం:
విజయనగరం రాజకీయాల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రత్యేక ముద్ర వేశారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్ సభలో అడుగుపెట్టారు. నిరాడంబరత, నిబద్ధతే పెట్టుబడిగా ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవిని బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అప్పలనాయుడుతో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ విజయనగరం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ.
సహనం వందే: ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర అయింది కదా… మీ అనుభూతి ఏంటి?
అప్పలనాయుడు: సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన నాకు పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం. ఇది కేవలం ఒక పదవి కాదు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకం. ఢిల్లీ చట్టసభలో మన విజయనగరం గొంతు వినిపించడం, సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. ప్రతిరోజూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం సంతృప్తిగా ఉంది.


సహనం వందే: ఎమ్మెల్యే సీటు కోరుకున్న మీకు చంద్రబాబు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు?
అప్పలనాయుడు: నిజమే… నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నాపై నమ్మకంతో ఎంపీగా అవకాశం ఇచ్చారు. పార్టీ అప్పగించిన బాధ్యతను నెరవేర్చడమే క్రమశిక్షణ గల కార్యకర్తగా నా ధర్మం. చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. గత ఏడాదిన్నర కాలంగా పార్లమెంటులో 120 కి పైగా ప్రశ్నలు అడిగాను. నియోజకవర్గ సమస్యల సాధనలో ఎక్కడా తగ్గలేదు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరేలా పనిచేస్తూ ఆయన నమ్మకాన్ని 100 శాతం నిలబెట్టుకుంటున్నాను.
సహనం వందే: రాజకీయాలు కలుషితం అవుతున్న ఈ రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
అప్పలనాయుడు: రాజకీయాలు అంటే నా దృష్టిలో ప్రజా సేవ – దైవ సేవ. కలుషితం అవుతున్న ఈ వాతావరణంలో నేను పారదర్శకత, నిరాడంబరతను పాటిస్తాను. ఎక్కడా అవినీతికి తావులేకుండా సామాన్య పౌరుడికి అందుబాటులో ఉండేలా నా కార్యాలయం పనిచేస్తోంది. అధికారం అంటే హోదా కాదు బాధ్యత అని నమ్ముతాను. అందుకే ఆడంబరాలకు దూరంగా ఉంటూ నిజాయితీనే ఆయుధంగా మలుచుకున్నాను.
సహనం వందే: ఈ కాలంలో మీరు ఎప్పటికీ మర్చిపోని సంఘటన?
అప్పలనాయుడు: పార్లమెంటు మొదటి సమావేశాలకు వెళ్లినప్పుడు దేశం నలుమూలల నుంచి వచ్చిన దిగ్గజ నేతల మధ్య విజయనగరం ప్రతినిధిగా నిలబడటం మర్చిపోలేను. నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు సామాన్య ప్రజలు చూపే ఆత్మీయత, నాయుడు గారు మా పని అయిపోయింది అని వారు ఆనందంతో చెప్పే మాటలు గుండెల్లో నిలిచిపోతాయి.
సహనం వందే: పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడానికి కారణం ఏమిటి? ప్రచారమని విమర్శలు వస్తున్నాయి కదా?
అప్పలనాయుడు: ఇది ప్రచారం కోసం చేసే పని కాదు. ఒక మంచి సందేశం ఇవ్వడం కోసం. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నేను సైకిల్ పై వెళ్లడం ద్వారా కాలుష్య రహిత సమాజం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలనుకున్నాను. సైకిల్ మా పార్టీ గుర్తు కావడంతో అది నాకు మరింత గౌరవప్రదం. విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. కానీ సమాజం కోసం మంచి పని చేయడంలో వెనకాడను.
సహనం వందే: ఈ ఏడాది సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు? పెట్టుబడులు, నిధుల వివరాలు?
అప్పలనాయుడు: నియోజకవర్గంలో రైల్వే అండర్ పాస్ పనులు, స్టేషన్ల ఆధునీకరణ కోసం కృషి చేశాను. నా నియోజకవర్గంలో మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే 50 వేల రూపాయలు నిఖిల ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాను. కేంద్రం నుండి జాతీయ రహదారుల విస్తరణకు, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి పథకాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించాం. భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది. దీనివల్ల వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
సహనం వందే: మీ పనితీరు పట్ల చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏంటి?
అప్పలనాయుడు: అధినేత ఎప్పుడూ పని చేసే వారినే ప్రోత్సహిస్తారు. నేను పార్లమెంటులో అడిగే ప్రశ్నలు, నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలపై ఆయన ఆరా తీస్తుంటారు. అప్పలనాయుడు బాగా పనిచేస్తున్నావు… ఇదే స్ఫూర్తిని కొనసాగించు అని ఆయన ఇచ్చే ప్రోత్సాహం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.
సహనం వందే: ఉత్తరాంధ్ర భూకబ్జాలపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఒకవేళ ఎవరైనా కబ్జాలు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
అప్పలనాయుడు: పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలోని లోపాలను, అక్రమాలను ప్రశ్నించారు. అది తప్పు కాదు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో భూదందాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. మా కూటమి ప్రభుత్వంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. విజయనగరంలో అటువంటి అరాచకాలు జరగకుండా పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేశాను. మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తప్పుడు మార్గంలో వెళ్తే కచ్చితంగా చర్యలు ఉంటాయి.
సహనం వందే: 2026 నూతన సంవత్సర లక్ష్యాలు ఏంటి?
అప్పలనాయుడు: విజయనగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించాలి. భోగాపురం విమానాశ్రయం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలపాలి.