- ప్రభుత్వ డాక్టర్ల జీవితాలతో అధికారుల ఆట
- పదోన్నతులు లేని సర్వీసులతో వైద్యులు
- విలీనం ఊసేలేని టీవీవీపీ అస్తవ్యస్త పాలన
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న అధికార పెత్తనం
- తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా
సహనం వందే, హైదరాబాద్:
రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

జీతాల కోసం నిరీక్షణ
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ నరహరి ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా కొందరికి ఇంకా జీతాలు అందలేదని విమర్శించారు. దీనికి కమిషనర్ తోపాటు ఫైనాన్స్ విభాగం నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే టీవీవీపీని వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఆర్థిక, న్యాయపరమైన అడ్డంకులు ఉండవని నివేదికలు వచ్చినా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు.
ఆగిపోయిన పదోన్నతులు
వైద్యుల కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ దుయ్యబట్టారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ప్రమోషన్ ఆర్డర్లు తక్షణమే జారీ చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి అలవెన్సులు ఇవ్వకపోవడం వల్ల అధ్యాపకులు చేరేందుకు వెనకాడుతున్నారని గుర్తుచేశారు. నిమ్స్ స్కేల్స్ అమలు చేయకపోవడం వల్ల నైపుణ్యం కలిగిన వైద్యులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెత్తనం ఎవరిది?
వైద్య రంగంలో నిపుణులైన డాక్టర్ల కంటే అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టడంపై రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ఎంకే రవూఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైద్య వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. స్వయం ప్రతిపత్తి గల ఎంఎన్ జే లాంటి సంస్థలను పూర్తిస్థాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చాలని కోరారు. ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ పోస్టుల సృష్టిలో జరుగుతున్న జాప్యం పాలనాపరమైన ఇబ్బందులకు దారితీస్తోందని వివరించారు.
బదిలీల గందరగోళం
దూర ప్రాంతాల్లోని సంస్థల నుంచి హైదరాబాద్‌కు ఫ్యాకల్టీ బదిలీలు వెంటనే చేపట్టాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పనితీరుపై ప్రభావం పడుతోందని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు, పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 142 సవరణపై ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.
కదిలిన వైద్య లోకం…
రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఏకతాటిపైకి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణారావు, దీన్ దయాల్, కార్యదర్శులు మురళీధర్, రాంసింగ్ పాల్గొన్నారు. నాయకులు డాక్టర్ కృష్ణారెడ్డి, వినోద్, సంతోష్ బాబు, జయశ్రీ, శ్రీనివాస్, రత్నాకర్, విష్ణు, సంధ్య, గోవింద్ తమ గళం వినిపించారు. వీరికి మద్దతుగా సీనియర్ సభ్యులు డాక్టర్ బిఎస్ రావు, రామూర్తి, జయప్రసాద్, అలిగేటి శ్రీనివాస్, శివరామ్, యశోదాబాయి, మధుసూధన్, వినాయకరావు, గిరిధర్, క్రాంతి, మహేష్ రాథోడ్, జావెద్, సాయి బాబా నిలిచారు.
తుది పోరుకు సిద్ధం
జిల్లాల ప్రతినిధులు డాక్టర్ తిప్పె స్వామి, సత్యనారాయణ, విజయ్ రాజ్, రఘు, సుధీర్, విజయ్, గోపాల్, క్రాంతి కిరణ్, స్వప్న, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మల్లికార్జున్ ఈ నిరసనలో పాలుపంచుకున్నారు. తమ డిమాండ్లను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని సంఘం నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆపబోమని, రోగుల సేవలకు ఆటంకం కలగకముందే స్పందించాలని వారు కోరారు.