- హిందూ ధర్మ పరిరక్షణ కోసం కనాలని పిలుపు
- దేశాన్ని పాకిస్థాన్‌గా మార్చే కుట్ర జరుగుతుంది
- దీన్ని అడ్డుకోవాలంటే నలుగురిని కనాల్సిందే
- వాళ్లకు నలుగురు భార్యలు..19 మంది పిల్లలు
- ముస్లింలపై బీజేపీ నాయకురాలి వ్యాఖ్యలు
- జనాభా సమతుల్యత దెబ్బతింటోందని ఫైర్
- నవనీత్ వ్యాఖ్యలపై మండిపడుతున్న విపక్షం
సహనం వందే, మహారాష్ట్ర:
మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నలుగురు పిల్లలు కావాల్సిందే
ప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు పిల్లలు ఉండాలని నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. కొంతమంది మత పెద్దలు నలుగురు భార్యలను కలిగి ఉండి 19 మంది పిల్లలను కంటున్నారని ఆమె విమర్శించారు. మనం కేవలం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటే భవిష్యత్తులో దేశ జనాభా స్వరూపం మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందుస్థాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లా మారకూడదని ఆమె గట్టిగా చెప్పారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కుట్రను తిప్పికొట్టాలి
దేశంలో జనాభాను పెంచి హిందుస్థాన్‌ను మరో పాకిస్థాన్‌గా మార్చాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక మత పెద్ద 19 మంది పిల్లలు ఉన్నా ఇంకా 30 మందిని కనలేకపోయానని అన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వారి జనాభా పెరుగుతున్నప్పుడు హిందువులు ఎందుకు వెనకబడి ఉండాలని ప్రశ్నించారు. కేవలం ఒకే బిడ్డతో సంతృప్తి చెందకుండా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి సంతానం పెంచుకోవాలని కోరారు. ఈ విషయంలో రాజీ పడకూడదని ఆమె స్పష్టం చేశారు.
విపక్షాల విమర్శల జడివాన
నవనీత్ రాణా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జనాభా పెరుగుదల అనేది దేశానికి పెద్ద సమస్య అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు మూఢనమ్మకాలతో ఇలాంటి అశాస్త్రీయ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జనాభాను నియంత్రించలేని రాష్ట్రాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. సైంటిఫిక్ పద్ధతిలో ఆలోచించాలే తప్ప విద్వేషాలు పెంచేలా మాట్లాడకూడదని పేర్కొన్నారు.
సంఘ్ అధినేత బాటలోనే
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా గతంలో పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశంలో జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే హిందువులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆయన సూచించారు. జననాల రేటు తగ్గిపోతే దేశ మనుగడకే ప్రమాదమని సంఘ్ భావిస్తోంది. ఇప్పుడు అదే బాటలో నవనీత్ రాణా కూడా గొంతు కలపడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఈ జనాభా మంత్రం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఏఐ సాంకేతికత యుగంలో కూడా ఇలాంటి చర్చలు రావడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.