మంచు ఖండంలో మృత్యు జర్నలిజం – అంటార్కిటికాలో సాహస పరిశోధన

Journalism Antarctica Yatra
  • 39 మంది శాస్త్రవేత్తలతో జర్నలిస్టుల యాత్ర
  • ‘న్యూయార్క్ టైమ్స్’ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం
  • ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రయాణం
  • గడ్డకట్టే చలిలో ప్రాణాలు నిలుపుకునేలా శిక్షణ
  • మొత్తం బృందల్లో 15 మంది మహిళలు కూడా
  • రీసెర్చ్ ఐస్ బ్రేకర్ నౌకలో సాగుతున్న యాత్ర ‌
  • నౌకపై రెండు హెలికాప్టర్లు… డ్రోన్లు కూడా
  • వారితోపాటు స్నోమొబైల్ వాహనాలు
  • ఇప్పటికే మొదలైన యాత్రకు 42 కోట్లు ఖర్చు

సహనం వందే, అమెరికా:

మనిషి జీవించలేని ఖండం అంటార్కిటికా. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మంచు ఖండాన్ని పరిశోధించాల్సిందే. భూమి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న గ్లేసియర్ల గుట్టు విప్పేందుకు ఒక భారీ శాస్త్రీయ బృందంతో పాటు మొదటిసారిగా జర్నలిజం బృందం సాహస యాత్ర చేస్తుంది. ప్రమాదకరమైన అలలు, గడ్డ కట్టే చలిని ఎదుర్కుంటూ సాగే ఈ ప్రయాణం కేవలం పరిశోధన మాత్రమే కాదు… అంతకు మించిన ఒక ఉత్కంఠభరితమైన పోరాటం.

10 మంది జర్నలిస్టులు ఈ బృందం…
అంటార్కిటికాలో మంచు కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచానికే ముప్పు పొంచి ఉంది. అందుకే అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ రంగంలోకి దిగింది. మొత్తం 39 మంది శాస్త్రవేత్తలతోపాటు సుమారు 10 మంది జర్నలిస్టులు ఈ బృందంలో ఉన్నారు. వీరిలో 15 మందికి పైగా మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం. వీరి వయసు 25 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ బృందం గత నెల చివరలో అమెరికా నుంచి బయలుదేరింది. ప్రస్తుతం వీరు అంటార్కిటికా గడ్డపై పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం 2 నెలల పాటు సాగే ఈ యాత్ర జనవరి నెలాఖరు వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి శాస్త్రవేత్తల పరిశోధనలను జర్నలిస్టులు నేరుగా చూసి ప్రత్యేక కథనాలు రాస్తున్నారు.

రీసెర్చ్ ఐస్ బ్రేకర్ నౌకలో సాహసం…
ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన రీసెర్చ్ ఐస్ బ్రేకర్ నౌకను వాడుతున్నారు. ఈ భారీ నౌక గడ్డకట్టిన మంచును చీల్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో అత్యాధునిక ల్యాబొరేటరీలు, శాస్త్రవేత్తల కోసం జిమ్, మెడికల్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ నౌక పైభాగంలో హెలిప్యాడ్ ఉంటుంది. ఇక్కడే 2 చిన్నపాటి హెలికాప్టర్లను పార్క్ చేసి తీసుకెళ్లారు. సముద్ర ప్రయాణం సాధ్యం కాని చోట శాస్త్రవేత్తలు ఈ హెలికాప్టర్ల ద్వారా గ్లేసియర్ల పైకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బృందం గడ్డకట్టే చలిలో డేరాలను వేసుకుని మంచుపైనే పరిశోధనలు చేస్తోంది.

డ్రేక్ పాసేజ్ సముద్ర మార్గాలలో ప్రయాణం…
ఈ బృందం ప్రయాణం కేవలం ఒకే రవాణా వ్యవస్థపై ఆధారపడి లేదు. మొదట అమెరికా నుంచి విమానాల్లో దక్షిణ అమెరికా చివరకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ ప్రత్యేక నౌక ద్వారా సముద్ర ప్రయాణం మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రేక్ పాసేజ్ వంటి సముద్ర మార్గాల గుండా ప్రయాణించి మంచు ఖండానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నాక గ్లేసియర్ల వద్దకు వెళ్లడానికి హెలికాప్టర్లు, మంచుపై నడిచే స్నోమొబైల్ వాహనాలను వాడుతున్నారు. ఈ మొత్తం యాత్రకు దాదాపు 42 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.

గడ్డకట్టె ప్రాంతంలో ఎగిరే డ్రోన్లు…
ఈ యాత్రలో మనుషులు వెళ్లలేని చోట్లకు అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. గడ్డకట్టే చలిని తట్టుకుని ఎగిరే ఈ డ్రోన్లు గ్లేసియర్ల లోతును, మంచు పలకల కింద ఉన్న నీటి ఉష్ణోగ్రతను కొలుస్తాయి. అత్యంత శక్తివంతమైన సెన్సార్లు, కెమెరాల సాయంతో మంచు గడ్డల కదలికలను ఇవి ఎప్పటికప్పుడు రికార్డు చేస్తాయి. భూమిపై మరే ఇతర ప్రాంతంలో వాడని అత్యాధునిక మ్యాపింగ్ సాంకేతికతను ఈ డ్రోన్లలో అమర్చారు. ఇవి పంపే డేటా ఆధారంగానే శాస్త్రవేత్తలు క్లిష్టమైన లెక్కలు వేస్తున్నారు.

గ్లేసియర్లు అంటే?
గ్లేసియర్లు అంటే వేల ఏళ్లుగా పేరుకుపోయిన భారీ మంచు నదులు. అంటార్కిటికా సుమారు 1.40 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. గతంలో అనేక దేశాల శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధన కేంద్రాలు స్థాపించారు. భారత్ కు కూడా దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి వంటి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దక్షిణ గంగోత్రి మంచులో కూరుకుపోగా… మైత్రి, భారతి కేంద్రాలు ప్రస్తుతం నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్ బృందం వీటికంటే దూరంగా ఉన్న మంచు పలకల వద్ద అధ్యయనం చేస్తోంది.

ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయని చోటు…
అంటార్కిటికా యాత్రలో జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ సాధారణ ఫోన్లు లేదా ఇంటర్నెట్ సిగ్నల్స్ అస్సలు పనిచేయవు. కేవలం శాటిలైట్ ఫోన్ల ద్వారానే బయటి ప్రపంచంతో సంబంధాలు ఉంటాయి. ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తారు. గడ్డకట్టే చలిలో శక్తినిచ్చేందుకు ఎక్కువ క్యాలరీలు ఉన్న నిల్వ చేసిన ఆహారాన్ని, ఎండబెట్టిన మాంసం వంటి వాటిని శాస్త్రవేత్తలు తీసుకుంటారు. తాజా కూరగాయలు అక్కడ దొరకడం అసాధ్యం. అత్యవసర వైద్యం కోసం బృందంతో పాటే ప్రత్యేక డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు.

గత పరిశోధనలో చేదు జ్ఞాపకాలు…
ఇప్పటికే అనేక దేశాలు అక్కడ పరిశోధనలు చేస్తున్నా ఈ మిషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో జరిగిన సాహస యాత్రల్లో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 1912 లో రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ బృందం తిరిగి వస్తూ చలికి గడ్డకట్టి చనిపోయారు. ఆ తర్వాత ఎందరో సాహసికులు అక్కడికి వెళ్లారు. కానీ ఇప్పుడు అంత ప్రాధాన్యత ఎందుకంటే మంచు కరిగే వేగం మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. ఇప్పుడు తెలుసుకోబోయే విషయాలు భూమిని కాపాడటానికి ఆఖరి అవకాశం కావచ్చు. అందుకే న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు ముందుగా కఠినమైన సర్వైవల్ శిక్షణ ఇచ్చి మరీ పంపారు. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఎన్ని అడుగులు పెరుగుతాయో కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఇది ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు దిక్సూచిగా మారనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *