విదేశీ గడ్డపైనే బిడ్డ భవిష్యత్తు – తమ పిల్లల విదేశీ చదువుకు 28 వేల కోట్లు

#Abroad Studies expenses
  • గత ఏడాది ఆ స్థాయిలో ఖర్చు చేసిన పేరెంట్స్
  • 2013-14లో ఆ ఖర్చు కేవలం 1300 కోట్లే
  • నాణ్యమైన విద్య కోసం విదేశాలకు స్టూడెంట్స్
  • అంతర్జాతీయ ప్రమాణాలు లేకనే విదేశాలకు
  • నీతి ఆయోగ్ సూచనలతోనూ మారని విద్య
  • విదేశీ వర్సిటీలతో పోటీపడని మన సంస్థలు
  • మార్కులు, ర్యాంకుల చుట్టూ మన చదువులు

సహనం వందే, హైదరాబాద్:

భారతీయ విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చదువులకు స్వదేశీయులే మొహం చాటేస్తున్నారు. కోట్లాది రూపాయల సంపద విదేశీ వర్సిటీల పాలవుతోంది. మన దగ్గర నాణ్యత లేక లక్షలాది మంది విద్యార్థులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రతిభతో పాటు భారీగా డబ్బు కూడా తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.

Studies in Abroad

వలసల పర్వం… ఆవిరవుతున్న ధనం
దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022 లెక్కల ప్రకారం దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. అదే సమయంలో భారత్‌కు చదువుకోవడానికి వచ్చిన విదేశీయులు కేవలం 47 వేలు మాత్రమే. ఈ అంతరం మన విద్యా ప్రమాణాల స్థాయిని చూపిస్తోంది. విదేశీ చదువు కోసం ఇండియా నుంచి 2013-14లో 1300 కోట్ల రూపాయలు తరలిపోయాయి. 2023-24లో తల్లిదండ్రులు తమ పిల్లల విదేశీ చదువు కోసం ఏకంగా 28 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.

విద్య అంతర్జాతీయీకరణ ఎండమావేనా?
నీతి ఆయోగ్ స్వదేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని కోరుతోంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించాలని సూచించింది. ఉమ్మడి డిగ్రీలు, పరిశోధనల్లో పరస్పర సహకారం ఉండాలని భావిస్తోంది. ప్రత్యేక స్కాలర్‌షిప్పులు ఇచ్చి ప్రతిభావంతులను దేశంలోనే ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. విదేశీ వర్సిటీలతో పోటీ పడటంలో మన విద్యా సంస్థలు వెనుకబడి ఉన్నాయి.

మార్కులు, ర్యాంకుల చుట్టూనే చదువులు…
మన విద్యా వ్యవస్థలో పరిశోధనలకు ప్రాధాన్యం కరువైంది. కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే చదువులు సాగుతున్నాయి. అందుకే తెలివైన విద్యార్థులు విదేశీ వైపు చూస్తున్నారు. అక్కడ దొరికే సౌకర్యాలు, ఆధునిక బోధన మన దగ్గర లభించడం లేదు. దీనివల్ల మన దగ్గర ఉండాల్సిన మేధస్సు పరాయి దేశాల పాలవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి కేవలం కమిటీలు వేస్తే సరిపోదు. విద్యా రంగంలో మౌలిక మార్పులు తేవాల్సిన అవసరం ఉంది.

నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం
విదేశీ వర్సిటీల మాదిరిగా భారీగా నిధులు వెచ్చించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. పరిశోధనలకు సహకారం అందకపోవడం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే స్థాయిలో ఇక్కడ వసతులు లేవు. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న వర్సిటీలు మన దగ్గర వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికైనా నీతి ఆయోగ్ సూచనలను అమలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఇక్కడే అందుబాటులోకి తేవాలి. లేదంటే మరిన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పాలవడం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *