అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

Health issues with Rice and Roties
  • అన్నం ప్లేటు నిండా పిండి పదార్థాల విషం
  • తగ్గుతున్న ప్రోటీన్… పెరుగుతున్న షుగర్
  • తెల్ల బియ్యం, గోధుమలే అసలైన విలన్లు
  • కొలెస్ట్రాల్ పెంచుతున్న చెడు కొవ్వుల విందు
  • ఐసీఎంఆర్ అధ్యయనంలో విస్తుపోయే నిజం

సహనం వందే, హైదరాబాద్

మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి.

ICMR study on Indian Food Habits

భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయం
భారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల వాటా ఏకంగా 62 శాతానికి చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దక్షిణ భారతీయులు తెల్ల బియ్యంపై మక్కువ పెంచుకుంటే… ఉత్తరాది వారు పాలిష్ చేసిన గోధుమలను నమ్ముకున్నారు. వీటికి తోడు చక్కెర వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ మూడు కలిసి రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతున్నాయి. పీచు పదార్థం లేని ఈ తిండి వల్ల డయాబెటిస్ బాంబు టిక్ టిక్ మంటోంది. ప్లేటు నిండా అన్నం పెట్టుకుని కూరను నంజుకు తినే పద్ధతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చేసింది.

Glycemic Index

కనుమరుగవుతున్న ప్రోటీన్ బలం…
శరీరానికి కావాల్సిన అసలైన ఇంధనం ప్రోటీన్. కానీ మన ప్లేటులో అది కేవలం 12 శాతం మాత్రమే ఉంటోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ప్రోటీన్ దయనీయ స్థితిలో పడిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇది 14 శాతం దాటడం లేదు. పప్పులు, పాలు, గింజ ధాన్యాల వాటా తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రోటీన్ లేని శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా ఊబకాయం, షుగర్ వంటి సమస్యలు సులువుగా దాడి చేస్తున్నాయి. కండరాలు కరిగిపోయి కొవ్వు పెరగడానికి ఈ అసమతుల్యతే అసలైన కారణం.

మంచి కొవ్వు మిస్…
మన శరీరంలో కొవ్వు శాతం 25 దాకా ఉంది. కానీ ఇందులో మంచి కంటే చెడు కొవ్వులే రాజ్యమేలుతున్నాయి. నెయ్యి, వెన్న, బయట దొరికే వేయించిన పదార్థాల ద్వారా ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలోకి చేరుతున్నాయి. గుండెకు రక్షణ ఇచ్చే చేపలు, మంచి నూనెలు, విత్తనాల జోలికి ఎవరూ వెళ్లడం లేదు. దీనివల్ల కొలెస్ట్రాల్ కొండలా పెరిగిపోతోంది. గుండె జబ్బులు చిన్న వయసులోనే పలకరిస్తున్నాయి. ఆహారంలో మార్పు లేకపోతే దేశం మొత్తం రోగుల నిలయంగా మారే ప్రమాదం ఉంది.

చిన్న మార్పుతోనే పెద్ద విజయం…
ఈ ప్రమాదం నుంచి బయటపడటం పెద్ద కష్టమేమీ కాదు. కార్బోహైడ్రేట్లను ఒక 5 శాతం తగ్గించి ఆ ప్లేస్ లో ప్రోటీన్ పెంచితే చాలు. ప్రీడయాబెటిస్ ఉన్నవారు కూడా తిరిగి సాధారణ స్థితికి రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిల్లెట్లు, ముడి బియ్యం, పప్పు ధాన్యాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. కూరగాయల వాటా పెంచాలి. 1.21 లక్షల మందిపై జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయనం అందరి కళ్లు తెరిపిస్తోంది. సబ్సిడీ బియ్యం కాకుండా పోషకాలున్న ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది.

మేల్కొంటేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు…
దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి ధనికుడి వరకు అందరి ప్లేటులోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. చక్కెర, ఉప్పు, తెల్లటి పిండి పదార్థాలు ప్రాణాలకు ముప్పుగా మారాయి. యువత ఫాస్ట్ ఫుడ్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆహారపు అలవాట్లలో ఇప్పుడే మార్పు రాకపోతే భావి తరాలు డయాబెటిస్ కోరల్లో చిక్కుకోవడం ఖాయం. మనం తినే ప్రతి ముద్దను జాగ్రత్తగా గమనించుకోవాలి. టిక్ టిక్ అంటున్న ఈ హెల్త్ బాంబును ఆపే శక్తి కేవలం మన వంటింట్లోనే ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *