- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
- కామారెడ్డి డిక్లరేషన్ అమలులో తీవ్ర జాప్యం
- హైకోర్టు మాజీ సీజే ఈశ్వరయ్య నిలదీత
- రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఈశ్వరయ్య
- తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం
- రిజర్వేషన్ బిల్లుల రక్షణ కోసం పిలుపు
- ‘సహనం వందే’కు ఈశ్వరయ్య ఇంటర్వ్యూ
సహనం వందే, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం న్యాయం జరగలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక ఘాటైన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఈశ్వరయ్యతో ‘సహనం వందే‘ డిజిటల్ పేపర్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది.
సహనం వందే: రాహుల్ గాంధీకి లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
జస్టిస్ ఈశ్వరయ్య: దేశంలో వెనుకబడిన వర్గాలు జనాభాలో అత్యధికంగా ఉన్నా రాజకీయ అధికారం మాత్రం కొద్దిమంది చేతుల్లోనే బందీ అయింది. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో సామాజిక న్యాయం గురించి మాట్లాడి బీసీల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. కానీ ఆయన ఇచ్చిన మాటలు, మేము గతంలో అందజేసిన వినతులు కార్యరూపం దాల్చడం లేదు. అందుకే ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ఆయన బాధ్యతను గుర్తు చేయడానికి ఈ లేఖ రాశాం.
సహనం వందే: కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా… ఇప్పుడు మీ ఆవేదన ఏంటి?
జస్టిస్ ఈశ్వరయ్య: సామాజిక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే బీసీ సంఘాలన్నీ ఏకమై గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. ఆ మద్దతు వల్లే పార్లమెంట్‌లో వారి బలం పెరిగింది. కానీ తీరా అధికారం చేతికి వచ్చాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గానీ, జాతీయ స్థాయిలో గానీ బీసీల ప్రయోజనాల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ జాప్యం వల్ల వెనుకబడిన వర్గాల నమ్మకం సడలిపోతోంది.
సహనం వందే: మీ ప్రధాన డిమాండ్లలో రిజర్వేషన్ల పెంపు గురించి వివరిస్తారా?
జస్టిస్ ఈశ్వరయ్య: బీసీలు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారు. మా డిమాండ్ స్పష్టం. ఆర్టికల్ 342ఏ(3) ప్రకారం శాస్త్రీయంగా బీసీ జాబితాను రూపొందించి జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలి. న్యాయమైన వాటా దక్కనప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది.
సహనం వందే: ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు?
జస్టిస్ ఈశ్వరయ్య: ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వేగంగా ప్రైవేటీకరణ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్న తరుణంలో సామాజిక న్యాయం కేవలం ప్రభుత్వానికే పరిమితమైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలంటే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయడం తప్పనిసరి.
సహనం వందే: విద్య, ఆరోగ్యం విషయంలో మీరు కోరుతున్న సమూల మార్పులేమిటి?
జస్టిస్ ఈశ్వరయ్య: విద్య, ఆరోగ్యం అనేవి ధనికులకే పరిమితం కాకూడదు. ఆదాయ పన్ను పరిమితి లోపు ఉన్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో 2009 నాటి విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ, కార్పొరేట్ స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ హయాంలో తెచ్చిన చట్టమే కానీ ఇప్పుడు అమలు కావడం లేదు.
సహనం వందే: తెలంగాణ రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి ఎలా ఉంటుంది?
జస్టిస్ ఈశ్వరయ్య: తెలంగాణ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. తమిళనాడు తరహాలోనే ఇక్కడ కూడా 67 శాతం కోటాను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. దీనికోసం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళమెత్తి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతున్నాం.
సహనం వందే: క్రీమీలేయర్ పై మీ స్టాండ్ ఏంటి?
జస్టిస్ ఈశ్వరయ్య: క్రీమీలేయర్ అనేది బీసీలకు సంకెళ్లు వేసే విధానం. దీన్ని వెంటనే రద్దు చేయాలి. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి.
సహనం వందే: న్యాయవ్యవస్థలో బీసీల ప్రాతినిధ్యంపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?
జస్టిస్ ఈశ్వరయ్య: న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవులు ఇంకా కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయి.… తీర్పులు ఇచ్చే చోట వైవిధ్యం లేకపోతే సామాజిక న్యాయం కుంటుపడుతుంది. అందుకే హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.
సహనం వందే: రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీ డిమాండ్ ఏంటి?
జస్టిస్ ఈశ్వరయ్య: రాజకీయ పార్టీల నిర్ణయాధికారం ఇంకా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. పార్టీ సంస్థాగత పదవుల నుంచి టికెట్ల కేటాయింపు వరకు అన్ని స్థాయిల్లోనూ జనాభా ప్రాతిపదికన బీసీలకు చోటు కల్పించాలి.
సహనం వందే: బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం అంటారా?
జస్టిస్ ఈశ్వరయ్య: కచ్చితంగా… దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల కోసం ఒక ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఉండాలి. కేవలం పేరుకే కాకుండా దానికి రాజ్యాంగ హోదా, స్వతంత్ర అధికారాలు కల్పించాలి. అప్పుడే బీసీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది.
సహనం వందే: తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై మీ విమర్శ ఏంటి?
జస్టిస్ ఈశ్వరయ్య: ఎన్నికల ప్రచారంలో బీసీలకు 21 హామీలు ఇస్తూ కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేశారు. అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినప్పటికీ ఒక్క ప్రధాన హామీ కూడా అమలు చేయలేదు. ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే.
సహనం వందే: నిధుల కేటాయింపు ఎలా ఉండాలని మీరు కోరుతున్నారు?
జస్టిస్ ఈశ్వరయ్య: దేశ సంపదలో బీసీలకు వాటా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న విధంగానే బీసీల జనాభాకు అనుగుణంగా వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ఇది మా హక్కు. కేవలం ప్రభుత్వం ఇచ్చే ధర్మం కాదు.
సహనం వందే: పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల పరిపాలన దెబ్బతింటుందనే వాదన ఉంది కదా?
జస్టిస్ ఈశ్వరయ్య: ఇది తప్పుడు వాదన. ఒక వర్గానికి ప్రాతినిధ్యం లేనప్పుడే పరిపాలనలో సమతుల్యత దెబ్బతింటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లే బీసీలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తే వారు పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు.
సహనం వందే: మీ డిమాండ్లు నెరవేరకపోతే బీసీ వర్గాల స్పందన ఎలా ఉంటుంది?
జస్టిస్ ఈశ్వరయ్య: బీసీలు ఇప్పుడు మేల్కొన్నారు. తమ మౌనాన్ని వీడారు. రాజకీయ అధికారం అనేది అన్నిటికీ తాళం చెవి లాంటిదని మాకు అర్థమైంది. ప్రభుత్వం మా డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వారికి సరైన గుణపాఠం చెప్తాం. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, మా అస్తిత్వ పోరాటం.
సహనం వందే: కేవలం బీసీలనే ఆధారం చేసుకుని పోరాటాలు చేస్తున్నారు… ఎస్సీ ఎస్టీలను కలుపుకుపోవడం లేదన్న విమర్శలున్నాయి… దీనిపై మీరేమంటారు?
జస్టిస్ ఈశ్వరయ్య: రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే అర్థం. కాబట్టి వెనుకబడిన తరగతులని పిలుస్తున్నప్పుడు బహుజన వర్గాలన్నీ అందులో ఉన్నాయనే అర్థం చేసుకోవాలి.