- దేశ దేశాల్లో వ్యాపార విస్తరణకు వంశవృక్షం
- మస్క్ వంటి వారితో బంధుత్వానికి ఆరాటం
- వందల మందిని కని ప్రపంచ కుబేర్లతో పెళ్లిళ్లు
- చైనా ధనికుల ఎత్తుగడ… వారసుల వెల్లువ
- ఒక బిలియనీర్ 200 మందిని కనేందుకు ప్లాన్
- వేలకోట్ల సామ్రాజ్యానికి రిస్క్ లేని వారసులు
- అమెరికాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
సహనం వందే, హైదరాబాద్:
చైనా కుబేరులు ఇప్పుడు కేవలం ఆస్తులు పెంచుకోవడమే కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అడ్డదారుల్లో వంశ విస్తరణకు తెరలేపారు. చైనాలో సరోగసీ (అద్దె గర్భం)పై నిషేధం ఉండటంతో వీరు తెలివిగా అమెరికా చట్టాలను వాడుకుంటున్నారు. వీడియో గేమ్స్ కంపెనీ అధిపతి జూ బో దీనికి తాజా ఉదాహరణ. ఏకంగా 100 మందికి పైగా పిల్లలను కనడం కేవలం కుటుంబ ప్రణాళిక కాదు… ఇదొక భారీ వ్యాపార వ్యూహం. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం వచ్చే అవకాశాన్ని ఈ ధనవంతులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక్కో బిడ్డ కోసం దాదాపు 2 లక్షల డాలర్లు ఖర్చుపెట్టి తమ వంశాన్ని పెంచుకుంటూ పశ్చిమ దేశాల్లో తమ వ్యాపార మూలాలను మరింత పటిష్టం చేసుకునే పెద్ద ప్లాన్‌లో ఉన్నారు.

100 మంది వారసులు… వ్యాపార యోధులు
డూయీ నెట్‌వర్క్ అనే ఆన్‌లైన్ గేమింగ్ సంస్థకు యజమాని అయిన జూ బో ఇప్పటికే అమెరికాలో అద్దె తల్లుల ద్వారా 100 మందికి పైగా పిల్లలను కన్నాడు. ఆయన ప్రధానంగా మగ పిల్లలనే కోరుకోవడం వెనుక స్పష్టమైన బిజినెస్ లెక్కలు ఉన్నాయి. తన వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని భవిష్యత్తులో ఈ వారసులే చూసుకుంటారని ఆయన గట్టిగా నమ్ముతాడు. అయితే ఆయన కోరికలు కాలిఫోర్నియా కోర్టులో అడ్డుతగిలాయి. ఒకేసారి నలుగురు పుట్టబోయే పిల్లలతో సహా 8 మంది పిల్లల హక్కులు కావాలని ఆయన కోరగా న్యాయమూర్తి దీనిని తిరస్కరించారు. సరోగసీ అంటే కుటుంబం పెంచుకోవడానికే కానీ… ఇలా సామూహికంగా పిల్లలను పుట్టించి చట్టపరమైన చిక్కుల్లో పడేయడానికి కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ జూ బో తన వ్యాపార వారసత్వాన్ని బిడ్డల సంఖ్యతో ముడిపెట్టే ప్రయత్నం మానలేదు.
అమెరికా సరోగసీ మార్కెట్లో చైనా క్లయింట్ల జోరు…
చైనా ధనవంతుల కారణంగా అమెరికాలో సరోగసీ వ్యాపారం భారీగా ఊపందుకుంది. ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఏజెన్సీలు, న్యాయవాదులు, శిశువుల సంరక్షకులు అంతా కలిసి ఈ ప్రక్రియను చైనా క్లయింట్ల కోసం సులభతరం చేస్తున్నారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతర్జాతీయ సరోగసీ కేసుల్లో 40 శాతం చైనా వాళ్లవే కావడం ఈ ధోరణికి అద్దం పడుతోంది. ఒక్కో కేసు కోసం లక్షల డాలర్లు వెచ్చించడానికి ఈ ధనవంతులు వెనుకాడటం లేదు. ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు కూడా ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని చూసి ఇక్కడి ధనికులు కూడా ప్రేరణ పొందుతున్నారు. జూ బో తన పిల్లలకు మస్క్ పిల్లలతో పెళ్లిళ్లు చేసి రెండు శక్తివంతమైన వంశాలను కలిపి పెద్ద వ్యాపార బంధాన్ని ఏర్పరచాలని కలలు కంటున్నాడంటే దీని వెనుక ఎంత పెద్ద వ్యూహాత్మక ఆలోచన ఉందో అర్థం చేసుకోవచ్చు.
రిస్క్ ఫ్రీ బిజినెస్ ప్లాన్…
జూ బో ఒక్కడే కాదు చైనాలో మరెంతో మంది ధనికులు ఇదే బాటలో తమ వంశ విస్తరణ ప్లాన్‌లను అమలు చేస్తున్నారు. విద్యా రంగ ఎగ్జిక్యూటివ్ అయిన వాంగ్ హుయివు అయితే అమెరికన్ మోడల్స్ నుంచి అండాలను సేకరించి 10 మంది కూతుళ్లను కన్నాడు. భవిష్యత్తులో ఈ కూతుళ్లకు శక్తివంతమైన వ్యాపార కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు కలుపుకొని తమ వ్యాపార బంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనేది ఆయన ఆలోచన. మరో వ్యాపారవేత్త ఏకంగా 200 మంది పిల్లలు కావాలని కోరాడంటే ఈ ధోరణి ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని, రాజకీయ పలుకుబడిని తమ పిల్లల సంఖ్య, శక్తివంతమైన వారసుల ద్వారా కాపాడుకోవడమే ఈ ధనవంతుల అంతిమ లక్ష్యం.