- తాడేపల్లిలో రాజకీయ సెగ పుట్టిస్తున్న కటౌట్
- నేడు జగన్ పుట్టినరోజు… నివాసం వద్ద ఫ్లెక్సీ
- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
- వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యం
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది.

పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరులోనూ వైసీపీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు భారీగా నిర్వహిస్తున్నారు. అయితే తాడేపల్లి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో జగన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు ఉండటం చర్చనీయాంశమైంది. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
గులాబీ పార్టీకి ఫ్యాన్ మద్దతు…
వైసీపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఈ కటౌట్‌ను చూసి పండగ చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రులు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమ గురువు, శిష్యులు కలిసి ప్రత్యర్థులను చిత్తు చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తాడేపల్లి ఫ్లెక్సీనే పునాది అని కేడర్ నమ్ముతోంది.
ఖమ్మం కోటలో కొత్త స్కెచ్…
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్‌కు ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ ఖమ్మం జిల్లాలో వైసీపీ మద్దతుతో గులాబీ పార్టీ అభ్యర్థులు చాలా మంది విజయం సాధించారు. ఇప్పుడు అదే ఫార్ములాను వచ్చే ఎన్నికల్లోనూ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ జిల్లాల్లో ఒంటరిగా గెలవడం కష్టమని భావిస్తున్న బీఆర్ఎస్, జగన్ ఫాలోయింగ్‌ను వాడుకోవాలని చూస్తోంది. ఇద్దరు నేతలు కలిసి వెళ్తే రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు సులభమవుతుందని వ్యూహాలు రచిస్తున్నారు.
గెలుపు గుర్రం ఎక్కే వ్యూహం
ఏపీలో అధికారం కోల్పోయిన జగన్, తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ ఇప్పుడు ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. తాడేపల్లి వద్ద వెలిసిన ఈ కటౌట్ కేవలం అభిమానం కాదని… ఇదొక లోతైన వ్యూహమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2028 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్‌లో కేడర్‌ను ఏకం చేయడానికి ఈ తరహా ప్రయోగాలు మొదలుపెట్టారు. మరి ఈ పొత్తుల స్కెచ్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.