- సొంత పార్టీ నేతలైనా సరే ఊరుకునేది లేదు
- ఉత్తరాంధ్రలో సెటిల్మెంట్ రాజాలకు చెక్
- పోలీసుల తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం
- శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
- ఆ నాయకులు ఎవరన్నది హాట్ టాపిక్
సహనం వందే, విశాఖపట్నం:
ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు రాజకీయ నేతల ఆటబొమ్మలయ్యాయి. ధరలు పెరగడంతో వివాదాలు ముదిరి హత్యల దాకా వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సొంత పార్టీ సహా కూటమి నేతలే ఈ దందాల్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చాలు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది.
పవన్ కళ్యాణ్ పవర్ వార్నింగ్
రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భూవివాదాలు హద్దులు దాటాయని ఆయన మండిపడ్డారు. రాజకీయ నేతలు సెటిల్మెంట్లలో తలదూరుస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కేసులు పెట్టడానికి జంకుతున్నారని ఆయన ఎండగట్టారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని… అభివృద్ధి కుంటుపడుతుందని పవన్ హెచ్చరించారు.
పార్టీ నేతలకు సీరియస్ మెసేజ్
ఈ వ్యవహారంలో పవన్ తన సొంత పార్టీ జనసేన నాయకులను కూడా వదల్లేదు. ఉత్తరాంధ్రలో కొందరు కీలక నేతలు భూ సెటిల్మెంట్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయనకు నివేదికలు అందాయి. భూ కబ్జా ముసుగులో ఉన్న ఆ నాయకుల పేర్లను ప్రస్తావించకపోయినా వారిని ఉద్దేశించి గట్టిగానే చురకలు అంటించారు. అధికారం ఉందని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటు సీఎం చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఏ పార్టీ నేత అయినా సరే కబ్జాలకు పాల్పడితే జైలుకు పంపాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దీంతో చెందిన కూటమి పార్టీలకు చెందిన నాయకుల భూకబ్జాను ఆ ప్రభుత్వమే బట్ట బయలు చేయడం విశేషం. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన భూ కబ్జా నేతలు ఎవరన్నది ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసుల తీరుపై నిప్పులు
సివిల్ వివాదాలను పరిష్కరించడంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై పవన్ నిప్పులు చెరిగారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల గ్యాంగ్ స్టర్లు చేస్తున్న దాడులను కూడా పోలీసులు అడ్డుకోవడం లేదని ఆయన విమర్శించారు. 15 శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం అని గుర్తు చేశారు. గత పాలనలో పెరిగిన ఈ అరాచకాలను ఇప్పటికైనా అరికట్టకపోతే వ్యవస్థ నాశనం అవుతుందని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరగనప్పుడు ప్రభుత్వం ఉండి వ్యర్థమని ఆయన కుండబద్ధలు కొట్టారు.
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
భూదందాలతో పాటు అనవసర ధ్వని కాలుష్యం గురించి కూడా పవన్ మాట్లాడారు. మత కార్యక్రమాల పేరుతో అర్థరాత్రి వేళల్లో చేసే శబ్దాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై కఠినంగా ఉండాలని సూచించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ హెచ్చరికలు నిజంగానే క్షేత్రస్థాయిలో అమలు అవుతాయా లేదా అన్నది వేచి చూడాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే మళ్లీ పునరావృతం కాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.