- బ్యాంకు రుణానికి ఇల్లు తాకట్టు పెట్టిన నేత
- ఫీజు కట్టలేక సీటు కోల్పోయే స్థితిలో భరోసా
- వైద్య విద్యార్థిని మమతకు 20 లక్షల రుణం
- నాయకత్వానికి కొత్త నిర్వచనం చెప్పిన లీడర్
- హరీష్ రావు పనితీరుకు చంద్రబాబు ఫిదా…
సహనం వందే, సిద్దిపేట:
కష్టం వస్తే కాదనని మనసు… కన్నీరు వస్తే కరిగిపోయే తత్వం ఆయనది. సిద్దిపేట బిడ్డల భవిష్యత్తు కోసం తన ఆస్తులను సైతం పణంగా పెట్టే గొప్ప మానవతావాది హరీష్ రావు. తాజాగా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని మెడికల్ పీజీ చదువు ఆగిపోకుండా ఉండేందుకు ఆయన ఏకంగా తన స్వగృహాన్నే బ్యాంకులో తనఖా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఫీజు గండం నుంచి బయటపడేలా…
సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తి చేసి మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది. మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. అయితే ప్రతి ఏటా 7.50 లక్షల రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
వెంటనే ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేక ఆ తండ్రి దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. బ్యాంకు అధికారులను ఆశ్రయించగా ఏదైనా ఆస్తిని మార్టిగేజ్ చేస్తేనే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని తేల్చి చెప్పారు.
హరీష్ రావును ఆశ్రయించిన తండ్రి…
ఏ దారీ కనిపించని సమయంలో రామచంద్రం తన గోడును హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం విన్న వెంటనే ఆయన స్పందించారు. విద్యార్థిని భవిష్యత్తు దెబ్బతినకూడదని భావించి సిద్దిపేటలోని తన సొంత ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడి సబ్ రిజిస్టర్ ద్వారా మార్టిగేజ్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయించారు. దీని ద్వారా దాదాపు 20 లక్షల రూపాయల విద్యార్థి రుణాన్ని మంజూరు చేయించి మమతకు అందజేశారు. కాలేజీలో సీటు దక్కడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
అప్పు చేయొద్దని అదనపు సాయం…
కేవలం బ్యాంకు రుణంతోనే సరిపెట్టకుండా హరీశ్ రావు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మొదటి సంవత్సరం హాస్టల్ ఫీజు కోసం 1 లక్ష రూపాయలు అవుతాయని తెలిసి ఆ మొత్తాన్ని ఆయనే స్వయంగా చెల్లించారు. మెడికల్ పీజీ చదువు కోసం మళ్లీ ఎవరి దగ్గరా అప్పు చేయవద్దని ఆ అమ్మాయిని ధైర్యపరిచారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన రాజకీయం అని ఆయన మరోసారి నిరూపించారు. సామాన్య కార్యకర్తల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఆయన అండగా నిలుస్తున్నారు.
సామాజిక సేవకు ప్రాధాన్యం…
కాసేపు రాజకీయాలను పక్కనపెట్టి హరీష్ రావు గురించి చెప్పుకోవాలి. రాజకీయంగా ఆయన పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన సామాజిక సేవకు చాలా ప్రాధాన్యమిస్తారు. రాజకీయాలంటే సీట్లు ఓట్లు గెలవడం మాత్రమే కాదని… సామాజిక సేవ ప్రధానమని ఆయన ఆచరించి చూపిస్తారు. రాష్ట్రంలో అనేకమంది నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో గెలవడానికి ఆపసోపాలు పడుతుంటారు. కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట ప్రజల్లో తనదైన ముద్ర వేశారు.
హరీష్ రావు పనితీరుకు చంద్రబాబు ఫిదా…
ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. ‘సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్ రావు ఎలా అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలిచారో… అలాగే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పని చేయాలి… హరీష్ రావు లాగా ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండాల’ని స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరాలలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. నియోజకవర్గాలను హరీష్ రావు లాగా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని సూచిస్తుంటారట.

అంతేకాదు అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని… ఎలాంటి క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో కూడా గెలిచే విధంగా తీర్చిదిద్దుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని ఆ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించి హరీష్ రావు పనితీరును పరిశీలించారు. ఇలా నోట్లో నాలుకలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే హరీష్ ను పార్టీలకు అతీతంగా అనేకమంది ఇష్టపడతారు.