- బాధ్యత నుంచి తప్పించుకుంటున్న కేంద్రం
- దీనివల్ల అనేక రాష్ట్రాల్లో అమలుపై సందేహం
- గతంలో కేంద్ర ప్రభుత్వమే మొత్తం భరించేది
- మహాత్ముడి పేరు తీసి హక్కులు హరింపు
- వ్యవసాయ పనుల సీజన్‌లో పథకానికి బ్రేక్
సహనం వందే, హైదరాబాద్:
గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్రే కానుందా? కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు మార్చడమే కాక… దాని స్వరూపాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది! మహాత్ముడి పేరు తొలగించి… దానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి అని కొత్త పేరు పెట్టే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు ముక్తకంఠంతో విమర్శిస్తున్నాయి. ప్రియాంక గాంధీ వంటి నాయకులు మహాత్ముడి పేరు ఎందుకు తీసేస్తున్నారని నిలదీస్తున్నారు. కేవలం పేరు మార్చడమే కాక… ఈ చట్టాన్ని బలహీనపరిచేలా నిబంధనల్లో భారీ మార్పులు ప్రతిపాదించడం వెనుక కేంద్రం ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు హాట్‌టాపిక్.
రాష్ట్రాల మెడకు 40 శాతం భారం…
ప్రతిపాదిత బిల్లు ప్రకారం… ఈ పథకం నిధుల పంపిణీ విధానం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం వేతనాల ఖర్చును నూటికి నూరు శాతం కేంద్రమే భరిస్తుంటే… ఇకపై కేంద్రం-రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవాలని ప్రతిపాదించడం సంచలనం రేపుతోంది. అంటే రాష్ట్రాలపై ఒక్కసారిగా 40 శాతం ఆర్థిక భారం పడబోతోంది. నిధుల వాటా పెరిగితే రాష్ట్రాలు పథకాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేస్తాయని… తద్వారా ఉపాధి హక్కు బలహీనపడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిధులు సరిగా ఇవ్వట్లేదని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ కొత్త విధానం కేవలం రాష్ట్రాల ఆర్థిక స్థితిని దెబ్బతీయడానికి కేంద్రం వేసిన ఎత్తుగడగా విమర్శకులు దుయ్యబడుతున్నారు.
వ్యవసాయ సీజన్లలో బంద్…
ఉపాధి హామీ పథకం ద్వారా కార్మికులు కనీస వేతనం డిమాండ్ చేసే శక్తిని సాధించారు. బయట పని దొరకకపోతే కనీసం ఇక్కడైనా పని ఉంటుందనే భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపాదించిన మార్పులు… ఆ చట్టబద్ధమైన హక్కులన్నింటినీ తుంగలో తొక్కుతాయని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎంకేఎస్‌ఎస్) వ్యవస్థాపక సభ్యులు నిఖిల్ డే ఆరోపిస్తున్నారు. పని దినాలు 100 నుంచి 125కి పెంచినా… ఏడాదిలో 60 రోజులు వ్యవసాయ పనుల సీజన్‌లో పని ఇవ్వకుండా ఆపే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది. వ్యవసాయ పనుల సమయంలో వేతనాల ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికే ఈ మార్పు అని కేంద్రం చెబుతున్నా ఇది వ్యవసాయ కార్మికులను మరింత దోపిడీకి గురిచేయడానికి దారితీస్తుందని విమర్శకులు గళమెత్తారు. అంతేకాదు పని దొరకకపోతే ఇచ్చే నిరుద్యోగ భృతి, వేతనాల ఆలస్యంపై ఇచ్చే నష్టపరిహారం భారాన్ని కూడా రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్రం చూడటం అత్యంత విమర్శలకు తావిస్తోంది. ఇది కేవలం పాత చట్టంలోని స్ఫూర్తిని, హక్కులను కాలరాసేందుకు కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్ర అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.