- కోడ్, అల్గోరిథమ్‌కు అతీతమైన ఆరాధన
- ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక ఉపాధి
- ఆలయాలే యువతకు అవకాశాల గని
- సుస్థిరమైన కెరీర్: దేవాలయ మేనేజ్‌మెంట్
- 30 లక్షల ఆలయాల్లో ఉద్యోగ అవకాశాలు
- అనేక యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులు
- గుడుల నిర్వహణలో నిపుణుల అవసరం
- కోట్ల సంఖ్యలో పెరుగుతున్న భక్తుల తాకిడి
- మారుతున్న నిర్వహణ… ఉపాధికి గ్యారెంటీ
సహనం వందే, హైదరాబాద్:
కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ అడుగుపెట్టి ఉద్యోగాలను మింగేస్తున్న వేళ దేవాలయాల ప్రాంగణాలు మాత్రం భద్రమైన ఉపాధికి ఆశ్రయంగా మారుతున్నాయి. భక్తి, నమ్మకం అనేవి మనిషికి దేవుడికి మధ్య ఉండే అనుబంధం కాబట్టి ఇక్కడ మిషన్ల కన్నా మనుషుల అవసరమే ఎక్కువగా ఉంది. కాలక్రమేణా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా ఇప్పుడు దేవాలయాల నిర్వహణలో వృత్తిపరమైన శిక్షణ, డిగ్రీలు అవసరమవుతున్నాయి. ఇదొక కొత్త కెరీర్‌గా మారుతోంది. యువత నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దాకా అందరూ ఈ వైపు చూస్తున్నారు.

నిర్వహణలో నైపుణ్యం
పూణే యూనివర్సిటీ నుంచి వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దాకా ఇప్పుడు దేవాలయ నిర్వహణలో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాయి. ఆరు నెలల నుంచి ఒక ఏడాది పాటు సాగే ఈ కోర్సుల్లో అభ్యర్థులకు దేవాలయ ఆర్థిక వ్యవస్థ, చట్టపరమైన నిబంధనలు, ప్రాంగణాల నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పన వంటి అంశాలను బోధిస్తారు. ఒక సాధారణ మేనేజ్‌మెంట్ కోర్సులో నేర్చుకునే ఫైనాన్స్, లీగల్ కంప్లైయన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలను ఇక్కడ దేవాలయాల కోసం అన్వయిస్తారు.
అర్హతలు… అవకాశాలు
ఈ కోర్సుల్లో చేరడానికి ప్రత్యేకమైన అర్హతలు అంటూ ఏమీ లేవు. పన్నెండో తరగతి పూర్తి చేసిన యువత నుంచి పదవీ విరమణ పొందిన ఇంజనీర్ల దాకా ఎవరైనా ఇందులో చేరవచ్చు. ముంబైలోని వెలింకర్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ వంటి సంస్థలు ఈ శిక్షణను అందిస్తున్నాయి. కోర్సు పూర్తయ్యాక విద్యార్థులకు టెంపుల్ అడ్మినిస్ట్రేటర్, రిలీజియస్ టూరిజం మేనేజర్, పిలిగ్రిమేజ్ కోఆర్డినేటర్, కల్చరల్ హెరిటేజ్ మేనేజర్ వంటి హోదాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
భక్తుల భారీ ప్రవాహం…
దేవాలయాల ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి గణాంకాలే సాక్ష్యం. కాశీ విశ్వనాథ ఆలయానికి 2017లో 67 లక్షల మంది భక్తులు రాగా… 2024 నాటికి ఆ సంఖ్య 11 కోట్లకు చేరింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2019లో 2.30 కోట్ల మంది భక్తులు రాగా, 2024-25 నాటికి 3 కోట్ల మంది భక్తులు వచ్చారని ఇండియా టుడే నివేదిక చెబుతోంది. అంటే ప్రతిరోజు సగటున 82 వేల మందికి పైగా భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారన్నమాట.
ఏఐని దాటేసిన భక్తి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 లక్షల దేవాలయాలు ఉండటం… వాటిని నిర్వహించడానికి భారీ బృందాలు అవసరమవ్వడం వల్ల ఈ కెరీర్ భవిష్యత్తులో చాలా కీలకం కానుంది. పూజా కార్యక్రమాలు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, పండుగల నిర్వహణ వంటి అంశాల్లో మానవ ప్రమేయం తప్పనిసరి. ఏఐ లాంటి సాంకేతికతలు ఈ భావోద్వేగాలను భర్తీ చేయలేవు కాబట్టే ఇది రిసెషన్-ప్రూఫ్ కెరీర్‌గా నిలుస్తోంది.

యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్
సాంప్రదాయకంగా కొన్ని వర్గాలకే పరిమితమైన ఈ రంగం ఇప్పుడు మరింత విస్తృతమవుతోంది. క్లాస్‌రూమ్‌లలో దళితులు, బ్రాహ్మణులు కలిసి శిక్షణ పొందడం, మూడో వంతు విద్యార్థులు మహిళలు కావడం ఒక కొత్త సామాజిక మార్పుకు సంకేతం. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు టెంపుల్ కనెక్ట్ వంటి సంస్థలతో కలిసి విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పించే పనిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ కోర్సులను ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. రాబోయే రోజుల్లో పెద్ద దేవాలయాల్లో వందలాది మంది మేనేజర్లకు ఉపాధి దొరికే అవకాశం ఉంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్