పార్లమెంటుకు టీడీపీ ఎంపీ అప్రతిష్ఠ – డ్రగ్స్ మత్తులో అడ్డంగా దొరికిన ఏలూరు ఎంపీ

TDP MP Putta Mahesh
  • పుట్టాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొకైన్ బాగోతం
  • హైదరాబాదులో పట్టుబడ్డ రాజకీయ ముఠా
  • ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న మన నేతలు
  • యూరిన్ శాంపిల్స్‌ తారుమారుకు నాటకాలు
  • రాజకీయ దర్పంతో పోలీసులపైకి తూటాలు
  • ఖద్దరు ముసుగులో నేతల మత్తు సామ్రాజ్యం
  • రాజకీయ ప్రకంపనలు.. షోకాజ్ నోటీసుల వేడి

సహనం వందే, హైదరాబాద్:

అధికార దర్పం రాజ్యమేలుతున్న వేళ ప్రజాప్రతినిధుల నైతిక పతనం పరాకాష్టకు చేరింది. చట్టాన్ని రూపొందించాల్సిన చేతులే డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో ఒక చీకటి అధ్యాయాన్ని ఆవిష్కరించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఈ మత్తు విందు అధికారం చుట్టూ అల్లుకున్న అపవిత్ర నేర సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు నిరూపిస్తోంది.

TDP MP Putta Mahesh caught in Drugs Case

ఏలూరు ఎంపీ పుట్టా పొట్టలో డ్రగ్స్
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ కేంద్రంగా జరిగిన ఈ డ్రగ్స్ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ అడ్డంగా దొరికిపోయారు. ప్రజాప్రతినిధి హోదాను అడ్డుపెట్టుకుని సాక్ష్యాలను సైతం తారుమారు చేసేందుకు ప్రయత్నించిన వైనం రాజకీయాల్లో పేరుకుపోయిన చీకటి సంస్కృతికి అద్దం పడుతోంది. ఖద్దరు చొక్కాల మాటున దాగున్న ఈ అరాచక రాజకీయ నేరగాళ్ల బాగోతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

మత్తు విందులో ప్రజాప్రతినిధుల బరితెగింపు
తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఒక భయంకరమైన డ్రగ్స్ అడ్డాగా మారింది. వీకెండ్ పార్టీల పేరుతో ఇక్కడ సాగిన విలాసాలు చట్టాన్ని శాసించాల్సిన వ్యక్తుల నైతిక పతనాన్ని చాటిచెబుతున్నాయి. ఈగల్ టీమ్ నిర్వహించిన మెరుపు దాడిలో మద్యంతో పాటు నిషేధిత కొకైన్ బయటపడటం ఈ వ్యవస్థలోని కుళ్లును బయటపెట్టింది. ప్రజాప్రతినిధులు హుక్కా, డ్రగ్స్ మత్తులో తూగుతూ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

శాంపిల్స్‌ను బురిడీ కొట్టించిన ఎంపీ…
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఈ కేసులో కీలక నిందితుడిగా మారారు. పోలీసులను బురిడీ కొట్టించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అభాసుపాలయ్యాయి. శనివారం నాటి యూరిన్ పరీక్షల్లో నెగిటివ్ అని తేల్చుకున్నా ఆదివారం రక్త పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపి దర్యాప్తును తప్పుదోవ పట్టించాలనే ఎంపీ ప్రయత్నం బెడిసికొట్టింది.

తుపాకీ గర్జన.. పోలీసులపైకే దాడి
తనిఖీలకు వచ్చిన పోలీసులనే భయపెట్టే స్థాయికి నిందితుల ధైర్యం పెరగడం శోచనీయం. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ పోలీసులపైకి తుపాకీని ఎక్కుపెట్టి గాల్లోకి కాల్పులు జరపడం దారుణం. రితేష్‌రెడ్డి లైసెన్స్‌డ్ గన్‌ను చట్టవిరుద్ధంగా వాడటం వెనుక అధికార అండ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయుధాల చట్టం కింద నమిత్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు దీనిపై లోతైన విచారణ చేపడుతున్నారు.

సిమ్లా నుండి మొయినాబాద్ వరకు డ్రగ్స్…
ఈ డ్రగ్స్ దందా కేవలం ఒక ఫామ్‌హౌస్‌కే పరిమితం కాలేదు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి ఏకంగా సిమ్లా నుంచి ఈ కొకైన్‌ను సరఫరా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పైలట్ రోహిత్‌రెడ్డి పీఏ శరత్ కుమార్ ఈ డ్రగ్స్ పార్టీని సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్ ప్యాకెట్లను దాచి దర్యాప్తు సంస్థలను ముప్పుతిప్పలు పెట్టాలని చూశారు. శరత్ కుమార్ వద్ద 2 గ్రాముల కొకైన్ దొరకడంతో ఈ నెట్‌వర్క్ గుట్టు రట్టు అయ్యింది.

చట్టం బోనులో 11 మంది నిందితులు
మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా ఎంపీ పుట్టా మహేష్, పైలట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డి సహా ఆరుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ సెక్షన్ 22 కింద నమోదైన కేసులు నిందితుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధికార బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నా పక్కా ఆధారాలతో పోలీసులు ముందుకెళ్తున్నారు.

రాజకీయ ప్రకంపనలు.. షోకాజ్ నోటీసుల వేడి
ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఘటనపై పుట్టా మహేష్‌కు తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని… లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉండటాన్ని ఘాటుగా విమర్శించారు. డ్రగ్స్ వాడే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *