వందలాది పిల్లలకు తండ్రి అయ్యే ఛాన్స్ – ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం కోట్ల వ్యాపారం

One Sperm Hundreds of Kids
  • దేశ దేశాన వందల మందికి ఒక్కడే తండ్రి
  • తెలియకుండానే ఎక్కడెక్కడో తోబుట్టువులు
  • అందమైన, ఆరోగ్యకరమైన స్పెర్మ్ కే డిమాండ్
  • ఎత్తు, తెల్లగా, అందమైన దాతలకు కోట్ల వర్షం
  • దుమ్ము రేపుతోన్న డానిష్ మగాళ్ల స్పెర్మ్
  • ఒక్కరి వీర్యంతో ఎంతమందినైనా కనొచ్చు
  • సంతానం లేని దంపతులకు ఇదొక వరం
  • పిల్లలను కనాలనే ఒంటరి మహిళలకు కూడా!
  • ప్రఖ్యాత బీబీసీ ఛానల్ పరిశోధనలో వెల్లడి

సహనం వందే, లండన్:

ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం ఇప్పుడు వేల కోట్ల వ్యాపారంగా వృద్ధి చెందుతోంది. ఒకే వ్యక్తి స్పెర్మ్ ద్వారా వందల మంది పిల్లలు పుడుతున్న సంచలన విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బీబీసీ’ న్యూస్ ఛానల్ (https://bbc.in/48SL4MG) ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఒక దాత వీర్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యు మార్పు ఉన్నట్లు తేలింది. ఈ వ్యక్తి వీర్యాన్ని ఏకంగా 14 దేశాలకు పంపించి దాని ద్వారా కనీసం 197 మంది పిల్లలను పుట్టించినట్లు వెల్లడైంది. ఈ ఒక్క సంఘటన వీర్య దానం పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో… అది ఎంత పెద్ద వ్యాపారంగా మారిందో కళ్లకు కట్టింది. ఐరోపాలో ఈ మార్కెట్ విలువ 2033 నాటికి 24,216 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

One Father to Huge Kids

వీర్యానికి భారీ డిమాండ్…
సంతానం లేని దంపతులకు లేదా ఒంటరిగా పిల్లలను కనాలని ఆశించే మహిళలకు వీర్య దానం ఒక వరంలా మారింది. అయితే ఈ అవసరాన్ని తీర్చడం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఈ రంగంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే సమస్యకు మూలం. నిజానికి స్పెర్మ్ ను దానం చేయడానికి వచ్చే పురుషులలో కేవలం 5 శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. స్పెర్మ్ నాణ్యత, ఆకారం, గడ్డకట్టే సామర్థ్యం, అలాగే హెచ్‌ఐవీ, గనేరియా వంటి అంటువ్యాధులు లేకపోవడం, వెన్నెముక కండరాల క్షీణత వంటి జన్యుపరమైన సమస్యలు లేకపోవడం వంటి కఠినమైన పరీక్షలను దాటాలి. ఈ కఠిన నిబంధనల వల్ల దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. యూకేలో సగం స్పెర్మ్ దిగుమతి అవుతోంది. ఈ కొరత కారణంగానే అందుబాటులో ఉన్న కొద్దిమంది దాతల స్పెర్మ్ ను ఎక్కువమంది వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వైకింగ్ స్పెర్మ్ అంతలా ఎందుకు పాపులర్?
వీర్యదాతల సంఖ్య తక్కువగా ఉన్నా కొందరి స్పెర్మ్ కు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డేటింగ్ యాప్‌లలో మాదిరిగానే దాతలను ఎంచుకునేటప్పుడు గ్రహీతలు (రిసిపియెంట్స్) వారి ఫోటోలు, వాయిస్, ఉద్యోగం, ఎత్తు, బరువు వంటి అంశాలను బట్టి ఎంచుకుంటారు. పొడవుగా, తెల్లటి చర్మంతో, అందంగా ఉండే దాతల స్పెర్మ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. డెన్మార్క్ ఇప్పుడు ప్రపంచంలోనే స్పెర్మ్ ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా మారింది. డెన్మార్క్‌లోని క్రయోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఓలే షూ మాట్లాడుతూ… డానిష్ ప్రజలు దాతృత్వ గుణం కలిగి ఉండటంతో పాటు వారిలోని నీలి కళ్లు, బంగారు జుట్టు వంటి జన్యు లక్షణాలు కూడా ఈ స్పెర్మ్ డిమాండ్‌ను పెంచుతోందని తెలిపారు.

Sperms

హద్దులు లేని దేశాంతర వినియోగం
సమస్యంతా ఇక్కడే ఉంది. ఒక దాత స్పెర్మ్ ను ఎన్నిసార్లు ఉపయోగించాలనే దానిపై ఒక్కో దేశంలో ఒక్కో నియమం ఉంది. కొన్ని దేశాలు పుట్టే పిల్లల సంఖ్యపై పరిమితి విధిస్తే… మరికొన్ని ఆ వీర్యంతో సంతానం పొందే తల్లుల సంఖ్యపై పరిమితి పెడుతున్నాయి. అయితే ఒకే దాత స్పెర్మ్ ను ఒక దేశంలోనే కాకుండా ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాలకు పంపుతున్నారు. ఈ విధంగా ప్రతి దేశం తమ నిబంధనలను పాటిస్తున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఒక దాత ద్వారా వందల మంది పిల్లలు పుట్టడానికి అవకాశం ఏర్పడింది. ఈ విధానం కారణంగా సగం తోబుట్టువులు (హాఫ్-సిబ్లింగ్స్) తెలియకుండానే ఒకరినొకరు కలుసుకునే, వివాహం చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఉమ్మడి రిజిస్టర్ ఆవశ్యకత
ఒక దాత స్పెర్మ్ ద్వారా పుట్టిన 197 మంది పిల్లలలో క్యాన్సర్ జన్యువు కనుగొన్న తర్వాత బెల్జియం అధికారులు ఐరోపా సమాఖ్యకు ప్రత్యేక విన్నపం చేశారు. సరిహద్దులు దాటుతున్న వీర్యాన్ని పర్యవేక్షించడానికి ఐరోపా వ్యాప్తంగా దాతల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పరిశ్రమ ఇప్పుడు కేవలం సంతానోత్పత్తి వ్యాపారంగా మారిందని బెల్జియం ఉప ప్రధానమంత్రి ఫ్రాంక్ వాండెన్‌ బ్రూక్ అన్నారు. ఈ సమస్యను అదుపు చేయడానికి ఒక దాత ద్వారా గరిష్టంగా 50 కుటుంబాలకు మాత్రమే స్పెర్మ్ ను వినియోగించాలని ఈయూ మానవ పునరుత్పత్తి సంస్థ ప్రతిపాదించింది. అయినప్పటికీ ఇది ఒక దాత ద్వారా వందకు పైగా పిల్లలు పుట్టడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ సంక్లిష్టమైన అంశంలో గుర్తింపు, గోప్యత వంటి అనేక నైతిక సవాళ్లు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *