- గ్రోత్ హార్మోన్ వ్యాధితో బాధపడ్డ మెస్సీ
- ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విగ్రహాలు
- రేపు ఇండియాకు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్
- కోల్‌కతాలో 70 అడుగుల భారీ విగ్రహం
- తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న మెస్సీ
- తర్వాత హైదరాబాదులో సీఎంతో మ్యాచ్
- తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచ ఫుట్‌బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది.
కష్టాల కడలి దాటిన దిగ్గజం…
ఫుట్‌బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మెస్సీ వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాల నుంచే మొదలైంది. అర్జెంటీనాలో పుట్టిన మెస్సీకి పదేళ్ల వయసులోనే గ్రోత్ హార్మోన్ లోపం అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఈ ఖరీదైన చికిత్సను ఆయన కుటుంబం భరించలేకపోయింది. సరిగ్గా అప్పుడే బార్సిలోనా క్లబ్ ముందుకు వచ్చి ఆయనకు పూర్తి చికిత్స అందిస్తూ క్లబ్‌లో చేర్చుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఆ అరుదైన వ్యాధిని అధిగమించి ఈరోజు ఎనిమిది బాలన్ డీఓర్ అవార్డులు… ప్రపంచకప్ గెలుపుతో ప్రపంచ శిఖరాలకు చేరుకున్నారు.

కోల్‌కతాలో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం
ఫుట్‌బాల్‌ను అమితంగా ప్రేమించే కోల్‌కతా నుంచే మెస్సీ పర్యటన మొదలవుతుంది. కోల్‌కతాలోని శ్రీభూమి ప్రాంతంలో ఏకంగా 70 అడుగుల భారీ మెస్సీ విగ్రహాన్ని ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లియోనెల్ మెస్సీ విగ్రహంగా నిలవనుంది. ఆయన స్వదేశం అర్జెంటీనా, దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం పరాగ్వే, బార్సిలోనాలతో పాటు ఇప్పుడు ఇండియాలో కూడా ఆయన విగ్రహం కొలువుదీరనుంది.
హైదరాబాదులో ముఖ్యమంత్రితో మ్యాచ్…
కోల్‌కతా పర్యటన తర్వాత అదే రోజు సాయంత్రం మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నాడు. ఇక్కడ ఆయన ఒక సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన గోట్ కప్ కార్యక్రమంలో భాగం కానున్నారు. మ్యాచ్ తర్వాత అర్జెంటీనా లెజెండ్ యువ ఆటగాళ్లకు మాస్టర్ క్లాస్ ఇవ్వడంతో పాటు పెనాల్టీ షూటౌట్స్‌లో సందడి చేయనున్నారు. రాత్రికి మ్యూజికల్ కాన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు.
ముంబైలో ఫ్యాషన్ షో… ఢిల్లీలో మోడీతో భేటీ
హైదరాబాద్ పర్యటన అనంతరం మెస్సీ మరుసటి రోజు ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ సెలబ్రిటీలతో కలిసి ఒక ఫ్యాషన్ షోలో పాల్గొని సామాజిక సేవ కోసం నిర్వహించే కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఆ తర్వాత చివరిగా ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం అదే రోజు రాత్రి ఆయన స్వదేశానికి బయలుదేరుతారు.
మెస్సీతో ఫోటోకు కోట్లే!
మెస్సీ క్రేజ్ కారణంగా ఆయనను దగ్గరగా కలవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా లక్షల్లో చెల్లించక తప్పదు. ఈ పర్యటన మొత్తం వాణిజ్యపరమైనది కావడంతో స్పాన్సర్లు ప్రత్యేక ప్యాకేజీలను ఖరారు చేశారు. ఈ ప్యాకేజీల ధరలు మెస్సీ ప్రపంచ స్థాయికి అనుగుణంగా భారీగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి గోట్ ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్ సుమారు 10 లక్షల రూపాయలు కాగా… పది మందికి కార్పొరేట్ ఫెలిసిటేషన్ ప్యాకేజ్ అయితే ఏకంగా కోటి రూపాయల వరకూ ఉంది.