ముగ్గురు గాంధీల కొత్త గ్లామర్ – పార్లమెంటును ఊపేస్తున్న తల్లీ, అన్నాచెల్లెళ్లు

Three Gandhis
  • కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారిగా ఈ పరిస్థితి
  • ఏకకాలంలో కీలకంగా రాహుల్, ప్రియాంక
  • దేశవ్యాప్తంగా పార్టీ క్యాడర్ లో చెల్లి జోష్
  • పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న సోనియా
  • ఎవరి స్టైల్ వారిదే… ఎవరికివారే దీటైన నేతలు

సహనం వందే, న్యూఢిల్లీ:

కాంగ్రెస్ పార్టీ చరిత్రను పరిశీలిస్తే ఆ పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు కలిసి పార్టీకి నాయకత్వం వహించారు. అయితే కాంగ్రెస్‌కు ఏకకాలంలో ముగ్గురు గాంధీలు నాయకత్వం వహించిన దాఖలాలు లేవు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ పార్లమెంటును రఫ్ ఆడిస్తున్నారు. సోనియా గాంధీ పార్టీకి పెద్దదిక్కుగా ఉండగా… రాహుల్ గాంధీ తన రాజకీయ అనుభవంతో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. వాయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియాంక తన సొంత క్రేజ్‌తో రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో దూకారు. ఈ గాంధీ వారసులు కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త గ్లామర్‌ను తీసుకువస్తున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రియాంక వాగ్ధాటి… మెస్మరైజింగ్ టచ్
కాంగ్రెస్
పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అధికార ఎన్డీయేను నిలదీసే బాధ్యతలో రాహుల్ గాంధీ ముందున్నారు. అయితే రాహుల్ గాంధీకి దీటుగా ప్రియాంకా గాంధీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. వర్షాకాల సమావేశాలలో సైతం ఆమె అధికార పక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈసారి వందేమాతరం గీతంపై జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచి విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ప్రియాంక స్పీచ్‌లో విస్తృతమైన అంశాలు, సూటిదనం కనిపిస్తాయి. అంతేకాకుండా అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చినా ఆమె చిరునవ్వుతో స్వీకరించి తన ప్రసంగాన్ని కొనసాగించే తీరు… ఒక మెస్మరైజ్ చేసే రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుగుతున్న తీరును స్పష్టం చేస్తోంది.

రాహుల్ క్రేజ్… ప్రియాంక లాజిక్
రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన యువనేతగా ఆకర్షిస్తున్నారు. ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ఒక ఎజెండాగా ముందుకు తీసుకొచ్చారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ… అక్కడి దొంగ ఓట్ల వ్యవహారాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఎన్డీఏ గెలిచినప్పటికీ ఎక్కడో ఏదో మతలబు ఉందన్న అనుమానాలు దేశ ప్రజల్లో ఉన్నాయి. ఈ విషయంలో రాహుల్ గాంధీ నిర్వహించిన పోరాటమే కారణం. ఎన్నికల పోరాటంలో ఒక్కోసారి అనే అంశాలు ఓటమికి దారితీస్తుంటాయి. అంతమాత్రాన పార్టీకి నాయకత్వం వహించిన నేతను తక్కువ అంచనా వేయకూడదు. బీహార్ విషయంలో రాహుల్ గాంధీని ఆ రకంగానే చూడాలి. ఇక ప్రియాంక విషయానికి వస్తే… ఆమె ప్రసంగాలలో వాస్తవాలు, లాజిక్ పాయింట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఆమె పదునైన విమర్శలు అధికార పక్షాన్ని బాగా ఇరుకున పెడుతున్నాయి. ఇటీవల బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో సైతం ప్రియాంక బాగా మాట్లాడారు. ఎవరికి వారు అన్నాచెల్లెళ్లు దీటుగా తమ సత్తా చాటుకుంటున్నారు.

ఇద్దరిపైనే ఆశలు…
కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ప్రియాంకా గాంధీయే కనిపిస్తున్నారని చాలా మంది నేతలు బలంగా నమ్ముతున్నారు. ఆమె దూకుడు, పదునైన వాగ్ధాటి కాంగ్రెస్‌కు కొత్త శక్తినిస్తుందని అంటున్నారు. అయితే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఇప్పటికీ రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ సోనియా పెద్దదిక్కుగా ఉంటూ రాహుల్, ప్రియాంక గాంధీ లు ఇద్దరూ పార్టీలో కీలకంగా ఉంటేనే బాగుంటుంది. నెహ్రూ గాంధీలు ఎలాగైతే సమన్వయంతో పనిచేశారో అలా చేయడమే కరెక్ట్ అని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *