- శాలువాలు పూర్తిగా నకిలీవని నిర్ధారణ
- పట్టు పేరుతో పాలిస్టర్ కొన్న అక్రమార్కులు
- భక్తుల మనోభావాలతో 55 కోట్లు తినేశారు
- గతంలో లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు
సహనం వందే, తిరుపతి:
తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కుంభకోణాల సుడిగుండంలో చిక్కుకుంది. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, పరకామణిలో చోరీ వంటి వివాదాల తర్వాత తాజాగా టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా రూ. 55 కోట్ల విలువైన పట్టు దుపట్టా కొనుగోలు కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీవారి సేవలో, ఆలయ ఉత్సవాలలో, దాతలకు వేదాశీర్వచనం సమయంలో ఉపయోగించే పవిత్రమైన పట్టు వస్త్రాల విషయంలో ఈ మోసం జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. పవిత్రతకు భంగం కలిగించే ఈ చర్యను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
పట్టు పేరుతో పాలిస్టర్ దగా!
గత పదేళ్లలో టీటీడీకి సరఫరా అయిన పట్టు శాలువాలు పూర్తిగా నకిలీవని అంతర్గత విజిలెన్స్ విచారణలో తేలింది. ఆలయ నిబంధనల ప్రకారం ఈ దుపట్టాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేసి సిల్క్ మార్క్ హలోగ్రామ్ కలిగి ఉండాలి. కానీ సరఫరాదారులు ఏకంగా పట్టు పేరుతో చౌకైన పాలిస్టర్ దుపట్టాలను సరఫరా చేసి భారీ నష్టం కలిగించారు. కేవలం రూ. 350 విలువైన శాలువాకు రూ. 1,300 బిల్లు వేసి గత దశాబ్దకాలంలో రూ. 55 కోట్లు దోచుకున్న వైనం బయటపడింది. భగవంతుడి సేవలో కూడా ఇంతటి మోసం చేయడం దారుణం.
ల్యాబ్ టెస్టుల్లో బట్టబయలు
టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు గోదాంల నుంచి సేకరించిన నమూనాలను కేంద్ర పట్టు బోర్డుతో సహా ఇతర ల్యాబ్‌లలో పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఆ వస్త్రాలు పూర్తిగా పాలిస్టర్‌తో తయారు చేసినవని… సిల్క్ మార్క్ లేదని నిర్ధారణ అయ్యింది. ఓం నమో వెంకటేశాయ అని ముద్రించిన పవిత్ర వస్త్రాలను కూడా స్వచ్ఛత లేకుండా సరఫరా చేసి భక్తులను, ఆలయాన్ని మోసం చేశారు. ఈ కుంభకోణానికి ఒకే ఒక కాంట్రాక్టర్ కారణమని తేలడంతో… ఆ సంస్థతో ఉన్న అన్ని టెండర్లను రద్దు చేసి దర్యాప్తును ఏసీబీకి అప్పగించారు.
టీటీడీ ప్రతిష్ట మసకబారుతోంది…
పాలిస్టర్‌ను ఉపయోగించి మోసం చేయడం వలన టీటీడీకి ఆర్థిక నష్టమే కాదు… ఆలయ నిబంధనలు, అత్యంత ముఖ్యంగా శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగింది. భక్తులు, దాతలు, వీఐపీల కోసం నిర్వహించే వేడుకల్లో వినియోగించే ఈ దుపట్టాల ప్రామాణికతపై వచ్చిన ఈ ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వరుస కొనుగోలు వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో పాలకమండలి ఇకనైనా కళ్లు తెరిచి తమ కొనుగోలు ప్రక్రియల్లో పూర్తి పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.