- ఫోన్లో ఎప్పుడూ ఆన్‌లో ఉండేలా ట్రాకింగ్
- సంచార్ సాథీ తర్వాత మరో కొత్త వివాదం
- నిఘా నీడలోకి జడ్జీలు, జర్నలిస్టులు, నేతలు..
- ప్రతి ఒక్కరి కదలికపై ఖచ్చితమైన డేగ కన్ను
- ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే అవకాశం
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న నిఘా సైబర్ సేఫ్టీ పేరుతో సంచార్ సాథీ యాప్ ను స్మార్ట్‌ఫోన్లలో ముందే ప్రీలోడ్ చేయాలని ఆదేశించింది. నిఘా, వ్యక్తిగత సమాచార చౌర్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన రావడంతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం మర్చిపోక ముందే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేయకుండా చూసేలా మరో కుట్ర జరుగుతుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ సంచలనమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్…
సంచార్ సాథీ యాప్ వివాదం ముగిసిపోక ముందే ఇప్పుడు కొత్త టెలికం నిఘా వ్యవస్థకు రంగం సిద్ధం చేస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రజల గోప్యతకు గండికొట్టేలా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని, దాన్ని కట్టేసే అవకాశం కూడా వినియోగదారుడికి ఇవ్వకుండా చేయాలని టెలికాం పరిశ్రమ ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

దీనికి యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి దిగ్గజ మొబైల్ కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిరంతరం ఏ-జీపీఎస్ సాంకేతికతను వాడాలని బలవంతం చేయడం అంటే ఫోన్‌ను కేవలం నిఘా పరికరంగా మార్చడమేనని నిపుణులు, కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
ట్రాకింగ్ తో బుకింగే…
ప్రస్తుతం సీబీఐ, ఈడీ సహా దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు టెలికాం కంపెనీలు కేవలం సెల్‌టవర్ల ఆధారంగా స్థూలమైన లొకేషన్‌నే ఇవ్వగలుగుతున్నాయి. ఇది కొన్ని మీటర్ల మేర తేడా వచ్చే అవకాశం ఉంది. అందుకే రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఓఏఐ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఏ-జీపీఎస్‌ను తప్పనిసరిగా యాక్టివేట్ చేయాలని… దాన్ని వినియోగదారుడు డిసేబుల్ చేసే అవకాశం లేకుండా చూడాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీని వల్ల కేవలం ఒక మీటరు లోపు ఖచ్చితత్వంతో ఒక వ్యక్తిని ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు.
జడ్జీలు… జర్నలిస్టులు… లీడర్లపై నిఘా
యాపిల్, గూగుల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐసీఈఏ అనే లాబీయింగ్ గ్రూప్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నియంత్రణ అతిక్రమణ లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సైనికులు, న్యాయమూర్తులు, కార్పొరేట్ అధికారులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల నాయకులు ఇలా కీలక వ్యక్తుల గోప్యమైన సమాచారం భద్రతకు ఈ నిరంతర ట్రాకింగ్ ప్రమాదకరమని ఆ సంస్థ స్పష్టం చేసింది. అంతేకాదు ట్రాకింగ్ జరుగుతున్నప్పుడు వినియోగదారుడికి పాప్-అప్ మెసేజ్ వస్తే నిఘాలో ఉన్న వ్యక్తి సులభంగా పసిగట్టేస్తాడని… అందువల్ల ఆ పాప్-అప్‌ను కూడా నిలిపివేయాలని టెలికాం సంస్థలు కోరడం గమనార్హం. అయితే గోప్యత, పారదర్శకత కోసం ఆ పాప్-అప్ తప్పనిసరని మొబైల్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఎలాగైనా పౌరుల రహస్యాలపై కేంద్రం దృష్టి సారించిందనే అనుమానాన్ని ఈ విషయం నిదర్శనం. ఈ అంశంపై దేశవ్యాప్తంగా గోప్యతా చట్టాల రక్షణ కోసం మరో యుద్ధం తప్పేలా లేదు.