- అనేక శాఖల్లో నెలలుగా జీతాలు పెండింగ్
- ఏజెన్సీల దోపిడీ… కమీషన్ల దందా
- ఆత్మహత్య అంచున కుటుంబాలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నా వీరికి జీతాలు మాత్రం సకాలంలో అందడం లేదు. నెలలు గడుస్తున్నా వేతనం రాక ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించలేక అప్పుల బాధతో అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదనేందుకు, పాలనా యంత్రాంగం సరిగా పనిచేయడం లేదనేందుకు ఈ జీతాల జాప్యమే నిదర్శనం. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఏడాది దాటిన బకాయిలు…
కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు రాకపోవడం అత్యంత దారుణం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం భూ భారతిలో పనిచేసే సిబ్బందికి ఏకంగా 16 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. మరో కీలక పథకమైన మిషన్ భగీరథలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి కూడా వేతనం ఇవ్వలేదు. రెవెన్యూ శాఖలోని ఎన్నికల ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు లేవు. ఇక సాగునీటి శాఖలో మూడు నెలలు, బీసీ సంక్షేమ శాఖలో ఏడు నెలలు, భూ సేకరణ శాఖలో తొమ్మిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడం గమనార్హం. మూడు నుంచి ఐదు నెలల ఆలస్యం అనేది చాలా శాఖల్లో సాధారణమైపోయింది. ఈ నిర్లక్ష్యంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
ఏజెన్సీల కమీషన్ల దందా…
పనిచేసి జీతం అడగడం కూడా ఈ ఉద్యోగులకు పోరాటంగా మారింది. నాలుగు నెలల జీతాలు రాక తాత్కాలిక సిబ్బంది సేవలను నిలిపివేసి నిరసనకు దిగారు. మూడు నెలల వేతనం కావాలంటూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు డైరెక్టరేట్‌ను ముట్టడించారు. వీరికి వచ్చే నామమాత్రపు జీతంలోనూ ఏజెన్సీలు నెలకు రూ. 5 వేల వరకు కమీషన్ రూపంలో దోచుకుంటున్నాయి. ఏజెన్సీలను తొలగించి తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, కోశాధికారి మునిగంటి జగదీష్ ప్రశ్నిస్తున్నారు.
ఆత్మహత్యల అంచున కుటుంబాలు
జీతాలు అందక అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని లక్ష్మయ్య, జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలను తొలగిస్తే తమకు జీతం పెరుగుతుందని సిబ్బంది అంటున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించింది. కానీ ఇక్కడ మాత్రం విధానపరమైన నిర్ణయం అంటూ కాలయాపన జరుగుతోంది. ఇకనైనా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యపై తక్షణమే దృష్టి సారించి లక్షలాది మంది ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.