- బాలకృష్ణ అవమానించినప్పటికీ మౌనం!
- నోరు మెదపని నాగబాబు, పవన్ కళ్యాణ్
- సినీ రంగం నుంచి కూడా స్పందన కరువు
- మహేష్, ప్రభాస్ వంటి వారు ఏమైపోయారు?
- నారాయణమూర్తి తప్ప ఎవరు స్పందించలే…
- లోలోన మధనపడుతున్న మెగాస్టార్ చిరంజీవి
- అభిమానుల ఆగ్రహం… మెగా తమ్ముళ్లపై ఫైర్
- చలి జ్వరం అంటూ ఇంట్లో కూర్చున్న పవన్
- మంత్రి పదవి ఆశల పల్లకిలో నాగబాబు
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచే సరైన స్పందన కరువైంది. ముఖ్యంగా సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడంపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లు కూడా సైలెంట్‌గా ఉండటంతో… అందరివాడుగా పేరున్న చిరంజీవి ఇప్పుడు ఎవరూ లేనివాడుగా మిగిలిపోయాడనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన నాగబాబు సైతం ఈసారి మౌనం వహించడం గమనార్హం.
మెగా ఫ్యామిలీ మౌనం వెనుక?
బాలకృష్ణ మెగా ఫ్యామిలీని విమర్శించడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ‘మా బ్లడ్ వేరు… బ్రీడ్ వేరు’ అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించేలా మాట్లాడారు. అప్పట్లో నాగబాబు గట్టిగా ప్రతిఘటించినప్పటికీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు కూటమిలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసమే మెగా కుటుంబం బాలకృష్ణ అవమానాలను మౌనంగా భరిస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అవమానాలకు అలవాటు పడ్డ మెగా ఫ్యామిలీ అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలు కలిసి పనిచేయడం, కూటమి అధికారంలోకి రావడంతోనే ఈ మౌనం పాటిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ అయితే చలి జ్వరం అంటూ ఇంట్లో పడుకున్నారని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సినీ రంగంలో ప్రముఖులు ఏమైపోయారు?
చిరంజీవిపై వచ్చిన విమర్శలపై సినీ రంగం నుంచి కూడా పెద్దగా స్పందన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అగ్రతారలు మహేష్ బాబు, ప్రభాస్ వంటివారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారని, ఎందుకు స్పందించలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. పరిశ్రమ పెద్దగా, ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న చిరంజీవి విషయంలో ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందించకపోవడం గమనార్హం. కేవలం నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి మాత్రమే ధైర్యంగా స్పందించి చిరంజీవికి అండగా నిలబడ్డారు. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసిన సందర్భంలో… పరిశ్రమ పెద్దగా చిరంజీవి వల్లే సమస్య పరిష్కారం అయిందని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, అదంతా తప్పుడు ప్రచారమని ఆయన ధీమాగా చెప్పడం మెగాస్టార్‌కు దక్కిన ఏకైక అండగా కనిపిస్తోంది.
లోలోన మధనపడుతున్న మెగాస్టార్…
అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన విమర్శలు కేవలం వ్యక్తిగతం కాదని, దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇద్దరు అగ్రతారల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం రాజకీయాల్లోనూ ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలోని అత్యంత సన్నిహితులు సైతం తన పట్ల మౌనం వహించడం, సొంత తమ్ముళ్లు కూడా స్పందించకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి లోలోన మధనపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు బుసలు కొట్టే నాగబాబు మౌనం వెనుక మంత్రి పదవి ఆశ ఉందని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరార్థం నాగబాబు సైలెంట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.