పటిష్ట వ్యూహంతో పదేళ్లు పాగా – మరో రెండు మార్లు సీఎం కుర్చీలో కర్చీఫ్

  • ‘పదేళ్లు అవకాశం ఇవ్వండ’ని రేవంత్ వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ముక్కలు… బీజేపీ లెక్కలో లేదు
  • దీంతో పదేళ్లు అధికారంలో ఉంటానని ధీమా
  • అగ్గి మీద గుగ్గిలం అవుతున్న సీనియర్లు

సహనం వందే, హైదరాబాద్:
‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. హైదరాబాదును న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు ఆ సిటీలకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ… రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. తనకు మరో పదేళ్లు సీఎంగా ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అభివృద్ధి ప్రకటనల వెనుక తన రాజకీయ భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది. రాబోయే రెండు సార్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే సంకేతాలను రేవంత్ రెడ్డి బలంగా ప్రజల్లోకి పంపుతున్నారు.

గతంలోనూ ఇలాంటి కామెంట్స్…
ముఖ్యమంత్రి పదేళ్ల గురించి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో మరోసారి పెద్ద దుమారం రేపింది. గతంలో ‘పదేళ్లు సీఎం నేనే’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎంపిక అధిష్టానం నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. తాజాగా మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు రావడంతో సీనియర్లు లోలోన ఆగ్రహానికి లోనవుతున్నారు. ముఖ్యమంత్రి ఉత్సాహం నింపేందుకు అలా మాట్లాడారని గతంలో మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారు సర్ది చెప్పినప్పటికీ ఆ వివాదం సద్దుమణగ లేదు. ఇప్పుడు మళ్లీ అదే కామెంట్స్ చేయడం గమనార్హం.

బలహీనంగా ప్రతిపక్షాలు… అందుకే ఇలా!
ఒకవైపు సొంత పార్టీలో సవాళ్లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి రాజకీయంగా అత్యంత అనుకూలమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. గతంలో గట్టి పునాదులు ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం కుటుంబ కలహాలతో ముక్క చెక్కలయ్యే స్థితికి చేరుకుంది. కేసీఆర్ కూతురు కవిత పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకునే యోచనలో ఉండటం, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని బహిరంగంగా ఆరోపించడం బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బ. కేటీఆర్, హరీష్ రావు మధ్య అధికార పోరు మొదలైందనే వార్తలు, కార్యకర్తల్లో గందరగోళం బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నాయి. అలాగే తెలంగాణలో బీజేపీ కూడా తక్షణమే బలపడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ రేవంత్ రెడ్డికి శాశ్వత పటిష్ట పునాదులు వేసుకోవడానికి గొప్ప అవకాశంగా మారాయి.

జాతీయ స్థాయిలో పార్టీకి ఊపు…
తన పదేళ్ల ప్రణాళిక కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని… దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుందనే నమ్మకాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారని… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడితే తెలంగాణలో తన స్థానం మరింత సుస్థిరమవుతుందని రేవంత్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రజల్లో ఆకర్షణ సృష్టించడం, అదే సమయంలో ప్రతిపక్షంలోని అంతర్గత ఘర్షణలను అవకాశంగా మలుచుకోవడం రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *