- ఎలాగైనా ఎన్డీఏలోకి లాగడమే ఎజెండా…
- సీబీఐ దర్యాప్తు కోరడంతోనే కమలానికి బలం
- గజిబిజి గందరగోళంలో విజయ్ వ్యూహాలు
- తొక్కిసలాట జరగగానే పారిపోయి వచ్చాడు
- దీంతో కార్యకర్తల్లో నాయకుడుపై అపనమ్మకం
సహనం వందే, చెన్నై:
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపునకు కరూర్ తొక్కిసలాట ఘటన వేదికైంది. ఈ సంఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకునేందుకు సినీ నటుడు, యువ రాజకీయ నేత విజయ్ ఆరోపణల పర్వం మొదలుపెట్టారు. తమ సభలో అలజడి సృష్టించి తమను ఇరికించేందుకు డీఎంకే ప్రభుత్వమే కుట్ర చేస్తోందని ఆయన నేరుగా ఆరోపించారు. అయితే ఇదంతా రొటీన్ రాజకీయం అయినప్పటికీ… ఈ కేసు విచారణ ఇప్పుడు విజయ్‌కు అసలు పరీక్షగా మారింది. డీఎంకే ప్రభుత్వం విచారణ జరిపితే తమకు అన్యాయం జరుగుతుందని నిర్ణయానికి వచ్చిన విజయ్ ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు లేదా సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌తోనే అసలైన రాజకీయ ఉచ్చు ప్రారంభమైంది.
బీజేపీ పాచిక… అన్నామలై మద్దతు రహస్యం!
కరూర్ ఘటనపై బీజేపీ పాచిక విసరడం మొదలుపెట్టింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, డైనమిక్ నేత అన్నామలై… విజయ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని… నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్‌కు నిజంగా ఊరటనిస్తుందా లేక మరింత సమస్యల్లోకి నెడుతుందా అన్నది పక్కనపెడితే… ఇది విజయ్‌పై బీజేపీ వేసిన ట్రాప్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. స్వయంగా విజయ్ పార్టీయే సీబీఐ దర్యాప్తు కావాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో బీజేపీ మద్దతును ఆయన ఇప్పుడు కాదనలేని పరిస్థితి.
ఎన్డీఏలోకి లాగడమే అసలు ఎజెండా…
బీజేపీ ప్రధాన లక్ష్యం ఒక్కటే. విజయ్‌ను తమ ఎన్డీఏ కూటమిలోకి లాగడం. తాను ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని, సిద్ధాంతపరంగా బీజేపీ తమకు శత్రువని విజయ్ పదేపదే చెబుతున్నా బీజేపీ తన ప్రయత్నాలను ఆపడం లేదు. అన్నాడీఎంకేతో పాటు విజయ్‌ను కూడా తమ కూటమిలో చేర్చుకోగలిగితే రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు చెక్ పెట్టవచ్చని బీజేపీ వ్యూహం. ఈ ప్రయత్నాలకు కరూర్ ఘటనే సరైన వేదికగా దొరికిందని బీజేపీ భావిస్తోంది. అందుకే సరైన సమయంలో వ్యూహాత్మకంగా మద్దతు అనే ఉచ్చు వేసింది.
సంక్షోభంలో అసలు పరీక్ష…
విజయ్‌కు ఇప్పుడు అత్యంత కీలకమైన రాజకీయ పరీక్ష ఎదురైంది. సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఆయనకు ఇంకా సరైన అవగాహన లేదని కరూర్ ఘటన జరిగిన వెంటనే ఆయన వెళ్లిపోయిన తీరుతో స్పష్టమైంది. ఇప్పుడు ఆయన ఎదుట ఒకవైపు డీఎంకే, మరోవైపు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. ఏ వైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరం అయ్యే ప్రమాదం ఉంది. ఈ రాజకీయ చదరంగాన్ని ఆయన సమర్థవంతంగా ఎదుర్కొంటేనే తమిళనాడులో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడటానికి ధైర్యం వస్తుంది.
డీఎంకేతో పాటు బీజేపీ ఆడే ఆట…
బాధితులను ఆదుకోవడంలో ఆలస్యం చేయడంతోనే విజయ్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం విచారణ కమిటీ నియమించగానే దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులు లాఠీచార్జి చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని… తమ సభలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే అది కక్ష సాధింపు అవుతుందని ప్రచారం చేసుకునే అవకాశం విజయ్‌కు ఉండేది. కానీ సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు కోరడం ద్వారా ఆయన ఆ కేసును బీజేపీ చేతుల్లోకి నెట్టారు. సీబీఐ చెప్పే విషయాలు విజయ్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంటే రాజకీయంగా భారీ నష్టం తప్పదు. బాధితులను ఆదుకోవడంలో ఆలస్యం, రాజకీయంగా వ్యూహాత్మక ఆలోచన లేకపోవడంతో డీఎంకే ఒకపక్క, బీజేపీ మరోపక్క విజయ్‌తో ఓ ఆట ఆడుకునే అవకాశం కనిపిస్తోంది.