- జీవో 59 పెండింగ్ దరఖాస్తులపై నిర్ణయం
- 500 గజాలలోపు భూములకు హక్కులు
- కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలోని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్త అందించింది. సొంత స్థలం ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ కాక, తమ ఆస్తి ఏ క్షణంలో 22ఏ జాబితాలోకి వెళ్తుందోనని ఆందోళన చెందుతున్న పౌరులకు ఇది గొప్ప ఉపశమనం. జీఓ నెంబర్ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురుచూస్తున్న 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థలాల పెండింగ్ దరఖాస్తులను కేవలం నెల రోజుల్లోగా పరిష్కరించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేస్తూ స్థానిక కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
పారదర్శకంగా పరిశీలన, తనిఖీలు
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అత్యంత వేగంగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి భూ చిక్కుముడులను విప్పేందుకు వేగవంతమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జీవో 59 కింద వచ్చే ఆస్తుల విషయంలో భూమి అసలు రికార్డులు, లబ్ధిదారుల అర్హత, క్రమబద్ధీకరించాల్సిన అసలు విస్తీర్ణాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గతంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, గతంలో పూర్తయిన కేసుల కన్వేయన్స్ డీడ్లను కూడా సమగ్రంగా తనిఖీ చేస్తారు. అయితే న్యాయస్థానాల పరిధిలో ఉన్న వివాదాస్పద దరఖాస్తుల విషయంలో మాత్రం సంబంధిత తీర్పులకు లోబడి మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది.
22ఏ భూముల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్
22ఏ జాబితాలోని భూ చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం ఒక ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని రూపొందించింది. అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ మేరకు మంత్రుల బృందం నిరంతరం చర్చలు జరిపి 10 నుంచి 12 రకాల వెదర్ సమస్యలను గుర్తించి పరిష్కారాలు చూపుతోంది. ఏళ్ల తరబడి పౌరులను వేధిస్తున్న భూ చిక్కులను రద్దు చేస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో రియల్ ఎస్టేట్ రంగానికే కాక సామాన్య గృహ యజమానులకు పెద్ద ఊరట లభిస్తోంది.
అనుమతులున్న ప్లాట్లకు క్లియరెన్స్
గతంలో 22ఏ జాబితాలో ఉండటం వల్ల అనేక నిర్మాణాలు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లకు అనుమతులు మంజూరు చేశారు. దీనివల్ల వేలాదిమంది ప్లాట్ల యజమానులకు తమ ఆస్తులపై పూర్తి రిజిస్ట్రేషన్ హక్కులు లభిస్తున్నాయి. ఇదివరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రజలకు సులభమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఊరట కల్పించారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్, నాలా సమస్యలకు చెక్
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో పాటు నాలా ప్రక్రియ పూర్తికాని పట్టాభూముల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని దిశగా నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్చే ప్రక్రియలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించడంతో తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో మళ్లీ చలనం వచ్చింది. భూ వివాదాల సుడిగుండంలో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఇది సంతోషకరమైన నిర్ణయం.