బూతు గేమ్.. యూత్ టెంప్టేషన్ – గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 వీడియో గేమ్ రచ్చ

GTA 6 Game
  • హింసను ప్రేరేపించే మాయా ప్రపంచం
  • 17 ఏళ్లు పైబడిన వారికే అనుమతి
  • ఆసక్తి రేపుతున్న ఆట.. తల్లిదండ్రుల ఆందోళన

సహనం వందే, హైదరాబాద్:

వీడియో గేమ్స్ ప్రపంచంలో ఇప్పుడు గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 గురించే చర్చ నడుస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఈ సిరీస్‌లో కొత్త గేమ్ రావడంతో యువతతో పాటు పిల్లలు, టీనేజర్లలోనూ ఆసక్తి కనిపిస్తోంది. స్నేహితుల మధ్య మాటలు, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు, లైవ్ ప్రసారాలు పెరగడంతో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇందులోని హింస, పెద్దలకు మాత్రమే అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆటలో అభ్యంతరకర అంశాలు…
ఈ గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 గేమ్‌లో నేరాలు, కాల్పులు, దాడులు, రక్తపాతం వంటి హింసాత్మక దృశ్యాలతో పాటు నగ్నత్వం, లైంగిక అంశాలు, బూతు మాటలు, మాదకద్రవ్యాలు, మద్యం వినియోగం కనిపిస్తాయి. ఈ కారణాల వల్లే అమెరికాలోని ఒక వయోపరిమితి సంస్థ ఈ గేమ్‌ను 17 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే తగినదిగా వర్గీకరించింది. కేవలం వినోదం కోసమేనని భావించి వీటిని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

హింసాత్మక ప్రవర్తనపై ఏం చెబుతున్నారంటే?
ఈ గేమ్ ఆడితే పిల్లలు హింసాత్మకంగా మారుతారా అన్న ప్రశ్నపై జరిగిన పరిశోధనల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు హింసాత్మక గేమ్స్, దూకుడు ప్రవర్తన మధ్య సంబంధం ఉండవచ్చని సూచించగా, మరికొన్ని పిల్లల వ్యక్తిత్వం, కుటుంబ వాతావరణం, స్నేహితుల ప్రభావం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నాయి. 2020లో అమెరికా మానసిక వైద్య సంఘం కూడా హింసాత్మక వీడియో గేమ్స్ వల్ల వాస్తవ జీవితంలో హింసాత్మక ప్రవర్తన పెరుగుతుందని నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. గేమ్ ఆడిన ప్రతి ఒక్కరూ హింసాత్మకంగా మారతారని చెప్పలేం కానీ, ఆ దృశ్యాల ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు.

మానసిక పరిపక్వత… స్నేహితుల ఒత్తిడి కీలకం
టీనేజర్లకు ఈ గేమ్ అనుమతించవచ్చా అన్నదానికి అందరికీ ఒకే సమాధానం ఉండదని బాలల మనస్తత్వ నిపుణురాలు డాక్టర్ షెరిల్ జీగ్లర్ అభిప్రాయపడ్డారు. వయసుతో పాటు కల్పిత ప్రపంచానికి, నిజ జీవితానికి మధ్య తేడా గుర్తించగలరా, తప్పు ఒప్పులపై అవగాహన ఉందా అనే మానసిక పరిపక్వతను చూడాలని ఆమె సూచించారు. యుక్తవయసులో మెదడులోని ఆలోచన, నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు ఇంకా అభివృద్ధి చెందుతుంటాయి. మరోవైపు ఇంట్లో ఆడనివ్వకపోయినా సోషల్ మీడియా వీడియోలు, స్నేహితుల ఇళ్లలో ఆడే అవకాశాలు ఉండటంతో పాటు అందరూ ఆడుతున్నారనే ఒత్తిడి టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది.

పర్యవేక్షణతోనే దీర్ఘకాలిక పరిష్కారం
పిల్లలు గేమ్ అడిగినప్పుడు నేరుగా వద్దని అనకుండా, పెద్దలకు మాత్రమే ఉన్నాయని, నీ వయసుకు ఇది సరైనది కాదని శాంతంగా వివరించాలని డాక్టర్ షెరిల్ జీగ్లర్ సూచించారు. ఒకవేళ అనుమతిస్తే మొదట్లో పక్కనే ఉండి గమనించడం, ఇన్-గేమ్ ఖర్చులపై పరిమితులు పెట్టడం, పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ వాడటం అవసరం. చదువు, నిద్ర తగ్గడం, ఆట ఆపమంటే అతిగా కోపం రావడం, ఇతర ఆసక్తులు తగ్గడం, కుటుంబంతో మాట్లాడకపోవడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే జోక్యం చేసుకోవాలి. నిషేధం తాత్కాలికంగా పనిచేయవచ్చు కానీ, తల్లిదండ్రులపై ఉండే నమ్మకం, మంచి చెడులను విచక్షణతో అర్థం చేసుకునే శక్తి పిల్లలకు అండగా నిలుస్తాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *