25 దేశాల్లో విద్యార్థుల తిరుగుబాటు – భగ్గుమన్న యూరప్… రగిలిన యూత్

Student Protests Across 25 Countries
  • రోడ్డెక్కిన లక్షలాది మంది విద్యార్థులు
  • చదువుకు డబ్బుల్లేవ్.. యుద్ధాలకెక్కడివి?
  • యుద్ధ ఖర్చులపై యువత ఆగ్రహజ్వాల
  • బ్రిటన్‌లో 350 విద్యాసంస్థల భాగస్వామ్యం

సహనం వందే, యూరప్:

చేతిలో పుస్తకాలు పట్టుకుని తరగతి గదుల్లో ఉండాల్సిన యువత.. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వస్తోంది. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో.. ఆ భవిష్యత్తుకే భరోసా లేకుండా పోవడంతో ప్రభుత్వాలను నిలదీస్తోంది. చదువుకు డబ్బుల్లేవంటారు.. కానీ యుద్ధాలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తారెందుకని ప్రశ్నిస్తోంది. ఒకటి రెండు దేశాలు కాదు.. ఏకంగా 25కి పైగా యూరప్‌ దేశాల్లో యువత గొంతు ఒక్కటవుతోంది. ఇంతకీ ఈ ఉద్యమం వెనుక ఉన్న కారణాలేంటి?

25 దేశాల్లో యువత కదలిక!
శుక్రవారం జరిగిన అంతర్జాతీయ యువజన నిరసన కార్యక్రమంలో 25కి పైగా దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, ఐర్లాండ్‌, గ్రీస్‌, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాల్లో తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. లక్షలాది మంది పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు. ఈసారి విద్యార్థుల పోరాటం కేవలం ఫీజులకే పరిమితం కాలేదు. జీవన వ్యయం, నిరుద్యోగం, యుద్ధాలు, పర్యావరణం వంటి అంశాలూ ఉద్యమంలో భాగమయ్యాయి.

చదువుకు భారమైన ఖర్చులు!
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉన్నత విద్య కోసం భారీగా ఫీజులు చెల్లించాలి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరుకుతుందన్న భరోసా లేదు. ఉద్యోగం వచ్చినా పెరిగిన ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు విద్యాసంస్థలకు నిధులు తగ్గించడం, ఫీజుల భారం పెరగడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. విద్య కొందరికే అందుబాటులో ఉండే వ్యాపారం కాకుండా ప్రతి ఒక్కరికీ అందే హక్కుగా ఉండాలని యువత కోరుతోంది.

యుద్ధాలకు నిధులు.. విద్యకు కోతలా?
ఈ నిరసనల్లో అత్యంత బలంగా వినిపిస్తున్న అంశం యుద్ధ వ్యయం. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు నిధులు తగ్గిస్తున్న ప్రభుత్వాలు ఆయుధాల కొనుగోళ్లకు మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.‌ గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం విషయంలో యూరప్‌ ప్రభుత్వాల వైఖరినీ కొందరు నిరసిస్తున్నారు. యుద్ధాలకు బదులుగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటలీ, జర్మనీల్లో నిరసనలు!
ఇటలీలోని రోమ్‌, జెనోవా, బొలోగ్నా, మిలాన్‌ నగరాల్లో వేలాది మంది విద్యార్థులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. యుద్ధాలకు కాదు.. పాఠశాలలకు డబ్బులు కేటాయించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. జర్మనీలోని కొలోన్‌లో దాదాపు పదివేల మంది పాల్గొన్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌లోనూ నిరసనలు జరిగాయి. విద్య, వైద్యం, సామాజిక సేవలకు నిధులు పెంచాలని యువత డిమాండ్ చేస్తోంది. సైనిక నియామకాలు, తప్పనిసరి సైనిక సేవలపైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బ్రిటన్‌లో 350 విద్యాసంస్థలు!
బ్రిటన్‌లో 350కి పైగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. సోషలిస్ట్‌ స్టూడెంట్స్‌ సహా పలు సంఘాలు ఉద్యమానికి మద్దతిస్తున్నాయి. మరోవైపు ఏఐ విస్తరణతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్న భయం యువతను వెంటాడుతోంది. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్యతోపాటు సురక్షితమైన భవిష్యత్తు కావాలని కోరుతున్నారు.

ప్రభుత్వాలకు యువత హెచ్చరిక!
మొత్తంగా యూరప్‌లోని యువత చెబుతున్న సందేశం ఒక్కటే. అభివృద్ధి అంటే ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు.. భావితరాలకు విద్య, ఉపాధి, భద్రమైన జీవితం కల్పించడం కూడా. తమ భవిష్యత్తు కోసం యువతే రోడ్లపైకి రావాల్సి వస్తోందంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం వచ్చినట్టే. ఈ నిరసనలు పాలకుల విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *