- ఈ ఏడాది ఆయన దానధర్మాలు రూ. 2,593 కోట్లు
- ఎడెల్గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా వెల్లడి
- మొత్తం రూ. 11,554 కోట్లు దానం చేసిన కుబేరులు
- అదానీ రూ. 877 కోట్లు… అంబానీ రూ. 620 కోట్లు
- విరాళాల్లో విద్య, వైద్య రంగాలకే పెద్దపీట
సహనం వందే, హైదరాబాద్:
డబ్బు సంపాదించాలంటే తెలివి, కష్టం ఉండాలి. కానీ సంపాదించిన డబ్బులో కొంత ఇతరుల కోసం ఖర్చు చేయాలంటే పెద్ద మనసు ఉండాలి. ఇప్పుడు దేశంలోని కొందరు కుబేరులు ఇదే విషయాన్ని చాటుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడాదిలో ఏకంగా రూ. 11,554 కోట్లను సమాజ సేవ కోసం ఇచ్చారు. దేశంలోని సంపన్నులు ఇప్పుడు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి విరాళంగా అందించారు. ఈ జాబితాలో మొత్తం 219 మందికి చోటు దక్కగా, గత ఏడాదితో పోలిస్తే 45 మంది కొత్తగా చేరారు. మొత్తం విరాళాల్లో 68 శాతం వాటా రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళాలిచ్చిన వారు 19 మంది ఉండటం విశేషం.

రోజుకు రూ. 7 కోట్లు ఇస్తున్న శివ్ నాడార్…
ఎడెల్గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2026 ప్రకారం… హెచ్సీఎల్ సంస్థ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుటుంబం వరుసగా ఐదో ఏడాది కూడా దేశంలోనే అగ్రగామి దాతగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే విరాళాలు నాలుగు శాతం తగ్గినప్పటికీ, ఈ కుటుంబం ఏడాదిలో రూ.2,593 కోట్లు అందించింది. అంటే రోజుకు సుమారు రూ. 7 కోట్లు ఇచ్చారు. మరోవైపు, గత ఏడాది రూ. 386 కోట్లు ఇచ్చిన అదానీ కుటుంబం ఈసారి విరాళాలను 127 శాతం పెంచుకుని రూ. 877 కోట్లతో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరింది. అయినప్పటికీ, శివ్ నాడార్ విరాళాలు అదానీ కుటుంబం కంటే రూ. 1,716 కోట్లు ఎక్కువగా ఉన్నాయి.
అంబానీని దాటిన బజాజ్… టాప్-10 జాబితా ఇదే
మూడో స్థానం కోసం జరిగిన పోటీలో బజాజ్ కుటుంబం 42 శాతం వృద్ధితో రూ. 632 కోట్లు విరాళమిచ్చింది. రూ. 620 కోట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ కుటుంబాన్ని కేవలం రూ. 12 కోట్ల స్వల్ప తేడాతో బజాజ్ కుటుంబం వెనక్కి నెట్టింది. ఇక టాప్-10 జాబితాలోని మిగిలిన స్థానాల్లో నందన్ నీలేకణి (రూ.380 కోట్లు), కుమార మంగళం బిర్లా కుటుంబం (రూ.366 కోట్లు), సైరస్ పూనావాలా-అదార్ పూనావాలా (రూ.336 కోట్లు), సుధీర్ మెహతా-సమీర్ మెహతా (రూ.334 కోట్లు), కొత్తగా జాబితాలోకి వచ్చిన రంజన్ పాయ్ కుటుంబం (రూ.219 కోట్లు), రోహిణి నీలేకణి (రూ.215 కోట్లు) వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఈ పది మంది అగ్ర దాతలే రూ. 6,572 కోట్లు సమాజానికి అందించారు. అంటే మొత్తం విరాళాల్లో వీరే సగానికి పైగా ఇచ్చారు.
సొంతంగా ఎదిగినవారే ఎక్కువ…
వారసత్వ సంపద ఉన్నవారే కాకుండా సొంత కష్టంతో ఎదిగిన 125 మంది దాతలు మొత్తం విరాళాల్లో 65 శాతం వాటాను అందించారు. మహిళా దాతల సంఖ్య 24 నుంచి 29కి పెరగగా, రోహిణి నీలేకణి తొలి స్థానంలో, కిరణ్ మజుందార్ షా ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. నగరాల వారీగా చూస్తే ముంబై నుంచి అత్యధికంగా 64 మంది దాతలుండగా, న్యూఢిల్లీ నుంచి 41 మంది, బెంగళూరు నుంచి 20 మంది జాబితాలో చోటు సంపాదించారు. అయితే, విరాళాల విషయంలో మాత్రం ఢిల్లీ దాతలు రూ. 3,168 కోట్లు అందించి అగ్రస్థానంలో నిలిచారు.
విద్య, వైద్య రంగాలకే పెద్దపీట…
రంగాల వారీగా చూస్తే మొత్తం 200 మంది దాతలు విద్యారంగానికి అత్యధికంగా రూ.4,188 కోట్లు అందించగా, వైద్యరంగానికి గత ఏడాది కంటే 82 శాతం వృద్ధితో రూ.1,768 కోట్ల సాయం అందింది. చదువుకు దూరమవుతున్న విద్యార్థుల భవిష్యత్తును, వైద్యానికి నోచుకోని పేదల ప్రాణాలను నిలబెట్టేందుకు ఈ నిధులు ఎంతో కీలకం. అయితే వేల కోట్ల విరాళాలు ప్రకటించడంతో పాటు, ఆ సాయం వల్ల ఎంతమంది పేద విద్యార్థులకు చదువు అందింది, ఎంతమంది రోగుల జీవితాల్లో వెలుగు నిండిందన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే సంపదకు నిజమైన విలువ వచ్చేది అది సమాజంలో తీసుకొచ్చే వాస్తవ మార్పుతోనే.