- ఆవు మూత్రం పేరిట కోట్లు కొల్లగొట్టిన వైనం
- పరిశోధన నిధులతో కార్లు.. విదేశీ ప్రయాణాలు
- అధిక ధరలకు యంత్రాల కొనుగోలుతో దోపిడీ
- బయటపడ్డ జబల్‌పూర్ వర్సిటీ కుంభకోణం
- అధికారుల విచారణలో నివ్వెరపోయే నిజాలు
సహనం వందే, జబల్ పూర్:
గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ విలాసాలకు వాడుకున్నారు. పరిశోధనలు పక్కన పెట్టి విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణాలతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తగలేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఆవుల పేరుతో ఆగడాలు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2011లో పంచగవ్య పరిశోధన పథకాన్ని ప్రారంభించింది. ఆవు పేడ, మూత్రం, పాలు ఉపయోగించి క్యాన్సర్ వంటి వ్యాధులకు విరుగుడు కనుగొనడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం ప్రభుత్వం 3.50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు రోగుల ప్రాణాలు కాపాడడానికి బదులు అధికారుల జల్సాలకు ఉపయోగపడ్డాయి. క్యాన్సర్ పరిశోధనలో ఏమాత్రం పురోగతి సాధించకుండానే కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కార్లు… షికార్లు
పరిశోధన నిధులతో అధికారులు తమ వ్యక్తిగత విలాసాలను తీర్చుకున్నారు. ప్రాజెక్టు నిధులతో కొత్త కారును కొనుగోలు చేయడమే కాకుండా దాని మరమ్మతులు, పెట్రోల్, డీజిల్ కోసం ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. విమాన ప్రయాణాల కోసం సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించారు. కానీ ఈ ప్రయాణాలకు పరిశోధనలకు ఎలాంటి సంబంధం లేదని విచారణాధికారులు గుర్తించారు. ప్రజా ధనాన్ని సొంత పనులకు వాడుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.
యంత్రాల కొనుగోలులో దోపిడీ…
పరిశోధనల కోసం అవసరమైన యంత్రాలు, ముడి పదార్థాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగింది. మార్కెట్ ధర కంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాదాపు 1.75 కోట్ల రూపాయలను ఈ యంత్రాల కోసమే వెచ్చించారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువుల పేరుతో మరో 15 లక్షల రూపాయలు పక్కదారి పట్టాయి. ప్రతి కొనుగోలులోనూ కమీషన్ల పర్వం నడిచినట్లు స్పష్టమవుతోంది.
జిల్లా కలెక్టర్ కొరడా
ఈ అవినీతిపై ఫిర్యాదులు రావడంతో జబల్‌పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ జరిపిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. నిధుల దుర్వినియోగం జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ తన నివేదికను కలెక్టర్ కు సమర్పించింది.
రికార్డుల గల్లంతు
ఈ ప్రాజెక్టు 2018లోనే ముగిసినట్లు విశ్వవిద్యాలయ ఉప కులపతి చెబుతున్నారు. అప్పట్లోనే అన్ని రికార్డులను ఆమోదించామని ఆయన వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణతో వర్సిటీ వర్గాల్లో వణుకు మొదలైంది. అధికారులు రికార్డులను వెలికితీసే పనిలో పడ్డారు. పరిశోధనల పేరుతో ఇన్నాళ్లూ సాగించిన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు త్వరలోనే బయటకు రానున్నాయి.