- పాత చింతకాయ పచ్చడి ఆలోచనలకు బ్రేక్
- సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాలకే జెన్ జెడ్ పెద్దపీట
- మారిన కెరీర్ లెక్కలతో తల్లిదండ్రులలో టెన్షన్
- సాదా ఉద్యోగం కంటే ఫ్రీలాన్సింగ్ వైపే మొగ్గు
- దేశ ఆర్థికచిత్రాన్ని మార్చబోతున్న నయా ట్రెండ్
సహనం వందే, హైదరాబాద్:
ఒకప్పుడు చౌదరి గారి అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఐఏఎస్ లేదా డాక్టర్ కాకపోతే కనీసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా సాధించాలన్నది తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి యువత ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను తుడిచిపెట్టేస్తోంది. డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం అంటూ సరికొత్త కెరీర్ బాట పడుతోంది. నచ్చిన పని చేస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలవడమే లక్ష్యంగా జెన్ జెడ్ తరం దూసుకుపోతోంది.

మారిపోతున్న కెరీర్ రూపురేఖలు…
దేశంలో 2025 నాటికి విద్యా రంగంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జేఈఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగే పిల్లలు ఇప్పుడు తమ అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటేనే జీవితం అనుకునే రోజులు పోయాయి. ర్యాండ్ స్టాడ్ ఇండియా నివేదిక ప్రకారం… కేవలం 16 శాతం మంది మాత్రమే పాత పద్ధతిలో ఒకే చోట పూర్తిస్థాయి ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. మిగిలిన వారంతా తమకు నచ్చిన విధంగా పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ లైఫ్ కంటే వినూత్నంగా ఏదైనా చేయాలన్నదే వారి తపన.
నైపుణ్యానికే పట్టాభిషేకం…
డిగ్రీ సర్టిఫికెట్ ఉంటేనే ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఇప్పుడు సడలిపోతోంది. డెలాయిట్ గ్లోబల్ సర్వే ప్రకారం… 94 శాతం మంది భారతీయ యువత హోదాల కంటే పనిలో నైపుణ్యం నేర్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. సుమారు 11 శాతం మంది అయితే ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేసి నేరుగా ఉపాధి మార్గాల్లోకి వెళ్తున్నారు. పాత విద్యా విధానం నేటి మార్కెట్ అవసరాలను తీర్చలేకపోతోందని యువత బాహాటంగానే విమర్శిస్తోంది. దాదాపు 78 శాతం మంది జెన్ జెడ్ యువత కాలేజీల్లో నేర్పే పాఠాలు తమకు పనికిరావని తేల్చి చెబుతున్నారు.
తల్లిదండ్రుల్లో మొదలైన గుబులు
ఈ మార్పులు తల్లిదండ్రులకు మింగుడుపడటం లేదు. తమ పిల్లలు ఇంజనీరింగ్ చేసి సెటిల్ అవుతారని ఆశపడిన వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. పిల్లలు చదువు మధ్యలో ఆపేసి డిజిటల్ మార్కెటింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తామంటే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నాగేశ్వర్ వంటి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై భయపడుతున్నారు. స్థిరమైన ఆదాయం లేని పనులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ నేటి తరం మాత్రం స్వేచ్ఛగా పని చేయడమే అసలైన గెలుపు అని నమ్ముతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి
కేవలం భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. అమెరికాలో జరిగిన ఒక సర్వేలో 60 శాతం మంది యువత 9 నుంచి 5 గంటల ఉద్యోగం లేకుండానే ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలో 43 శాతం మంది జెన్ జెడ్ యువత పూర్తిస్థాయి ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్ పనుల మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల ఆర్థిక భద్రతతో పాటు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఈ ధోరణి వల్ల మున్ముందు సంప్రదాయ ఉద్యోగాలకు ఆదరణ తగ్గే అవకాశం ఉంది.
గణాంకాలు చెబుతున్న వాస్తవాలు
భారతదేశంలో సుమారు 60 కోట్ల మంది జెన్ జెడ్ యువత ఉన్నారు. వీరంతా ఇప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తులుగా మారారు. ఒక సర్వే ప్రకారం… 83 శాతం మంది యువత తమ సొంత ఖర్చులతోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్ బూట్ క్యాంపులు.. హ్యాకథాన్లలో పాల్గొంటూ తమ తెలివితేటలను మెరుగుపరుచుకుంటున్నారు. కేవలం పుస్తకాల్లోని లెక్కల కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పనులపైనే దృష్టి పెడుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివే కంటే ఆరు నెలల స్కిల్ కోర్సు మిన్న అని వారు భావిస్తున్నారు.
సరికొత్త విద్యా విప్లవం
వ్యాపార సంస్థలు కూడా ఇప్పుడు డిగ్రీల కంటే అభ్యర్థికి ఉన్న ప్రతిభనే చూస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి మీడియా సంస్థల వరకు అందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. కాలేజీలు కూడా తమ సిలబస్ మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరుకు చెందిన నేహ వంటి విద్యార్థినిలు తమ పోర్ట్‌ఫోలియోలను పెంచుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సమాజంలో హోదా కంటే మనశ్శాంతి… సృజనాత్మకత ఉండే పనులే ముఖ్యమని నేటి తరం చాటి చెబుతోంది. ఈ మార్పు మున్ముందు మరిన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇవ్వనుంది.