చంపేయండి… తర్వాత చూసుకుందాం!! – గ్రీన్ ల్యాండ్ రక్షణ కోసం డెన్మార్క్ డైనమిజం

America Vs Greenland @Denmark
  • అమెరికా హెచ్చరికలతో యుద్ధానికి సన్నద్ధం
  • ట్రంప్ కవ్వింపులతో సైన్యానికి ఆదేశాలు
  • ఆక్రమిస్తే ఊరుకోబోమన్న ఆ దేశ రక్షణశాఖ
  • మొదట కాల్పులు జరపండి… అని హుకూం

సహనం వందే, గ్రీన్ ల్యాండ్:

అగ్రరాజ్యం అమెరికాకు, డెన్మార్క్ కు మధ్య గ్రీన్ ల్యాండ్ వివాదం ముదురుతోంది. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ తన సైన్యానికి ఇచ్చిన అత్యంత కఠినమైన ఆదేశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. తమ భూభాగంలోకి అడుగుపెడితే శత్రువు ఎవరైనా సరే తుపాకులకు పని చెప్పాలని స్పష్టం చేసింది.

మొదట కాల్పులు… ఆ తర్వాతే ఏదైనా
అమెరికా ఒకవేళ గ్రీన్ ల్యాండ్ పై దాడికి దిగితే డెన్మార్క్ సైనికులు ఏమాత్రం వెనకాడరని రక్షణ శాఖ హెచ్చరించింది. శత్రువులు చొరబడితే పై అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా తక్షణమే కాల్పులు జరపాలని సైన్యానికి సూచించింది. ‘షూట్ ఫస్ట్.. ఆస్క్ క్వశ్చన్స్ లేటర్’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది. అంటే శత్రువును హతమార్చిన తర్వాతే అతను ఎందుకు వచ్చాడో అడగాలనేది దీని సారాంశం. ఈ వ్యాఖ్యలు అగ్రరాజ్యానికి నేరుగా ఇచ్చిన హెచ్చరికగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

1952 నాటి చట్టం అమలు…
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా డెన్మార్క్ తన 1952 నాటి ఆర్మీ నిబంధనలను మరోసారి తెరపైకి తెచ్చింది. శత్రువుల దాడి జరిగినప్పుడు లేదా యుద్ధం సంభవించినప్పుడు సైన్యం తక్షణమే స్పందించాలని ఈ నియమావళి చెబుతుంది. యుద్ధం మొదలైన తర్వాత నిర్ణయాల కోసం కాలయాపన చేయకూడదని అప్పట్లోనే ఈ చట్టం చేశారు. ప్రస్తుతం అమెరికా నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిబంధన ఇంకా అమలులోనే ఉందని డెన్మార్క్ ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది.

నాటో కూటమికి ముప్పు
అమెరికా, డెన్మార్క్ రెండూ నాటో కూటమిలో సభ్యదేశాలు. ఒక సభ్యదేశం మరొక దేశంపై దాడికి దిగడం నాటో నిబంధనలకు విరుద్ధం. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమిస్తే నాటో కూటమి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెటె ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ భద్రతా వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ద్వీపం సమస్య కాదని ప్రపంచ శాంతికి సంబంధించిన విషయమని ఆమె పేర్కొన్నారు.

ట్రంప్ పట్టుదల.. గ్రీన్ ల్యాండ్ ఆరాటం
అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే గ్రీన్ ల్యాండ్ ను కొనుగోలు చేస్తామని ప్రతిపాదించారు. అయితే అప్పట్లో డెన్మార్క్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తాజాగా ఆయన మళ్లీ గ్రీన్ ల్యాండ్ పై కన్నేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్ ల్యాండ్ అత్యంత అవసరమని ఆయన వాదిస్తున్నారు. అక్కడ రష్యా, చైనా దేశాల నౌకలు తిరుగుతున్నాయని అందుకే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అవసరమైతే సైనిక బలగాలను వాడటం కూడా ఒక మార్గమని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.

ఐరోపా దేశాల మద్దతు
గ్రీన్ ల్యాండ్ వివాదంలో డెన్మార్క్ కు ఐరోపా దేశాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు డెన్మార్క్ పక్షాన నిలిచాయి. ఒక ప్రజాస్వామ్య దేశంపై ఇలాంటి బెదిరింపులు తగవని హితవు పలికాయి. గ్రీన్ ల్యాండ్ అక్కడి ప్రజలకే చెందుతుందని… దాన్ని అమ్మే ప్రసక్తే లేదని ఐరోపా నేతలు తేల్చి చెప్పారు. అమెరికా తన దూకుడును తగ్గించుకోకపోతే అంతర్జాతీయ వేదికలపై ఒంటరి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

భవిష్యత్తుపై ఉత్కంఠ
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే వారం డెన్మార్క్ అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో గ్రీన్ ల్యాండ్ అంశంపై చర్చించే అవకాశం ఉంది. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలని డెన్మార్క్ కోరుకుంటున్నప్పటికీ తన రక్షణ ఏర్పాట్లను మాత్రం సిద్ధం చేసుకుంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం కోసం రెండు మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *