ఏడు రోజుల్లో ప్రేమించడం ఎలా? – సైబర్ నేరగాళ్లకు ప్రత్యేక శిక్షణ

Love in 7 days - Cyber gangs
  • అందుకోసం ప్రత్యేకంగా హ్యాండ్ బుక్స్
  • ఎలా బుట్టలో వేసుకోవాలో ట్రిక్కులు
  • అలా ట్రైనింగ్ ఇచ్చి ప్రేమ పేరుతో దోపిడీలు
  • ఆన్ లైన్ వేదికగా రెచ్చిపోతున్న సైబర్ ముఠా
  • ఫిలిప్పీన్స్ లో బయటపడ్డ శిక్షణ పుస్తకాలు
  • ఏడు రోజుల్లోనే ఖాతా ఖాళీ చేసే వ్యూహం
  • డాక్టర్లు ఇంజనీర్లు అధికారులంటూ అబద్ధాలు
  • అమాయక మహిళలు, పురుషులే లక్ష్యం

సహనం వందే, ఫిలిప్పీన్స్:

స్మార్ట్ ఫోన్ లో చిన్న హలో అంటూ పలకరిస్తారు. అందమైన మాటలతో దగ్గరవుతారు. నిలువెత్తు ప్రేమని ఏడు రోజుల్లో కురిపిస్తూ నమ్మిస్తారు. తీరా వలలో పడ్డాక నిలువు దోపిడీ చేస్తారు. దీనినే సైబర్ లోకంలో పిగ్ బుచరింగ్ అని పిలుస్తున్నారు. అంటే పందిని కోయడానికి ముందు మేత వేసి పెంచినట్టుగా బాధితులను నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. ఈ దారుణమైన మోసాల వెనుక పెద్ద ముఠాలే పనిచేస్తున్నాయి.

7 Days Love Operation chat

బయటపడ్డ నేరగాళ్ల మాస్టర్ ప్లాన్
ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన పోలీసు దాడుల్లో ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కీలకమైన శిక్షణ పుస్తకాలు దొరికాయి. చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ హ్యాండ్ బుక్స్ లో బాధితులను ఎలా బుట్టలో వేసుకోవాలో రాసి ఉంది. రాయిటర్స్ సంస్థ వీటిని విశ్లేషించింది. ముఖ్యంగా బాధితుల మానసిక స్థితిని బట్టి ఎలా ప్రవర్తించాలో ఇందులో వివరించారు. ఈ ముఠాలు ఇండస్ట్రియల్ స్థాయిలో క్యాంపులు నడుపుతూ అమాయకులను దోచుకుంటున్నాయి.

ఏడు రోజుల ఆపరేషన్
బాధితులతో మొదటి రోజు ఎలా మాట్లాడాలి… ఏడో రోజు నాటికి వారి నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలో ఇందులో స్పష్టంగా ఉంది. మొదటి రోజు పరిచయం పెంచుకుని రెండో రోజు నుంచి పెట్టుబడుల గురించి చర్చించాలి. ఐదో రోజు నాటికి వారితో ప్రేమలో ఉన్నట్టు నటించాలి. ఇక ఏడో రోజు రాగానే నకిలీ వెబ్ సైట్లలో పెట్టుబడులు పెట్టించాలి. ఇలా వారం రోజుల్లోనే బాధితుల జీవితాలను ఈ ముఠాలు రోడ్డున పడేస్తున్నాయి.

నకిలీ ముసుగులో కీచకులు
నేరగాళ్లు తమ అసలు గుర్తింపును ఎప్పుడూ బయటపెట్టరు. తమ ప్రొఫైల్ ఫోటోల నుంచి ఉద్యోగం వరకు అంతా అబద్ధమే చెబుతారు. మహిళలను ఆకర్షించేందుకు డాక్టర్లు లేదా ఆర్మీ ఆఫీసర్లుగా నటిస్తారు. పురుషులను బుట్టలో వేసేందుకు అందమైన అమ్మాయిల ఫోటోలు వాడుకుంటారు. నిత్యం పలకరింపులు, పొగడ్తలతో బాధితులు తమను తప్ప ఎవరినీ నమ్మకుండా చేస్తారు. ఇలా మానసికంగా లొంగదీసుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం.

భారీగా దోచుకుంటున్న వైనం
బ్రిటన్ కు చెందిన బార్క్ లేస్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఈ మోసాల్లో పురుషులు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. కానీ మహిళలు నష్టపోయే మొత్తం చాలా ఎక్కువగా ఉంటోంది. ఓ బాధితురాలు రిచర్డ్ అనే వ్యక్తిని నమ్మి ఏకంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. క్రిప్టో కరెన్సీ, విదేశీ ప్రయాణాల పేరుతో ఈ ముఠాలు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు లాగేస్తున్నాయి. వీరు వాడే పదజాలం అంతా బాధితుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఉంటుంది.

ఏఐతో మరింత ప్రమాదం
ప్రస్తుతం కృత్రిమ మేధస్సు అందుబాటులోకి రావడంతో ఈ మోసాలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో దొరికే ఫోటోలు, వీడియోలను మార్చేసి బాధితులను నమ్మిస్తున్నారు. డేటింగ్ యాప్ లలో అమాయకంగా ప్రవేశించే వారే వీరి ప్రధాన లక్ష్యం. ఫిలిప్పీన్స్ లో దొరికిన పుస్తకాల ప్రకారం వీరు బ్రెజిల్, చైనా వంటి దేశాల్లోని ప్రజలను కూడా దోచుకుంటున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాలు రాగానే సీనియర్ ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు.

జాగ్రత్తగా ఉండాల్సిందే
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ పేరుతో త్వరగా దగ్గరయ్యే వారిని అనుమానించాలి. పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేసినా లేదా అత్యవసరంగా డబ్బు కావాలని అడిగినా అది మోసం అని గుర్తించాలి. ఫిలిప్పీన్స్ లో ఈ అక్రమాలకు పాల్పడుతున్న ఆలిస్ గువో అనే మహిళకు ఇప్పటికే జీవిత కారాగార శిక్ష వేశారు. ఎంతటి కఠిన చట్టాలు వచ్చినా ప్రజల్లో అవగాహన లేకపోతే ఈ సైబర్ దోపిడీ ఆగదని అధికారులు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *