ఉత్తరాంధ్ర బిడ్డకు కలిశెట్టి అండ – ఆసియా అథ్లెటిక్స్‌లో జ్యోతికి బంగారు పతకం

Jyothi - Asian Games Gold Medal
  • ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందన
  • సీఎం చంద్రబాబు దృష్టికి జ్యోతి విజయం
  • రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ
  • పేదరికంపై పోరాడి గెలిచిన ఉత్తరాంధ్ర బిడ్డ

సహనం వందే, విజయనగరం:

ఉత్తరాంధ్ర మట్టిలో మాణిక్యం మెరిసింది. అడ్డంకులను అధిగమించి ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. ఆసియా అథ్లెటిక్క్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి యర్రాజీ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదరికాన్ని జయించి పతకాల వేటలో సాటిలేని మేటిగా నిలిచిన ఈ అథ్లెట్ ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. ఆమె సాధించిన స్వర్ణ పతకం భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

మరోసారి ఆసియా విజేత
జ్యోతి
యర్రాజీ మరోసారి తన సత్తా చాటింది. కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం గెలిచింది. 12.96 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా స్థాయిలో వరుసగా రెండుసార్లు స్వర్ణం గెలవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ప్రతికూల వాతావరణంలో కూడా ఆమె చూపిన వేగం స్టేడియంను హోరెత్తించింది. ఈ విజయంతో జ్యోతి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది.

ఎంపీ అప్పలనాయుడు వీడియో కాల్:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
జ్యోతిని వీడియో కాల్ ద్వారా అభినందించారు. ఆమె సాధించిన విజయం ఉత్తరాంధ్ర గర్వించదగ్గ విషయమని కొనియాడారు. రికార్డులు సృష్టించడం గొప్ప విషయమని ఆమెను ప్రశంసించారు. ధైర్యంగా ఉండాలని… భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ స్థాయిలో మెరవడం స్ఫూర్తిదాయకమని ఎంపీ పేర్కొన్నారు.

ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ…
రాష్ట్ర ప్రభుత్వం నుంచి జ్యోతికి పూర్తి మద్దతు ఉంటుందని ఎంపీ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులతో కూడా చర్చిస్తామని తెలిపారు. క్రీడాకారులకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. భవిష్యత్తులో జ్యోతికి ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. దీనిపై అప్పలనాయుడుకు జ్యోతి కృతజ్ఞతలు తెలిపింది.

సామాన్య కుటుంబం నుంచి
జ్యోతి నేపథ్యం ఎందరికో ఆదర్శం. ఆమె పేదరికంలో జీవిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని స్థితిలో అథ్లెటిక్స్‌లో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. తన వేగాన్ని ఆయుధంగా మలుచుకుని హర్డిల్స్ రేసులో తిరుగులేని శక్తిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడి ఈ స్థాయికి చేరుకుంది. నేడు దేశం గర్వించే స్థాయిలో నిలబడింది.

రికార్డుల వేటలో జ్యోతి
భారత అథ్లెటిక్స్‌లో జ్యోతి ఒక సంచలనం. 100 మీటర్ల హర్డిల్స్‌ను 13 సెకన్ల లోపే పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా ఆమె పేరిట రికార్డు ఉంది. గతేడాది 12.78 సెకన్ల జాతీయ రికార్డును నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొని చరిత్ర సృష్టించింది. మధ్యలో గాయాలు వేధించినా మళ్ళీ అంతే వేగంతో మైదానంలోకి దూసుకొచ్చింది. ఒడిశాలోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటోంది.

యువతకు స్ఫూర్తి ప్రదాత
ప్రస్తుతం జ్యోతి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుతోపాటు క్రీడల్లోనూ ఆమె రాణిస్తున్న తీరు అద్భుతం. పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని ఆమె నిరూపించింది. రాబోయే రోజుల్లో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తోంది. జ్యోతి సాధించిన విజయాలు కేవలం ఆమెకే పరిమితం కాకుండా ఎంతోమంది గ్రామీణ క్రీడాకారుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. మరిన్ని రికార్డులు ఆమె ఖాతాలో చేరాలని క్రీడా లోకం కోరుకుంటోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *