- సెలవుల్లో ఇళ్లకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
- మళ్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా పిడుగు
- ఈనెల 26 వరకున్న స్లాట్లు ఆకస్మికంగా క్లోజ్
- వందల మంది టెక్కుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
- సోషల్ మీడియా ప్రొఫైల్స్ తనిఖీనే కారణం
- ఉద్యోగాలు పోతాయనే భయంలో టెకీలు
సహనం వందే, హైదరాబాద్:
అమెరికా కల ఇప్పుడు భారతీయ టెక్కీల పాలిట కన్నీటి గాధగా మారుతోంది. క్రిస్మస్ సెలవులకు సరదాగా సొంతూరికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఇక్కడే బందీలుగా మిగిలిపోయారు. అమెరికా కాన్సులేట్ల ఆకస్మిక నిర్ణయాలతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అగ్రరాజ్యపు వీసా ఆంక్షలు భారతీయ మేధోసంపత్తిని అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గందరగోళంలో వీసా స్లాట్లు
అమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు ఇప్పుడు పెద్ద విపత్తుగా మారింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య ఉన్న వేల అపాయింట్మెంట్లను కాన్సులేట్లు ఒక్కసారిగా రద్దు చేశాయి. ఇమ్మిగ్రేషన్ లాయర్లు సైతం ఈ పరిణామంతో షాక్ తిన్నారు. సాధారణంగా సెలవుల సమయంలో ఇండియాకు వచ్చి వీసా స్టాంపింగ్ చేసుకునే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆ స్లాట్లు రద్దు కావడంతో టెక్కీలు స్వదేశంలోనే ఇరుక్కుపోయారు. లాయర్లు చెబుతున్న దాని ప్రకారం ఈ రద్దులు ముందస్తు సమాచారం లేకుండానే జరిగాయి. దీనివల్ల వందల మంది హెచ్1బీ హోల్డర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
సోషల్ మీడియా నిఘా
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే ఈ గందరగోళానికి అసలు కారణం. డిసెంబర్ 15 నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ తనిఖీ చేయడం మొదలైంది. వెట్టింగ్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత ప్రొఫైల్స్ వివరాలను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అదనపు తనిఖీల వల్ల కాన్సులేట్లలో పనిభారం పెరిగింది. ఫలితంగా రోజుకు చేసే ఇంటర్వ్యూల సంఖ్యను అధికారులు భారీగా తగ్గించేశారు. దాంతో ఇప్పుడు రద్దైన అపాయింట్మెంట్లు 2026 మార్చి లేదా ఏప్రిల్ వరకు రీషెడ్యూల్ అవుతున్నాయి. కొందరికైతే జూలై వరకు కూడా స్లాట్లు దొరకడం లేదు.
కెరీర్లకు పొంచి ఉన్న ముప్పు
ఇండియాలో చిక్కుకున్న వారు ఇప్పుడు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని కంపెనీలు రిమోట్ వర్కుకు అనుమతి ఇవ్వకపోతే వారి కెరీర్ దెబ్బతింటుంది. అపాయింట్మెంట్లు మార్చి వరకు వాయిదా పడటంతో అప్పటిదాకా సెలవుల్లో ఉండటం అసాధ్యం. ఇప్పటికే అమెరికాలో లేఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో వీసా లేక ఇండియాలోనే ఉండిపోతే కంపెనీలు తొలగించే ప్రమాదం ఉంది. చాలా మంది ఇప్పటికే జీతం లేని సెలవులపై ఉన్నారు. భార్యాపిల్లలు అమెరికాలో ఉండగా గృహస్తులు ఇక్కడ ఇరుక్కుపోవడంతో మానసిక వేదన అనుభవిస్తున్నారు.
భారత టాలెంట్ పై దెబ్బ
హెచ్1బీ వీసాల్లో 70 శాతం పైగా భారతీయులకే లభిస్తాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు భారతీయుల టాలెంట్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ వీసా జాప్యాలు టెక్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. భారతీయ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వారిని ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల అమెరికాకే నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలెంట్ ప్రవాహం తగ్గితే అమెరికా తన అగ్రస్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇతర దేశాలు ఈ అవకాశాన్ని వాడుకుని భారతీయ నిపుణులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
అంతర్జాతీయ సంబంధాల సెగ
ఈ నిర్ణయం భారత్, అమెరికా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ప్రభావం చూపేలా ఉంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం భారతీయులకు శాపంగా మారుతోంది. వీసా విధానాలను కఠినతరం చేయడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్ ఉంది. యూఎస్ అధికారులు దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాధిత టెక్కీలు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. భారత్ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికాతో చర్చలు జరపాలని బాధితులు కోరుతున్నారు.