‘దీపం’ మంటల్లో న్యాయమూర్తి – మద్రాస్ న్యాయమూర్తి స్వామినాథన్‌కు సెగ

Swamynathan
  • తిరుప్పరన్ కుండ్రం కొండపై దీపం వివాదం
  • అభిశంసానికి 100 మంది ఎంపీల ప్రతిపాదన
  • 56 మంది మాజీ న్యాయమూర్తుల ఆగ్రహం!
  • ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని విమర్శలు

సహనం వందే, న్యూఢిల్లీ:

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ 100 మందికి పైగా ఎంపీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా 50 మందికి పైగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ చర్య న్యాయమూర్తులను బెదిరించే ప్రయత్నమేనని… ఇది ప్రజాస్వామ్య మూలాలను, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని వారు మండిపడ్డారు.

మాజీ న్యాయమూర్తుల హెచ్చరిక!
కార్తీక దీపం వెలిగించడానికి సంబంధించి జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ అభిశంసన తీర్మానం ముందుకు వచ్చింది. ఎంపీలు తమ తీర్మానంలో పేర్కొన్న కారణాలను పరిగణనలోకి తీసుకున్నా ఒక న్యాయమూర్తిని తొలగించేంతటి ‘అసాధారణమైన, తీవ్రమైన రాజ్యాంగ చర్య’కు అవి ఏమాత్రం సరిపోవని మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఒక న్యాయమూర్తి తీర్పు రాజకీయ పార్టీల అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు వారిని అపఖ్యాతి పాలుచేసేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ధోరణిలో భాగమేనని వారు తీవ్రంగా హెచ్చరించారు.

రాజకీయ ప్రతీకారం: న్యాయవ్యవస్థపై దాడి!
మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో న్యాయవ్యవస్థపై జరిగిన దాడులను గుర్తు చేశారు. కేశవానంద భారతి కేసు తర్వాత ముగ్గురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పక్కన పెట్టడం… ఏడీఎం జబల్‌పూర్ కేసులో వ్యతిరేక తీర్పు ఇచ్చిన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాను పక్కన పెట్టడం వంటి సంఘటనలను ఉదహరించారు. అలాగే గతంలో మాజీ ప్రధాన న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్‌తోపాటు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌పై జరుగుతున్న విమర్శలనూ ప్రస్తావించారు. ఇది కేవలం న్యాయబద్ధమైన విమర్శ కాదని… అభిశంసన అనే రాజ్యాంగ సాధనాన్ని రాజకీయ ఒత్తిడికి… ప్రతీకారానికి ఆయుధంగా మార్చే ప్రయత్నమని మాజీ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీర్పు వెనుక మతపరమైన చిక్కులు…
తిరుప్పరన్ కుండ్రం కొండపై ఉన్న దీపస్థంభంపై కార్తీక దీపం వెలిగించడానికి జస్టిస్ స్వామినాథన్ ఉత్తర్వులు ఇవ్వడంతోనే ఈ రాజకీయ తుఫాన్ మొదలైంది. ఆ ప్రాంతం సికిందర్ బదుషా దర్గాకు దగ్గరగా ఉండటం వల్ల సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకు డిసెంబర్ 4 సాయంత్రం 6 గంటలలోపు దీపం వెలిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దర్గా సామీప్యాన్ని పరిగణలోకి తీసుకున్నా దీపం వెలిగించడం వల్ల ముస్లింల హక్కులకు భంగం కలగదని… పైగా దీపం వెలిగించకపోతే ఆలయ కొండపై ఉన్న హక్కులు బలహీనపడే అవకాశం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపి ఈ ఉత్తర్వుపై చర్యలు తీసుకోలేదు. దీనివల్లే మతపరమైన గ్రూపులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *