అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

Maseedu@Ayodhya
  • వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి శంకుస్థాపన
  • సమీపంలో 5 ఎకరాల స్థలం కేటాయింపు
  • ఇండియన్ ముస్లిం వక్ఫ్ ట్రస్ట్ వెల్లడి
  • దేశంలో సంచలన రాజకీయ పరిణామం
  • భారతీయ, ఇస్లామిక్ వాస్తుశిల్పంతో నిర్మాణం
  • రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు
  • అయోధ్యలో మత సామరస్య రాజకీయం!
  • 33 ఏళ్ల మత రాజకీయ ఉద్రిక్తతకు ముగింపు?

సహనం వందే, అయోధ్య:

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది దేశ రాజకీయాల్లో సామరస్య స్థాపన అంశాన్ని తెరపైకి తెస్తోంది.

Babri Mosque Place

రామాలయం పక్కనే మసీదు… కేంద్రానికి పరీక్ష!
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముస్లిం సమాజానికి మసీదు నిర్మాణం కోసం అయోధ్య ప్రాంతంలోని ధన్నీపుర్ గ్రామంలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ కొత్త మసీదు నిర్మాణానికి బాధ్యత వహించిన ఇండియన్ ముస్లిం వక్ఫ్ ట్రస్ట్ అధ్యక్షుడు జమీల్ అహ్మద్ వెల్లడించిన ప్రకారం… ఈ ప్రాజెక్టు పనులు 2026 ఏప్రిల్ నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మసీదు నిర్మాణానికి భారతీయ, ఇస్లామిక్ వాస్తుశిల్పాల మిశ్రమంతో నిర్మించాలని ట్రస్ట్ నిర్ణయించింది.

మసీదుతో పాటు లైబ్రరీ, కమ్యూనిటీ సెంటర్లను కూడా నిర్మించనున్నారు. రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు అయోధ్యలోని రామాలయం పక్కనే సామరస్యం పేరుతో మరో రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది.

సామరస్యం ట్రేడ్ మార్క్: ప్రధాని ట్వీట్!
బాబ్రీ మసీదు కూల్చివేత రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శాంతి సమావేశాలు నిర్వహించడం ఈసారి రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించడం గమనార్హం. ‘భారతదేశం సామరస్యం… శాంతి దేశం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ కొత్త మసీదు ప్రాజెక్టు మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుందని ట్రస్ట్ అధ్యక్షుడు జమీల్ అహ్మద్ చెబుతున్నారు. ఒకవైపు హిందూ యాత్రోత్సవాలకు కేంద్రంగా మారిన అయోధ్యలో మరోవైపు మసీదు నిర్మాణం చేపట్టడం అనేది భారతీయ భిన్నత్వంలో ఏకత్వానికి, రాజ్యాంగపరమైన లౌకికత్వానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది దేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా మారుతుందని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *