ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

Indigo
  • పెళ్లిళ్లు కూడా వాయిదా పడిన దుస్థితి
  • ఇదంతా యాజమాన్యం ఆడిన గేమ్
  • దిక్కులు చూస్తున్న విమానయానశాఖ
  • ఐదు రోజులుగా మౌనం దాల్చిన కేంద్రం
  • చార్జీల డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు

సహనం వందే, హైదరాబాద్:

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు.

కావాలని సృష్టించిన సంక్షోభం…
దేశంలో గగనయానంపై ఇండిగో గుత్తాధిపత్యం ఏ స్థాయిలో ఉందో విమానాల రద్దే నిదర్శనం. ఎలాంటి కారణం లేకుండా లక్షలాదిమంది ప్రయాణికుల జీవితాలతో ఆ సంస్థ ఆటలాడుకుంది. ఇన్ని రోజులుగా ఇండిగో ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇదంతా కేవలం పైలట్ల కొరత వల్లనో నిర్వహణా లోపం వల్లనో జరిగింది కాదట! ఈ సంక్షోభం యాదృచ్ఛికం కాదు… కావాలనే సృష్టించారని ఏకంగా ఇండిగో ఉద్యోగులే బహిరంగ లేఖలో ఆరోపించారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కొత్తగా తీసుకొచ్చిన పని గంటలు, విశ్రాంతి నియమాలను సడలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే యాజమాన్యం వ్యూహాత్మకంగా సర్వీసులను రద్దు చేసిందనేది వారి ప్రధాన ఆరోపణ. అంటే ప్రయాణీకుల కష్టాలను పావుగా వాడుకుని కంపెనీ లాభాల కోసం ఇండిగో యాజమాన్యం ఈ డ్రామా ఆడింది.

కేంద్రం తీరు… కప్పిపుచ్చే ప్రయత్నం!
పెద్ద ఎత్తున రావడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం శనివారం తూతూ మంత్రపు చర్యలకు దిగింది. తప్పంతా ఇండిగో యాజమాన్యానిదే అని… సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హెచ్చరించారు. అయితే ఒకపక్క దర్యాప్తు అంటూనే ఇంకోపక్క పైలట్ల విశ్రాంతి, నైట్ డ్యూటీల నిబంధనల్లో ఇండిగోకు తాత్కాలికంగా సడలింపులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇది సంక్షోభానికి కారకులైన ఇండిగోకు వెసులుబాటు కల్పించడమే అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఏ ఒక్క ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడకుండా పౌర విమానయానశాఖ కఠిన నియమాలను రూపొందించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *