- 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం త్యాగం
- ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఈశ్వర్ మృతి
- తెలంగాణ కోసం శ్రీకాంతాచారి వీరమరణం
- బీసీ రిజర్వేషన్లకు ఈశ్వరాచారి ప్రాణత్యాగం
- ఉద్యమాలలో పిట్టల్లా రాలిన చారి బ్రదర్స్
- రేవంత్ సర్కారుపై ఉద్యమం ఉధృతం!
సహనం వందే, హైదరాబాద్:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ఈశ్వర్ గురువారం హైదరాబాదులో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడవడంతో బీసీ వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.
పోలీసుల నిర్బంధం: ఉద్యమ నేతల అరెస్ట్
సాయి ఈశ్వర్ మరణ వార్త తెలుసుకున్న వందలాది మంది బీసీ సంఘాల కార్యకర్తలు ఉదయం నుంచే గాంధీ ఆసుపత్రి వద్దకు పోటెత్తారు. దీంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వారిని బొల్లారం, తిరుమలగిరి, అంబర్‌పేట, ఉప్పల్ వంటి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి ఈశ్వర్ మృతికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు.
బీసీ సంఘాల అల్టిమేటం…
42 శాతం రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలని బీసీ సంఘాల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తక్షణమే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక బీసీ ద్రోహులైన కాంగ్రెస్, బీజేపీల నాయకుల ఇళ్లను ముట్టడించాలని, ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సాయి ఈశ్వర్ మృతిపై పార్లమెంటులో చర్చ జరగాలని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీల వైఖరి ప్రకటించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేయడంతో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు బీసీల నుంచి పెను ముప్పు ఎదురుకాబోతోంది.