- డిస్ లైక్ దేశాల్లో చైనా టాప్… అమెరికా నెక్స్ట్
- వరల్డ్ పాపులేషన్ రివ్యూ టాప్ 10లో మనం
- కోవిడ్ విషయంలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత
- తామే హీరోలమన్న అమెరికన్ల తీరుపై వెగటు
- ఇండియాలో మీడియా స్వేచ్ఛ లేదన్న భావన
సహనం వందే, అమెరికా:
ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రజలు అత్యంత ఎక్కువగా డిస్‌లైక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన 2025 ప్రపంచ సర్వే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ద్వేషించే దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, తైవాన్ వంటి ప్రాంతాల స్వేచ్ఛను అణచివేయడం… ఉయ్‌ఘుర్ ముస్లింలపై దాడులు… మానవ హక్కుల ఉల్లంఘనలు… కోవిడ్ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది చైనాను ఇష్టపడడం లేదని తేలింది.

అహంకారం... యుద్ధాలే అమెరికాకు శాపం
ప్రపంచంలో పెత్తనం చలాయించడం, అవసరం లేకపోయినా ఇతర దేశాల సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, గన్ కల్చర్, అమెరికన్ల అహంకార భావన… ఇవన్నీ ఆ దేశాన్ని ప్రపంచ ప్రజల దృష్టిలో రెండో స్థానంలో నిలబెట్టాయి. తాము మాత్రమే హీరోలమని, ప్రపంచాన్ని శాసించే అధికారం తమకే ఉందని అమెరికన్లు భావించడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక రష్యా మూడో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం, నిరంకుశ పాలన, అణ్వాయుధాలపై ఆసక్తి వంటి కారణాలు రష్యా పట్ల అంతర్జాతీయంగా వ్యతిరేకత పెంచాయి.
ఉత్తర కొరియాలో రహస్య పాలన…
ప్రపంచంలోని నియంతృత్వ రాజ్యాలు ఈ జాబితాలో ముందు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర కొరియా రహస్య పాలన, అణ్వాయుధాలపై అధిక ఆసక్తి కారణంగా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక మధ్యప్రాచ్య దేశాలైన ఇజ్రాయిల్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా వరుసగా ఐదు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. ఇజ్రాయిల్ పాలస్తీనాతో ఘర్షణలు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇరాన్ స్వేచ్ఛను హరించడం, ఇరాక్, సిరియాలో అంతర్యుద్ధాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఈ దేశాలకు తీవ్ర అపకీర్తిని తెచ్చాయి.
ఇండియాలో మీడియా స్వేచ్ఛ లేదని…
ఆశ్చర్యకరంగా భారత్ కూడా ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలకు తక్కువ స్వేచ్ఛ ఇవ్వడం, పాకిస్తాన్, చైనాతో సరిహద్దు ఘర్షణలు, మీడియా స్వేచ్ఛ లేకపోవడం వంటి అంశాలు భారత్ పట్ల నెగటివ్ ఇమేజ్‌ను పెంచాయని సర్వే స్పష్టం చేసింది. అయితే భారత్ సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ… రాజకీయ, పాలనాపరమైన సమస్యలు ఈ దేశాన్ని డిస్‌లైక్ జాబితాలో చేర్చడం గమనార్హం.
ఇది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక!
ఈ సర్వే ప్రపంచ రాజకీయాలను, దేశాల మధ్య సంబంధాలను విశ్లేషిస్తోంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెప్పుకునే చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలు సైతం ప్రజల మనసుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. మానవ హక్కులను ఉల్లంఘించడం, యుద్ధాలు, నియంత్రణ వంటి అంశాలే దేశాల పట్ల ప్రజలకు అసహ్యం పెంచాయి. భారత్ వంటి పెద్ద దేశం కూడా ఈ జాబితాలో ఉండటం, పాలకులు తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. లేదంటే ఈ అపకీర్తి దేశాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.