- విద్యార్థులను నిలువెల్లా మోసం చేసిన దుస్థితి
- ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి రద్దు చేసిన కార్పొరేట్లు
- అలాగే ఒప్పంద ప్యాకేజీని చేరాక తగ్గించారు
- మరో ఉద్యోగం వెతుక్కునే అవకాశం లేని స్థితి
- ఈ నేపథ్యంలో మానసిక వేదనలో విద్యార్థులు
- గత అనుభవాల నేపథ్యంలో కంపెనీలపై వేటు
- వాటికి దేశంలోని అన్ని ఐఐటీల్లో ప్రవేశం లేదు
- ఈ నిర్ణయంపై అన్ని ఐఐటీల విద్యార్థుల హర్షం
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నుంచి 20కి పైగా కంపెనీలను శాశ్వతంగా నిషేధించాయి. విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చి వారు చేరే సమయానికి సరిగ్గా ముందు ఉద్యోగాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల్లో అగ్ని రాజుకుంది. అంతేకాదు ఇంటర్వ్యూలలో ఒప్పందం కుదుర్చుకున్న ప్యాకేజీని… ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గించడం వంటి దారుణాలకు బడా కంపెనీలు పాల్పడ్డాయి. దీంతో ఐఐటీలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. కార్పొరేట్ ప్రపంచం నయవంచనకు పాల్పడుతూ ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడాన్ని ఐఐటీలు తీవ్రంగా ఖండించాయి.

నమ్మకద్రోహం… విద్యార్థుల జీవితాలతో ఆట
గత విద్యా సంవత్సరంలో ఈ కంపెనీలు చేసిన పని అత్యంత అమానుషం. విద్యార్థులు కోరుకున్న ప్యాకేజీతో ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. చాలా ఐఐటీలలో ఆఫర్ దొరికిన విద్యార్థులు తదుపరి క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అనుమతి ఉండదు. ఈ నిబంధనను అలుసుగా తీసుకుని విద్యార్థులు ఉద్యోగంలో చేరేందుకు కేవలం రెండు రోజుల ముందు ఆఫర్లను రద్దు చేశాయి. దీంతో విద్యార్థులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ… 30 లక్షల రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేశారని… అయితే చేరేందుకు రెండు రోజుల ముందు ఆ ఉద్యోగం రద్దైందని వాపోయాడు.
ఐఐటీల ఉమ్మడి యుద్ధం…
కార్పొరేట్ కంపెనీల ఈ నయవంచన కేవలం ఒక ఐఐటీకే పరిమితం కాలేదు. ఈ కంపెనీలు ఆరేడు ఐఐటీల్లో ఇలాంటి మోసాలకు పాల్పడ్డాయి. దీంతో 15 ఐఐటీల ప్లేస్‌మెంట్ సమన్వయకర్తలు ఏకతాటిపైకి వచ్చి ఈ సంస్థలపై నిషేధం విధించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. కొన్ని కంపెనీలకు గతంలోనూ ఇలాంటి చరిత్ర ఉండడం, మరికొన్ని సంస్థలు ఆఫర్ చేసిన జీతాల ప్యాకేజీని సైతం తగ్గించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కఠిన చర్య తీసుకున్నారు. విద్యార్థుల కెరీర్ భవిష్యత్తు, మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఐఐటీలు స్పష్టం చేశాయి.
కొత్త దిశగా అడుగులు…
నిషేధానికి గురైన ఈ కంపెనీలు ఆఫ్-క్యాంపస్ విధానంలో విద్యార్థులను తీసుకోవచ్చు. అది ఐఐటీలకు సంబంధం లేదు. అది పూర్తిగా విద్యార్థికి కంపెనీకి మధ్య ఉన్న బాండ్ మాత్రమే. కానీ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు మాత్రం దూరంగా ఉండాలి. ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో ఐఐటీలు ఈసారి కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విక్షిత్ భారత్ కార్యక్రమం కింద ప్రోత్సహిస్తున్న స్టార్టప్‌లు, అలాగే ప్రముఖ క్యాంపస్‌లలో ఇంక్యుబేట్ అయిన స్టార్టప్‌లు ప్లేస్‌మెంట్స్‌లో ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఉద్యోగావకాశాలను పెంచేందుకు మరిన్ని కంపెనీలకు చేరువవుతూ విద్యార్థులకు భరోసా ఇవ్వడమే ఐఐటీల లక్ష్యంగా ఉంది. ఆఫర్లు రద్దు చేసి మోసం చేసిన సంస్థలకు తమ క్యాంపస్‌లలో స్థానం లేదని ఐఐటీలు తేల్చి చెప్పాయి.