- ఆస్పత్రి బిల్లుల చెల్లింపునకు అనేక కొర్రీలు
- ‘ఈ చికిత్సకు కవరేజ్ లేదంటూ’ పలాయనం
- ఒక్కోసారి లక్షల బిల్లుకు వేలు చెల్లింపు
- ఆరోగ్య బీమా కంపెనీల మాఫియా రాజ్యం
- ఏమాత్రం పట్టింపులేని ప్రభుత్వ యంత్రాంగం
సహనం వందే, హైదరాబాద్:
ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది. ఎంత ఫైట్ చేసినప్పటికీ కంపెనీ ఒప్పుకోలేదు. గత్యంతరం లేక ఆసుపత్రికి పూర్తి బిల్లు సొమ్ము చెల్లించాడు.

తీపి మాటలతో ఊబిలోకి…
ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ జేబులో నుంచి ఆసుపత్రికి చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇన్సూరెన్స్ చేర్పించేటప్పుడు ‘లక్షలు ఖర్చయినా మీ జేబులోంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు’ అని ఎంతో తీయగా మాటలు చెప్పే ఇన్సూరెన్స్ కంపెనీలు… బిల్లుల చెల్లింపు విషయంలో తప్పించుకుంటున్నాయి. ‘ఈ చికిత్సకు కవరేజ్ లేదు… ముందుగా మాకు చెప్పలేదు… ఇది పాత రోగం’ అంటూ వందల సాకులు చెప్పి కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. ఫలితం? మనం ఏళ్ల తరబడి కట్టిన ప్రీమియం వృథా కాగా… చికిత్స ఖర్చు మొత్తం సొంతంగా భరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
20% లోపే బిల్లు చెల్లింపు…
బీమా కంపెనీల మోసానికి గణాంకాలే పెద్ద సాక్ష్యం. గత సంవత్సరంతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రజలు దాఖలు చేసిన ఆరోగ్య క్లెయిమ్‌ల సంఖ్య దాదాపు 22 శాతం పెరిగింది. కానీ ఈ క్లెయిమ్‌లకు బదులుగా కంపెనీలు చెల్లించిన మొత్తం కేవలం 13 శాతం మాత్రమే పెరిగింది. క్లెయిమ్‌లు పెరిగిన వేగానికి… చెల్లింపులు పెరిగిన వేగానికి మధ్య దాదాపు 9 శాతం వ్యత్యాసం ఉంది. దీని అర్థం ఏమంటే… దాఖలైన క్లెయిమ్‌లలో ఎక్కువ భాగాన్ని ఏదో ఒక కారణం చూపి కంపెనీలు తిరస్కరిస్తున్నాయి లేదా తగ్గించి చెల్లిస్తున్నాయి. లక్ష రూపాయల బిల్లుకు కేవలం 18 వేలు మాత్రమే ఇచ్చారంటూ సోషల్ మీడియాలో రోదిస్తున్న బాధితుల ఆక్రందనలే ఈ కంపెనీల నీచ స్వభావానికి నిదర్శనం. అంటే ఆసుపత్రి బిల్లులో 20 శాతం లోపే చెల్లిస్తున్నాయన్నమాట.
సీనియర్ సిటిజెన్ల పరిస్థితి దారుణం…
ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చులు గత ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆ ఖర్చులకు అనుగుణంగా ప్రీమియం ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఒక్కసారిగా 50 నుంచి 60 శాతం వరకు ప్రీమియం పెంచేసి నిలువుదోపిడీ చేశారు. ఈ దారుణం ఎక్కువ కావడంతో నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ జోక్యం చేసుకుని, ‘సంవత్సరానికి 10 శాతం మించి పెంచడానికి వీలు లేదు’ అని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ పది శాతం పెంపుతో కూడా 70 ఏళ్ల వృద్ధులు సంవత్సరానికి లక్ష రూపాయల దాకా ప్రీమియం కడుతున్నారు. ఇంత డబ్బులు కట్టినా అవసరమైన సమయంలో క్లెయిమ్ వస్తుందన్న భరోసా మాత్రం దొరకడం లేదు.
లాభాల దాహం తప్ప... కఠిన చట్టాలు లేవీ…
ఈ బీమా వ్యవస్థలో నియంత్రణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐఆర్‌డీఏఐ రూల్స్ ఉన్నా కంపెనీలు వాటిని కాగితాల మీద పెట్టి ఆచరణలో తమ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్న కంపెనీలకు కఠిన శిక్షలు అవసరం. అంతేకాకుండా ప్రతి క్లెయిమ్‌ను నిష్పక్షపాతంగా పరిశీలించేందుకు ఒక స్వతంత్ర సంస్థ వెంటనే ఏర్పాటు కావాలి. లేకపోతే ఆరోగ్య బీమా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడకపోగా వారి జేబుల్ని కాజేసే పెద్ద ఉచ్చుగా మారుతుంది. అందుకే బీమా కట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.